Chandrababu Likely To Give TDP Ticket To Anam Ramanaraya Reddy In Atmakuru Constituency - Sakshi
Sakshi News home page

ఇదేంటి బాబూ.. నమ్మిన నేతలకే కూల్‌గా వెన్నుపోటు.. అసలేం జరుగుతోంది?

Published Sat, Jun 3 2023 3:49 PM

Chandrababu Chance to Give TDP Ticket to Anam Ramanaraya Reddy in Atmakuru - Sakshi

ఆత్మకూరు: తన పాత విద్యను చంద్రబాబు మరోసారి ఆత్మకూరు నియోజకవర్గ నేతలపై ప్రయోగిస్తున్నారు. నమ్మిన నేతలకే కూల్‌గా వెన్నుపోటు పొడుస్తున్నారు. పార్టీని అంటి పెట్టుకొని ఉన్న ఆ ముగ్గుర్నీ కాదని.. పార్టీ ఫిరాయించి వచ్చిన వ్యక్తికి పగ్గాలు అప్పగించబోతున్నారు. ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హాట్ టాపిక్ గా మారింది. ఆత్మకూరు టీడీపీలో ఏం జరుగుతుంది?

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీని నాయకత్వ సమస్య వెంటాడుతోంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బొల్లినేని కృష్ణయ్య, గుటూరు కన్నబాబు టీడీపీ పొలిటికల్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. బొల్లినేని కృష్ణయ్య గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో కొమ్మి లక్ష్మయ్య నాయుడు, గుటూరు కన్నబాబు స్థానికంగా టీడీపీలో పనిచేస్తున్నారు. అయితే టీడీపీకి క్షేత్రస్థాయిలో ప్రజాదరణ అసలు లేదనే విషయం అందరికీ అర్థమవుతోంది. విషయం గ్రహించిన మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. దీంతో టీడీపీ శ్రేణులు డైలమాలో పడ్డారు. ఇంచార్జీ లేకపోవడం.. నేతలు పార్టీ వీడుతుండటంతో వారి క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది.

పార్టీ కుప్పకూలిపోవడంతో ఆత్మకూరు నియోజకవర్గానికి నాలుగేళ్లుగా ఇంచార్జీనే నియమించలేకపోయారు. బొల్లినేని కృష్ణయ్య లేకపోయినా..కొమ్మి లక్ష్మయ్య, కన్నబాబు పార్టీ జెండాను మోస్తున్నప్పటికీ వారి నాయకత్వం మీద చంద్రబాబుకు గురి కుదరడంలేదట. పైగా వీళ‍్లిద్దరూ సొంత సామాజికవర్గమే కనుక ఎక్కడికీ పోయే అవకాశం లేదని.. వారిని అసలు పట్టించుకోవడంలేదని సమాచారం. చంద్రబాబు తీరుపై కమ్మ సామాజిక వర్గం నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందనే చర్చ ఆత్మకూరులో జరుగుతోంది. మరోవైపు లోకేష్ పాదయాత్రకు సంఘీబావ ర్యాలీలో వర్గ విభేదాలు బయటికొచ్చాయి. 

ఇదీ చదవండి:కోడెలకు అన్యాయం చేస్తున్నారు

నియోజకవర్గంలో పార్టీని అంటి పెట్టుకుని ఉన్న కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కన్నబాబు, బొల్లినేని కృష్ణయ్యలను కాదని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనం రామనారాయణ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఆత్మకూరులో జరుగుతుంది. ఇప్పటికే అనంకి లైన్ క్లియర్ అయిందనే టాక్ నడుస్తోంది. ఆనం కూడా తన పాత పరిచయాలను కలుపుకునేందుకు నియోజకవర్గాన్ని చుట్టబెట్టేస్తున్నారు. శుభ కార్యాలకు వెళ్తూ అందరికీ టచ్‌లో ఉండమని ఆనం రామనారాయణరెడ్డి తన అనుచరులకు చెబుతున్నారట.

వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డికి ఇంచార్జీ పదవి, టిక్కెట్‌ ఇచ్చేందుకే చంద్రబాబు వేచి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే గుటూరు కన్నబాబు వర్గం పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆత్మకూరులో పాత తరం నేతలకు, ఆశావహులకు ఆనం రామనారాయణ భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి:ఏపీలో కులాల పోరు కాదు, వర్గ పోరాటమే!

  
 

Advertisement
Advertisement