ఇసుక బకాసురుడు బాబు 'తవ్వుకో.. తినుకో'!   | Sakshi
Sakshi News home page

ఇసుక బకాసురుడు బాబు 'తవ్వుకో.. తినుకో'!  

Published Mon, Jan 15 2024 5:01 AM

Chandrababu Govt TDP Leaders Scam Also In Sand - Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక నుంచి తైలం పిండటంలో నిజమెంత ఉందో తెలియదుగానీ ఇసుక నుంచి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టవచ్చని చంద్రబాబు నిరూ­పించారు. అది కూడా ఇసుక ఉచితం అని బురిడీ కొట్టించి దోపిడీకి పాల్పడటం ఆయనకే సాధ్యమైంది. తాను అక్రమంగా నివాసం ఉంటున్న కరకట్ట ఇంటి వెనుకే వేల కొద్దీ లారీల్లో ఇసుక తరలిపోతు­న్నా గుడ్లప్పగించి చూశారు.

టీడీపీ హయాంలో ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా సాగించిన దోపిడీని సీఐడీ పూర్తి ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. కేంద్ర చట్టాలు, గ్రీన్‌ ట్రిబ్యు­నల్‌ విధివిధానాలను ఉల్లంఘించి కేబినెట్‌ ఆమో­దం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు చేసిన లూటీ ఆధారాలతో బహిర్గతమైంది. 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలు­వైన ఇసుక దోపిడీకి పాల్పడిందన్నది నిగ్గు తేలింది. 

అంతులేని ధన దాహం 
2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు కన్ను ఇసుక రీచ్‌లపై పడింది. అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడినా ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ఇసుక విధానాన్ని పునఃసమీక్షించాలని కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించారు. కొత్త ఇసుక విధానాన్ని నిర్ణయిస్తూ 2016 జనవరి 15న రెండు జీవోలు (జీవో నంబర్లు 19, 20) జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఇసుక దాహం తీరలేదు. బరితెగించి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు మరో విధానాన్ని తీసుకురావాలని భావించారు.

‘ఇసుకను ప్రభుత్వం అమ్మదు.. ఇసుక తవ్వకాలకు ఎలా­ంటి అనుమతులు అవసరం లేదు.. ఎవరికి వారు ఇసుక రీచ్‌లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు విధించదు’ అని చెబుతూ 2016 మార్చి 4న ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నారు. ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్రబాబు తన చేతిలోకి, మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు.  

మూడు మార్గాలు బేఖాతర్‌.. 
భారీ ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను ఉల్లంఘించారు. ఒక ‘మెమో’తో ఇసుక దోపి­డీకి పన్నాగం పన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. అందుకు నిర్దేశించిన మూడు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటి ఎంపిక చేసుకో­వాలి. ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూపొందించిన బిజినెస్‌ రూల్స్‌ (మార్గదర్శకాలు) అనుసరించాలి. అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆమేరకు ఆరి్థక శాఖ ఆమోదం పొందాలి. ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్‌ ఆమోదం పొందాలి. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన  ‘ఉచిత ఇసుక విధానం’ కోసం ఈ మూడింటిలో ఏ ఒక్కటీ పాటించలేదు.  

మెమో 3066తో కనికట్టు 
‘ఉచిత ఇసుక విధానం’ విధానాన్ని తెస్తూ టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి 4న ప్రత్యేకంగా ‘మెమో 3066’ జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ చంద్రబాబు, ఆయన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. సహజ వన­రులు, రాష్ట్ర ఖజానాకు కీలకమైన ఆరి్థక వనరుకు సంబంధించి కేబినెట్‌ ఆమోదం లేకుండానే అడ్డగోలుగా కేవలం ఒక మెమోను సాకుగా చూపి రంగంలోకి దిగారు. ఈ మెమో ద్వారా 2016 నుంచి 2019 వరకు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. రేట్లపై, తవ్వకాలపై నియంత్రణ లేదు.

జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తెచ్చారు. ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్‌ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి అమ్ముకుంది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత..? రోజుకు ఎంత తవ్వుతున్నారు? ఎంతకు అమ్ముతున్నారు? ఎన్ని వేల లారీల ఇసుక రోజూ రాష్ట్రం దాటుతోంది? అనేదానికి అంతూపొంతూ లేకుండా పోయింది.  

ఆ ఆదాయం ఏమైంది? 
గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వ­కాల ద్వారా ఖజానాకు నాలుగు రకాల ఆదా­యం రావాలి. సీనరేజీ, కన్సిడరేషన్‌ చార్జీలు, డి్రస్టిక్ట్‌ మైన్స్‌ ఫండ్, మెరిట్‌ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎ­స్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తెచ్చింది. దూరాన్ని బట్టి ఏ రీచ్‌ నుంచి ఎంత చార్జీ అనే అంశాన్ని నిర్ణయించి పారదర్శకంగా ప్రకటిస్తోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీ­సం రూ.వెయ్యి కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావా­ల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది.

చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ అనే మోసపూరిత విధా­నంతో ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండిపడింది. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసు­క ఎంతనే అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిపై దాడి.. 
ఇసుక దోపిడీ కుట్రకు చంద్రబాబు సూత్రధారి కాగా అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు మరికొందరు ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అంతటా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు.

అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకు తహసీల్దార్‌ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుత్తు పట్టుకుని మరీ దాడికి పాల్పడ్డారు. తహసీల్దార్‌పై దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్‌ను నాటి సీఎం చంద్రబాబు సమర్ధించడం విస్మయ పరిచింది. తమ ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement