నా విజన్‌తో యువత ఆకాశానికి  | Sakshi
Sakshi News home page

నా విజన్‌తో యువత ఆకాశానికి 

Published Sat, Aug 19 2023 4:10 AM

Chandrababu Sabha utter flop in Amalapuram - Sakshi

సాక్షి అమలాపురం: తన విజన్‌తో యువత ఆకాశానికి ఎగిరిపోతారని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. తన సైన్యం యువతని.. వారికి ఉపాధి కల్పించే బాధ్యత తనదేనన్నారు. అమలాపురంలో వర్క్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తానని.. ఇక్కడే ఉంటూ అమెరికాలో పనిచేసేలా చేస్తానని వెల్లడించారు. బీసీల్లో 150 కులాలకు మేలు చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. కాపులకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్‌లో ఐదు శాతం కేటాయిస్తానని చెప్పారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్‌కు ఎక్స్‌పెయిరీ డేట్‌ వచ్చిందన్నారు. ఆయనలా తాను అప్పులు చేయనని.. సంపద సృష్టించి సంక్షేమం వైపు నడిపిస్తానని తెలిపారు. జిల్లా పేరుతో పచ్చని కోనసీమలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం అమ్మకాలతో దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు.

తిరుమలలో చిరుతలు ఉంటే మీకు కర్రలు ఇస్తారంట.. ఇంటికొక కర్ర పట్టుకుని వైఎస్సార్‌సీపీ దొంగలను కొట్టండని ప్రజలను రెచ్చగొట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎస్సీలను చంపి డోర్‌ డెలివరీ చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం తెచ్చారా అని నిలదీశారు. కోనసీమలో కొబ్బరి, ఆక్వాలకు ప్రత్యేక పాలసీ తెస్తానని చెప్పారు. ఈ సభలో పార్టీ నేతలు గంటి హరీష్‌ మాధుర్, అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు.
 

అమలాపురం సభ అట్టర్‌ ఫ్లాప్‌ 

కాగా అమలాపురంలో చంద్రబాబు సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. అనుకున్న దానిలో మూడో వంతు కూడా జనం రాలేదు. తొలి నుంచి జనం రాక మీద నమ్మకం లేని పార్టీ నేతలు గడియారస్తంభం సెంటర్‌లో సమావేశ వేదికను రివర్స్‌లో ఏర్పాటు చేశారు. జనం రాకపోతే సెంటర్‌కు ఆనుకుని ఉన్న రోడ్లు ఖాళీగా కనిపించే ప్రమాదముందని ఇలా చేశారు. ఫ్లెక్సీలు కట్టి రోడ్డును ఇరుకుగా చేసినా జనం రాకపోవడంతో పార్టీ నేతలు డీలా పడ్డారు.
 

Advertisement
Advertisement