మీ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది | Sakshi
Sakshi News home page

మీ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చింది

Published Tue, Dec 28 2021 3:47 AM

Cji Nv Ramana Compliments Cm Ys Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా నియమితులైన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన తనకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ప్రజలిచ్చిన ఆతిథ్యం, చూపిన ప్రేమాభిమానాలపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ సంతోషం వ్యక్తం చేశారు. ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సాఫీగా, సౌకర్యవంతంగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ముఖ్యమంత్రికి, మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, పాత్రికేయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

సమయాభావం వల్ల ఎందరినో కలవలేకపోయానని, అందరినీ కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని జస్టిస్‌ రమణ తెలిపారు. తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి చేర్చిందని, ఆ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర పర్యటనను ముగించుకున్న నేపథ్యంలో జస్టిస్‌ రమణ సోమవారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. 

‘ఎప్పటి నుంచో నా స్వగ్రామం పొన్నవరానికి వెళ్లి రావాలనుకున్నాను. సుప్రీంకోర్టుకు శీతాకాలపు సెలవులు రావడంతో నా ఆలోచనలను అమల్లో పెట్టే అవకాశం దొరికింది. ఎంతో ఉత్సాహంగా స్వగ్రామానికి బయలుదేరాను. ఆంధ్రప్రదేశ్‌లో కాలుమోపిన నాటినుంచి ప్రజలు నన్ను అపారమైన ప్రేమాభిమానాలతో ముంచెత్తారు. దీనిని నేను,  నా కుటుంబ సభ్యులు ఎన్నటికీ మరువజాలం. పొన్నవరం పొలిమేరల నుంచి ఊరేగింపుతో నన్ను తీసుకెళ్లిన వైనం ఎంతో కదలించింది.

మా ఇద్దరి కుమార్తెలకు మరోసారి.. అల్లుళ్లు, చిన్నారి మనుమరాళ్లకు తొలిసారి నా ఊరిని చూపించగలగడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆప్తులు ఎంతోమంది కలుస్తుంటే భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఎంతోమంది ఎన్నో రంగాలకు చెందిన వారు నన్ను పలకరించేందుకు వచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు. న్యాయవాద వృత్తిలో నడక నేర్పిన బెజవాడ బార్‌ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్, ఏపీ బార్‌ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ అతితక్కువ కాలంలో అసాధారణ ఏర్పాట్లతో నన్నూ, నా సతీమణిని సత్కారాలతో ముంచెత్తారు. ఈ పర్యటనలో నా వెంట ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులపట్ల అభిమానం, గౌరవం శ్లాఘనీయం. ఏపీలో అడుగుపెట్టిన నాటినుంచి నా బాగోగులు చూసుకున్న ఏపీ ప్రోటోకాల్‌ సిబ్బందికి, పోలీసులకు, రాజ్‌భవన్‌ సిబ్బందికి, మొత్తం అధికార యంత్రాంగానికి నా కృతజ్ఞతలు. హైదరాబాద్‌లో బయల్దేరి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వరకు, తిరిగి ఏపీ నుంచి హైదరాబాద్‌ చేరే వరకు సకల సదుపాయాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు కూడా నా కృతజ్ఞతలు’.  

సుప్రీంకోర్టు సీజేకి ఘన స్వాగతం 
కాగా, ఏపీలో పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు కుటుంబ సమేతంగా బయలుదేరిన సీజేఐ ఎన్‌వీ రమణ సూర్యాపేటలో జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు.   

Advertisement
Advertisement