Andhra Pradesh: CM YS Jagan Attends In Raja Shyamala Maha Yagnam - Sakshi
Sakshi News home page

శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్‌

Published Fri, May 12 2023 9:06 AM

Cm Jagan Attends Raja Shyamala Maha Yagnam - Sakshi

సాక్షి, అమరావతి: సనాతన ధర్మ పరిరక్షణతోపాటు రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కల్యాణ సౌభాగ్యాలతో వర్థిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో  శుక్రవారం నుంచి అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉదయం 5గంటలకు మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్‌ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర–విష్వక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. సీఎం జగన్‌ యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్.. కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.

నాలుగు ఆగమాల నడుమ.. 
మే 17వ తేదీ బుధవారం వరకు 6 రోజులపాటు ఈ మహాయజ్ఞం కొనసాగనుండగా.. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరుగుతాయి. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉదయం మినహా  ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగుతాయి. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్టు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: బాగున్నావా అన్నా..?

భక్తుల కోసం నాలుగు క్యూలైన్లు 
యజ్ఞ కార్యక్రమాలను భక్తులు వీక్షించేలా ఉమ్మడిగా యాగశాలల చుట్టూ 4 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. యజ్ఞ కార్యక్రమాలను వీక్షిస్తూనే ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేలా వీటిని తీర్చిదిద్దారు. వాటిలో ఒకటి వీఐపీల కోసం కేటాయించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ఆధ్వర్యంలో భక్తులకు రోజుకు ఒక ఆలయం చొప్పున ప్రసాదాల పంపిణీ చేపడుతున్నాయి. తొలిరోజు విజయవాడ దుర్గ గుడి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగ లి పంపిణీ చేస్తారు.

యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 17వ తేదీన చివరి రోజు సీఎం జగన్‌  చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వ రూ­పానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞ కార్యక్రమాలు ముగుస్తాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

తప్పక చదవండి

Advertisement