పునరావాసం కల్పించాకే.. పోలవరంలో నీటి నిల్వ | Sakshi
Sakshi News home page

పునరావాసం కల్పించాకే.. పోలవరంలో నీటి నిల్వ

Published Thu, Jun 1 2023 6:08 AM

Central Govt Committee On Water storage in Polavaram Rehabilitation - Sakshi

సాక్షి, అమరావతి: నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర కమిటీ దిశానిర్దేశం చేసింది. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో లైడార్‌ సర్వే ప్రకారం ముంపునకు గురయ్యే గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ ఝా అధ్యక్షతన కేంద్ర జల్‌ శక్తి శాఖ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల కార్యదర్శులు పంకజ్‌కుమార్, సౌరబ్‌గార్గ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, పీపీఏ సీఈవో, రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌ శ్రీధర్‌ సభ్యులుగా కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశాన్ని బుధవారం వర్చువల్‌గా చైర్మన్‌ అనిల్‌కుమార్‌ ఝా నిర్వహించారు. 

నిధులిస్తే మరింత త్వరితగతిన పునరావాసం
పోలవరం తొలి దశ పనుల పూర్తికి సంబంధించి సవరించిన అంచనా వ్యయం రూ.16,952.07 కోట్లకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని.. ఆ మేరకు నిధులిస్తే మరింత త్వరితగతిన పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర అధికారులు కేంద్ర కమిటీకి వివరించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో తొలుత 123 గ్రామాలు ముంపునకు గురవుతాయని గుర్తించామని.. వాటిలోని 20,946 కుటుంబాలకుగానూ ఇప్పటికే 12,060 కుటుంబాలకు పునరావాసం కల్పించామని రాష్ట్ర అధికారులు వివరించారు.

ఇటీవల నిర్వహించిన లైడార్‌ సర్వేలో వాటితోపాటు మరో 36 గ్రామాలు 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి వస్తాయని తేలిందని.. ఆ గ్రామాల్లోని 16,642 కుటుంబాలకు తొలి దశలోనే పునరావాసం కల్పించాల్సి ఉంటుందన్నారు. వెరసి మొత్తం 25,528 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని.. ఇందుకు రూ.7,304 కోట్లు అవసరమని.. ఇటీవల కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదించామని చెప్పారు. వాటిని ఆమోదించి నిధులిస్తే పునరావాసాన్ని త్వరితగతిన కల్పిస్తామని చెప్పారు. దీనిపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ స్పందిస్తూ.. తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఆ మేరకు నిధులు ఇస్తామని చెప్పారు.

ఈ క్రమంలో 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ని­ర్వా­సితులకు పునరావాసం కల్పనపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి ఇవ్వాలని అధికారులను కేంద్ర కమి­టీ ఆదేశించింది. నిర్వాసితుల జీవనోపాధుల­ను మె­రుగుపరిచేలా వారికి వివిధ చేతి వృత్తుల్లో శిక్షణ ఇ­స్తున్నామని, విద్యార్హత ఆధారంగా వివిధ పరి­శ్రమల్లో ఉపాధి కల్పించడానికి వీలుగా నైపుణ్యాలను అ­భి­వృద్ధి చేయడానికి శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అ­ధి­కా­రులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఇచ్చిన వివరణకు కేంద్ర కమిటీకి సంతృప్తి వ్యక్తం చేసింది. పునరావాసం కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందని ప్రశంసించింది.

అనుమానాల నివృత్తిపై సంప్రదింపులు
ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల ముంపుపై వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని రాష్ట్ర అధికారులకు కేంద్ర కమిటీ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ ఝా సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై కేంద్ర జల్‌ శక్తి శాఖ నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. దీనిపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ స్పందిస్తూ.. పోలవరం ముంపుపై మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేసి, సుప్రీం కోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పారు.   

Advertisement
Advertisement