నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు | Sakshi
Sakshi News home page

నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

Published Sun, Oct 1 2023 4:26 AM

CID notices to Nara Lokesh On Inner Ringroad Alignment Scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ ముసుగులో జరిగిన భూదోపిడీ కుంభకోణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు అందజేశారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఇంట్లో ఉన్న లోకేశ్‌­కు అధికారులు వీటిని అందజేశారు. అక్టోబరు 4న తాడేపల్లిలోని సీఐడీ కార్యాల­యంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ వచ్చిన అధికారులు శనివారం ఉదయం నుంచి  లోకేశ్‌ ఎక్కడున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేశారు.

ఓ హోటల్‌లో ఉన్నారని, ఎంపీ ఇంట్లో ఉన్నారని ఇలా ఊహాగానాలు రావడంతో పూర్తి సమాచారం వచ్చే వరకూ వేచి చూశారు. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో లోకేశ్‌ ఎంపీ గల్లా జయదేవ్‌ అధికారిక నివాసానికి వచ్చారు. దీంతో అధికారులు ఎంపీ జయదేవ్‌తో మాట్లాడారు. అశోకారోడ్‌–50లోని తన నివాసంలో లోకేశ్‌ ఉన్నారని జయదేవ్‌ వారికి తెలిపారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఐడీ అధికారులు ఎంపీ జయదేవ్‌ నివాసానికి చేరుకున్నారు. వారిని తొలుత లోపలికి రానీయకుండా గేటు వద్దే అడ్డుకొన్నారు.

విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం సమంజసం కాదని అధికారులు తెలిపారు. లోకేశ్‌ బయటకు వస్తే నోటీసులు అందజేసి వెళ్లిపోతామని చెప్పారు. కొద్దిసేపటకి లోకేశ్‌ బయటకు రారని గేటు వద్ద ఉన్న సిబ్బంది అధికారులకు తెలిపారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపడ సత్యనారాయణ బయటకు వచ్చి అధికారులతో మాట్లాడారు. వారిని లోపలికి తీసుకెళ్లారు. 20 నిమిషాల అనంతరం బయటకి వచ్చిన అధికారులు లోకేశ్‌కు నోటీసులు ఇచ్చినట్లుగా అధికారికంగా ప్రకటించారు. కోర్టు పరిధిలో ఉన్న కేసుపై తాము మాట్లాడబోమని మీడియాకు తెలిపారు. 

ఎందుకొచ్చారు? నోటీసులెందుకు?
నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులను ఎందుకొచ్చారని ప్రశ్నించినట్లు సమాచారం. నోటీసులు ఎందుకు? ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని అడిగినట్లు సమాచారం. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణంలో విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. అనంతరం లోకేశ్‌కు నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా నోటీసులు అందుకున్నట్లు లోకేశ్‌ ధృవీకరించినట్లు తెలిసింది.

అంతకు ముందు సీఐడీ అధికారులను ఎంపీ జయదేవ్‌ నివాసంలోకి రానివ్వకపోవడంతో వారు లోకేశ్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని అధికారులతోనూ లోకేశ్‌ ప్రస్తావించినట్లు సమాచారం. నోటీసును చదువుకుంటానని, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడతారని లోకేశ్‌ వారికి చెప్పినట్లు తెలిసింది. దీంతో అధికారులు ఆయా సెక్షన్లు గురించి లోకేశ్‌కు వివరించినట్లు సమాచారం.

నోటీసుల్లో ఉన్న వివరాలివీ..!
ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కుంభకోణంలో నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో.. ‘ క్రైమ్‌ నం. 16/2022 ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఐపీసీ సెక్షన్లు 120 (బి), 409, 420, 34, 35, 36, 37, 166, 167, 217, మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి) (డి)లో దర్యాప్తు మేరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ సబ్‌ సెక్షన్‌ (1) ప్రకారం నోటీసులు ఇస్తున్నాం. ప్రస్తుత విచారణకు సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడానికి, ప్రశ్నించడానికి తగిన కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 4న ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలి’ అని నోటీసుల్లో పేర్కొంది. వీటలో 10 అంశాలను సీఐడీ స్పష్టంగా పేర్కొంది. ఆ అంశాలివీ..

1. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదు
2. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు తారుమారు చేయకూడదు
3. కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులెవరినీ బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం చేయకూడదు
4. ఎప్పుడు పిలిచినా /ఆదేశించినా కోర్టుకు హాజరుకావాలి
5. విచారణకు ఎప్పుడు పిలిచినా వచ్చి అధికారులకు సహకరించాలి
6. కేసుకు సంబంధించి వాస్తవాలు వెల్లడించాలి
7. హెరిటేజ్‌ ఫుడ్స్‌ బ్యాంకు ఖాతా వివరాలు అధికారులకు అందజేయాలి
8. భూముల కొనుగోలుకు సంబంధించి హెరిటేజ్‌ బోర్డు డైరెక్టర్ల మీటింగ్‌ మినిట్స్‌ ఇవ్వాలి
9. అమరావతి భూ కొనుగోలు లావాదేవీలు విచారణకు హాజరయ్యే సమయంలో తీసుకురావాలి
10. నోటీసులు అందుకున్న తర్వాత విచారణకు రాకపోయినా, నిబంధనలు పాటించకపోయినా సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ (3), (4) ప్రకారం అరెస్టు తప్పదు 

లవ్‌ లెటర్‌ అందింది :  లోకేశ్‌
సీఐడీ వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగమని ఆరోపణ
సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసును నారా లోకేశ్‌ లవ్‌ లెటర్‌గా అభివర్ణించారు. ఢిల్లీలో సీఐడీ అధికారులు వచ్చి వెళ్లిన రెండు గంటల తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చారు. సీఐడీ అధికారులు వస్తున్న విషయం తెలసుకొని జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులు సాయంత్రం ఎంపీ జయదేశ్‌ నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే, వారిని లోపలికి అనుమతించలేదు. సీఐడీ అధికారులు వెళ్లిపోయిన తర్వాత లోకేశ్‌ వెంటనే మీడియా ముందుకు రాలేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 7 గంటలకు గంటలు మోగించారు.

ఆ తర్వాత లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. తనపై మోపినవి దొంగ కేసులని, ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. తాము ఎక్కడికీ పారిపోబోమన్నారు. సీఐడీ వాళ్లు వచ్చి లవ్‌ లెటర్‌ ఇచ్చారని తెలిపారు. సీఐడీని వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగమని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కక్ష సాధిస్తున్నారని, అందులో భాగంగానే జుడిషియల్‌ రిమాండుకు పంపారని అన్నారు. తప్పుడు కేసు పెట్టినందుకు దర్యాప్తు అధికారి, డీజీపీపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని అన్నారు. 4న సీఐడీ ముందు హాజరవుతానని, వాయిదాలు అడిగే అలవాటు లేదని చెప్పారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement