CM Jagan Announced Jagananna Surakha Programme From 23 June, See Details Inside - Sakshi
Sakshi News home page

Jagananna Surakha Programme: 23 నుంచి ‘జగనన్న సురక్ష’ 

Published Thu, Jun 15 2023 2:16 AM

CM Jagan Announced Jagananna Surakha programme From 23 June - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను సం­తృప్త స్థాయిలో పరిష్కరించడం, అర్హులెవరూ మిగిలిపోకుండా పథకా­లను అందించడమే లక్ష్యంగా ఈనెల 23వతేదీ నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వ­హించ­నున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అను­బంధంగా, పటిష్టంగా అమలు చేసేం­దుకు దీన్ని నిర్వ­హించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజా­ప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరిస్తారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధ రకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే  అంశాలను నిశితంగా పరిశీలిస్తారు.

ఆ వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తరువాత వెంటనే రెండో దశ కింద నిర్దేశిత తేదీల్లో మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో సచివాలయాలను సందర్శిస్తారు. అర్హులుగా గుర్తించిన వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అదే రోజు అందచేస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారు.

జగనన్న సురక్షా ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన లబ్ధి చేకూర్చనున్నారు. ఈమేరకు స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్షా కార్యక్రమం, గడప గడపకూ మన ప్రభుత్వంపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. 

ఇంటింటికీ వెళ్లి జల్లెడ
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్షా కార్యక్రమం గురించి వివరిస్తారు. ఆ ఇంటికి సంబంధించి ఇన్‌కమ్, మ్యారేజీ, డెత్‌ సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ పథకాలను పొందడం దాకా ఏమైనా సమస్యలున్నాయా? అనే అంశంపై జల్లెడ పడతారు. ఒక్కరు కూడా మిస్‌ కాకుండా అన్ని వినతులు పరిష్కారం కావాలి.

సమస్యలేమీ లేకుంటే కుశల ప్రశ్నలు వేసి వారి ఆశీస్సులు తీసుకుని మరో ఇంటికి వెళతారు. ఇంటింటికి వెళ్లిన సమయంలో ఎవరైనా సర్టిఫికెట్ల సమస్య లేదా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నా, అర్హత ఉన్నా పథకాలు అందడం లేదని గుర్తించినా వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం నిర్దేశిత తేదీల్లో గ్రామ సచివాలయాలకు వచ్చే మండల స్థాయి బృందాలు, వార్డు సచివాలయాలకు వచ్చే మున్సిపల్‌ స్థాయి బృందాలు అక్కడికక్కడే సర్టిఫికెట్లను ఇచ్చేస్తాయి.

గ్రామాలకు రెండు బృందాలు
మండల స్ధాయిలో ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్‌ ఒక బృందంగా, తహశీల్దార్,  పంచాయతీరాజ్‌ ఈవో కలసి రెండో టీమ్‌గా ఏర్పాటవుతారు. ఈ రెండు బృందాలు గ్రామాలకు వెళ్తాయి. సచివాలయానికి వచ్చే తేదీ వివరాలను ముందే నిర్ణయించి అప్పటిలోగా గ్రామంలో ఉన్న క్షేత్రస్ధాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు.

నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితరాలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలున్న వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ అందిస్తారు. దీనివల్ల సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా పరిష్కారమయ్యే అవకాశం కలుగుతుంది.

వార్డులకు మున్సిపల్‌ బృందాలు
అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్, సిబ్బంది ఒక టీమ్‌గా ఉంటారు. జోనల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్, సిబ్బంది మరో బృందంగా ఏర్పడి వార్డుల్లో పర్యటిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం జూన్‌ 23 నుంచి జూలై 23 వరకు నెలరోజుల పాటు జరుగుతుంది. 

సేవల్లో ఉన్నత ప్రమాణాలు..
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందే వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యం.  గ్రామ సచివాలయాల దగ్గర నుంచి కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గతంలో పరిష్కారం కాని వినతులను కూడా సమర్ధంగా, నాణ్యతతో పరిష్కరించాలి. సగటు మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి. నిర్దేశించుకున్న సమయంలోగా నాణ్యతతో వినతులను పరిష్కరించడం ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. 

99.35 శాతం వినతులు పరిష్కారం
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులు గడిచింది. ఇందుకోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేశాం. 30 ప్రభుత్వ శాఖలు, 102 మంది హెచ్‌వోడీలతో పాటు  రెండు లక్షల మందితో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వినతుల పరిష్కారంపై దృష్టిపెట్టింది.

సీఎంవో, సచివాలయం, విభాగాధిపతుల దగ్గర నుంచి జిల్లాలు, మండల స్థాయిల్లో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ 59,986 వినతులు అందగా నిర్దేశిత సమయంలోగా 39,585 విజ్ఞాపనలు పరిష్కరించాం. మరో 20,045 పరిష్కారం దిశగా పురోగతిలో ఉన్నాయి. 99.35 శాతం వినతులు పరిష్కారమయ్యాయి. వినతులు పరిష్కరించే తీరు బాగున్నా సంతృప్తి స్థాయి పెరగాల్సి ఉంది.

తిరస్కరిస్తే ఇంటికెళ్లి వివరించాలి
ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్‌ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి ఎందుకు తిరస్కరణకు గురైందో వారికి వివరించాలి. సచివాలయ సిబ్బంది, వలంటీర్‌ వెళ్లి సంబంధిత వ్యక్తికి వివరించాలి.

ఈమేరకు ఎస్‌వోపీలో మార్పులు తేవాలి. రిజెక్ట్‌ చేసిన గ్రీవెన్స్‌ను కలెక్టర్లు పరిశీలించాలి. ఇంకా పరిశీలించని గ్రీవెన్సెస్‌ ఏమైనా ఉంటే 24 గంటల్లోగా పరిష్కరించాలి. సంబంధిత విభాగానికి 24 గంటల్లోగా పంపాలి. ఈ మేరకు ప్రతి ఉద్యోగికి దీనికి సంబంధించి అవగాహన కల్పించాలి.

గడప గడపకూ పనులకు నిధుల కొరత లేదు
గడప గడపకూ మన ప్రభుత్వంలో ప్రాధాన్యతగా గుర్తించిన పనుల విషయంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆయా గ్రామాల్లో ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం రూ.20 లక్షలు ప్రతి సచివాలయానికి ఇస్తున్నాం. ఇది చాలా ప్రాధాన్యాంశం. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గుర్తించిన పనులకు ఈ డబ్బులు మంజూరు చేయాలి.

వెంటనే ఆ పనులు ప్రారంభమయ్యేలా చూడటం, నిధుల మంజూరు సక్రమంగా జరగాలి. నిధులకు ఎలాంటి కొరత లేదు. మంజూరు చేసిన పనులను వెంటనే మొదలు పెట్టేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలి. 

ఆగస్టు 1న అర్హులకు పథకాలు 
జగనన్న సురక్ష ద్వారా వివిధ పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన మంజూరు చేసి లబ్ధి చేకూరుస్తారు. అర్హత ఉన్నవారు ఎవరూ మిస్‌ కాకూడదన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశాల్లో ఒకటి. 26 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించిన అధికారు­లంతా ఆయా ప్రాంతాల్లో  నెలకు రెండు దఫాలు పర్యటించి కార్యక్రమాన్ని పర్య­వేక్షిస్తారు.  

కలెక్టర్ల పర్యటన కూడా చాలా ముఖ్య­­మైన అంశం. ప్రతి జిల్లా కలెక్టర్‌ వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయా­లను సందర్శించాలి. నాలుగు సచివాల­యాల్లో జాయింట్‌ కలెక్టర్‌ పర్యటించాలి. కార్యదర్శులు, హెచ్‌ఓడీలు నెలకు కనీసం రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. ఐటీడీవో పీవో, సబ్‌ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement