జన బలమే గీటురాయి.. | Sakshi
Sakshi News home page

జన బలమే గీటురాయి..

Published Wed, Jan 3 2024 5:09 AM

CM Jagan appointed party coordinators for 24 assembly and 3 MP seats - Sakshi

సాక్షి, అమరావతి: నిరంతరం ప్రజాక్షేత్రంలో గడుపుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమా­లను సమర్థంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల మన­సులకు మరింత చేరువైన నేతలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. సామాజిక న్యాయంలో మరో అడుగు ముందుకేశారు. బీసీలు, మహిళ­లకు ప్రాధాన్యమిస్తూ సామాజిక సాధికార ఛాంపియన్‌ అని మరోసారి రుజువు చేసుకు­న్నారు. మహిళలు, యువతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ 24 శాసనసభ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో జాబితాను ఖరారు చేశారు.

గతంలో అగ్ర­వర్ణాలకు అవకాశం కల్పించిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో తాజాగా ఐదు చోట్ల బీసీలను సమ­న్వయకర్తలుగా నియమించడం గమ­నార్హం. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యా­లయం మీడియా పాయింట్‌ వద్ద విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి ఈ వివరాలను ప్రకటించారు. గత నెల 11వతేదీన 11 శాసనసభ స్థానాలకు నూతన సమన్వయకర్తలను ప్రకటిస్తూ వైఎస్సార్‌ సీపీ మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు జాబితాల్లో కలిపి మొత్తం 35 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. 

► కురుబ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణను అనంతపురం లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ జోలదరాశి శాంత హిందూపురం లోక్‌సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని అరకు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించగా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి,, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీచరణ్‌ను పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. 

బీసీలు, మైనార్టీలకు పెద్దపీట..
రెండు దఫాల్లో ప్రకటించిన 35 శాసనసభ స్థానాల సమన్వయకర్తల జాబితాను పరిశీలిస్తే  సామాజిక న్యాయానికి సీఎం జగన్‌ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీకి పెట్టిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాల్లో బీసీలకు, రెండు స్థానాల్లో మైనార్టీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించడం గమనార్హం. ఇక ఐదు శాసనసభ స్థానాలకు మహిళలను సమన్వయకర్తలుగా నియమించారు. పది స్థానాల్లో యువతీ యువకులకు సమన్వయకర్తలుగా అవకాశం కల్పించారు. మొత్తమ్మీద 35 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎస్సీలు 9 మంది, ఎస్టీలు ముగ్గురు, బీసీలు 11 మంది, మైనార్టీలు ముగ్గురు, అగ్రవర్ణాలు 9 మంది (రెడ్డి, కాపు, వైశ్య) చొప్పున ఉన్నారు.

175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా
గత 55 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, చరిత్ర ఎరుగని విప్లవాత్మక సంస్కరణలతో సీఎం వైఎస్‌ జగన్‌ జనరంజక పరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ)తో రూ.2.45 లక్షల కోట్లు, నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందగా అందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటం గమనార్హం.

ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో తీసుకొచ్చిన మార్పులు కళ్లెదుట కనిపిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లోనూ విజయం సాధించడం సాధ్యమేనని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. చేసిన మంచిని ప్రజలకు చెప్పి వారితో మమేకమై మరింత మేలు చేయడానికి  ఆశీస్సులు కోరాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజలతో మమేకం కాకుండా వారి మనసులు చూరగొనలేని వారికి టికెట్లు ఇవ్వలేనని ఆది నుంచి సీఎం జగన్‌ తేల్చి చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా అవసరమైన చోట్ల నూతన సమన్వయకర్తలను నియమిస్తున్నారు. 



గెలుపే ప్రామాణికంగా జాబితా
మీడియాతో బొత్స, సజ్జల
సామాజిక సమీకరణాలే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల జాబితాను రూపొందించామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం నూతన ఇన్‌ఛార్జీల జాబితాను విడుదల చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మండల, నియోజకవర్గ నేతలతో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ తర్వాతే జాబితాను విడుదల చేశామన్నారు. గెలుపే ప్రామాణికంగా 27 మంది ఇన్‌ఛార్జీలతో రెండో జాబితాను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ జాబితాను సీఎం జగన్‌ ఖరారు చేసినట్లు చెప్పారు.

సామాజిక సమీకరణాలు, ప్రజల ఆదరాభిమానాలు, అంతిమంగా పార్టీ గెలుపే లక్ష్యంగా జాబితాను రూపొందించామన్నారు. భారీ విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం తన శ్రేణుల్లో తొణికిసలాడుతుండగా ప్రతిపక్షంలో పూర్తి అయోమయ వాతావరణం నెలకొందన్నారు. పొత్తులు తేల్చుకోలేక,  సీట్ల పంపిణీ చిక్కుముడులు వీడక, నియోజకవర్గాల్లో అభ్యర్ధులే లేక విపక్షాలు నిరాశలో కొట్టు మిట్టాడుతున్నాయన్నారు. ఇవాళ విడుదల చేసిన జాబితాలో అవకాశాలు దక్కని వారి సేవలను పార్టీపరంగానూ, ఇతరత్రా వినియోగించుకుంటామని చెప్పారు. పార్టీ అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందన్నారు.175 స్ధానాల్లో గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, ఆ దిశగానే ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.  

Advertisement
Advertisement