CBN Petition: 17ఏ అవినీతిని కాపాడేందుకు కాదు | Sakshi
Sakshi News home page

17ఏ అవినీతిని కాపాడేందుకు కాదు.. పర్మిషన్‌ తీసుకోకపోతే దర్యాప్తు ఏం కావాలి?

Published Mon, Oct 9 2023 5:02 PM

Chandrababu Quash Petition SC Updates: Judge Key Comments On 17A - Sakshi

సాక్షి,  ఢిల్లీ:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.  సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఆయన క్వాష్‌ పిటిషన్‌ వేశారు.  అయితే.. ఈ పిటిషన్‌పై ఇవాళ(సోమవారం)  సుదీర్ఘ వాదనలే జరిగాయి. మొత్తం 17-ఏ చుట్టూరానే వాదనలు కొనసాగడం గమనార్హం. ఈ క్రమంలో చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని ఉద్దేశించి.. ధర్మాసనంలోని జస్టిస్‌ బేలా త్రివేది 17-ఏపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘17-A  వ్యాఖ్యానంలో చట్టం ముఖ్య ఉద్దేశం చూడాలి. అవినీతి నిరోధమే చట్టం అసలు ఉద్దేశం. ఇది అవినీతి నిరోధానికి ఉండాలే తప్ప.. అవినీతిని కాపాడేందుకు కాదు. అవినీతి నిరోధించడంలో నష్టం జరగకూడదన్న బాధ్యత కూడా ఉంది కదా!. చట్టం ఉద్దేశానికి భంగం కలిగేలా దీన్ని అమలు చేయలేం. 17-A లో చాలా అంశాలున్నాయి కదా. 17-A కు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా ?. 17-A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలి?’’ అని బేలా త్రివేది, చంద్రబాబు లాయర్‌ హరీష్‌ సాల్వేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం వాదనలు వింది. ఇవాళ దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ తరుణంలో. కోర్టు సమయం ముగియడంతో వాదనల్ని రేపు(అక్టోబర్‌ 10) వింటామంది ధర్మాసనం. రేపు ఉదయం చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. 

చంద్రబాబు పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే.. 2018లోనే ఈ కేసు విచారణ ప్రారంభమైందన్న ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ గత వాదనల్ని.. జస్టిస్‌ బేలా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే రోహత్గీ వాదన సరికాదంటూ హరీశ్‌ సాల్వే తన వాదనలు మొదలుపెట్టారు.  రాజకీయ ప్రతీకార చర్యలు లేకుండా ఉండడం కోసమే 17ఏ తీసుకొచ్చారు. 17ఏ ప్రకారం ప్రజాప్రతినిధులపై ఏ తరహా విచారణ చేయాలన్నా పోలీసుల అనుమతి పొందాల్సిందే. అని వాదించారు.  ఈ కేసు.. రెజిం రివెంజ్(పాలన పగ) అని, పబ్లిక్ సర్వెంట్‌ను ఎఫ్ ఐ ఆర్ లో చేర్చాలి అంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని, దీనిపై కేంద్రం SOP కూడా జారీ చేసింది అని బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

Advertisement
Advertisement