సాక్షి ఎఫెక్ట్‌: పల్లా ఆక్రమణలకు చెక్‌

14 Jun, 2021 09:43 IST|Sakshi
పల్లా శ్రీనివాసరావు ఆక్రమించిన ప్రభుత్వ భూమిని లీజుకిచ్చిన జగ్గరాజుపేటలో గుమిగూడిన కార్మికులు, రెవెన్యూ సిబ్బంది

మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో 38.45 ఎకరాల భూముల్లో ఆక్రమణలు తొలగించిన ప్రభుత్వాధికారులు 

రూ.669.26 కోట్లు మార్కెట్‌ విలువని అంచనా

ప్రభుత్వ భూములు లీజుకిచ్చి కోట్లు కొల్లగొట్టిన పల్లా అండ్‌ కో

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూబకాసురుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన భూములను అధికారులు ఒక్కొక్కటిగా స్వా«దీనం చేసుకుంటున్నారు. అధికారం అండతో టీడీపీ నేతలు గతంలో చేసిన ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు స్పందించిన అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అధికారం అడ్డంపెట్టుకొని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధుగణం దోచుకున్న భూముల బాగోతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణలను గుర్తించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఒకటి కాదు, రెండు కాదు రూ.669 కోట్ల  విలువ చేసే ఏకంగా 38.45 ఎకరాల ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 

సాక్షి, విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం(గాజువాక): అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అండ్‌ కో సాగించిన భూదందాకు రెవెన్యూ యంత్రాంగం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వెంటనే.. ప్రభుత్వ భూములపై ఎగబడి బంధుగణంతో కలిసి అందినకాడికి ఆక్రమించుకున్న పల్లా శ్రీనివాసరావు ఆక్రమణల బాగోతాన్ని సర్వే నంబర్లతో సహా ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు ఆయా సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూముల పరిస్థితులను పరిశీలించి.. నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించగా.. ఆక్రమణలు తొలగించి.. స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పల్లా ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఆదివారం ఉక్కుపాదం మోపారు. గత 15 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించి పలు కంపెనీలకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్లు కొల్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే బంధుగణం దర్జాగా అనుభవిస్తున్న ప్రభుత్వ ఆక్రమిత భూములను గుర్తించి రెవెన్యూ అధికారులు తొలగింపు చర్యల్ని వేకువ జామున 3 గంటల నుంచి ప్రారంభించారు.

మూడు ప్రాంతాల్లో 38.45 ఎకరాలు స్వాదీనం
గాజువాక నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ జాగా, పోరంబోకు స్థలం, ప్రభుత్వ భూమి, చెరువు.. ఏం కనిపించినా విడిచిపెట్టకుండా ఆక్రమించేశారు. జగ్గరాజుపేట, తుంగ్లాం, కూర్మన్నపాలెం రెవెన్యూపరిధిలో ఆక్రమించేసుకున్న 38.45 ఎకరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం. 28–1, 28–2లో 1.26 ఎకరాలు వాగు స్థలం స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా తుంగ్లాంలోని సర్వే నం.9–6, 10–2లోని 0.92 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.12–1 నుంచి 12–14 వరకూ 6.15 ఎకరాల యూఎల్‌సీ ల్యాండ్, 14–1లోని 1.85 ఎకరాల పోరంబోకు చెరువు, సర్వే నం.28లోని 21.67 ఎకరాల పోరంబోకు చెరువు, 29/1బీలోని 0.70 ఎకరాల ఇనాం భూములు, 29/2లోని 0.80 ఎకరాల పోరంబోకు బంద, 30–12, 30–13, 30–15లోని 2.04 ఎకరాల గయాలు భూములు, 33/2, 33/4లోని 1.50 ఎకరాల పోరంబోకు రాస్తా, సర్వే నం.34–2లోని 0.24 ఎకరాల పోరంబోకు స్థలాల్లోని ఆక్రమణలను తొలగించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా కూర్మన్నపాలెంలోని సర్వే నం. 8/6లోని 1.35 ఎకరాల పోరంబోకు భూమిలోని ఆక్రమణలను తొలగించారు. ఆక్రమించిన ప్రభుత్వ భూముల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎల్‌అండ్‌టీ, హెచ్‌పీసీఎల్‌ సంస్థలకు చెందిన ప్రైవేట్‌ కాంట్రాక్ట్‌ పనులకు లక్షల్లో లీజులకు ఇచ్చి కోట్ల రూపాయలు గడించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తొలగింపు చేపట్టే ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆయా సర్వే నంబర్లలోని ఆక్రమణలను ఆర్‌డీవో పెంచల్‌కిశోర్, గాజువాక తహసీల్దార్‌ ఎంవీఎస్‌ లోకేశ్వరరావు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయా భూములు ఆక్రమణలకు గురయ్యాయని నిర్థారించిన అనంతరం తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ తొలగింపులో గాజువాక, కూర్మన్నపాలెం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పాటు గాజువాక పోలీసులు పాల్గొన్నారు. 

మార్కెట్‌ విలువ అక్షరాలా రూ.669.26 కోట్లు
పల్లా ఆక్రమించి అనుభవించిన భూముల విలువ మార్కెట్‌లో భారీగానే ఉంది. తనతో పాటు బంధుగణంతో కలిసి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. జగ్గరాజుపేట రెవెన్యూ పరిధిలో ఆక్రమించుకున్న 1.26 ఎకరాల భూమి మార్కెట్‌విలువ రూ.12.81 కోట్లుంది. అదేవిధంగా తుంగ్లాం రెవెన్యూ పరిధిలో ఆక్రమించుకున్న భూముల విలువ రూ. 613,32,48,000. కూర్మన్నపాలెంలో ఆక్రమించిన భూమి విలువ రూ.43.12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రూ.669.26 కోట్లు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 

దేవస్థాన భూముల ఆక్రమణలపై మరోసారి విచారణ.. 
ఏళ్ల క్రితం జగ్గరాజుపేట, తుంగ్లాం రెవెన్యూ పరిధిల్లో 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ మధ్య కాలంలో వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు గత కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో రికార్డుల పరిశీలనతో పాటు ఆక్రమిత స్థలాల్లో సర్వే జరిపిన అనంతరం ప్రభుత్వ భూములుగా గుర్తించాం. అనంతరం ఆక్రమిత స్థలాలను స్వా«దీనం చేసుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆర్‌డీవో ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగిచే ప్రక్రియ చేపట్టాం. ఆక్రమణల్లో కొన్ని భూములు సింహాచలం దేవస్థానానికి చెందినవని దేవస్థానం ఈవో గుర్తించారు. అవి వారి పరిధిలో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆక్రమణలు గురైనట్లుగా కనిపిస్తున్నాయి. దీనిపై మరోసారి విచారణ చేపట్టి రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిగిన తర్వాత చర్యలకు సిద్ధమవుతాం. కబ్జాకు పాల్పడిన వారిపై త్వరలోనే  చర్యలు తీసుకుంటాం.
– ఎంవీఎస్‌ లోకేశ్వరరావు, గాజువాక తహసీల్దార్‌  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు