CM Jagan Comments At Laid Foundation For Poor People Houses In Venkatapalem Meeting - Sakshi
Sakshi News home page

CM Jagan Venkatapalem Speech: అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి 

Published Tue, Jul 25 2023 3:24 AM

CM Jagan Comments At In houses foundation for poor people meeting - Sakshi

సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటి  రూపంలో పేద అక్కచెల్లెమ్మల చేతిలో ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్థిరాస్తిని పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామన్నారు.

వివిధ దశల్లో 22 లక్షల గృహాలు నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల మేర ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఆర్డీయేలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సోమవారం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను సీఎం జగన్‌ అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..  


సంతోషంగా స్వీకరిస్తున్నాం.. 
సీఆర్‌డీఏలో 50,793 మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలిచ్చాం. ఈ రోజు గృహ నిర్మాణాలను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని అత్యధికంగా ఆప్షన్‌–3 ఎంపిక చేసుకున్నారు. వారి నిర్ణయానికి అనుగుణంగా మన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తోంది. సీఆర్డీఏ ప్రాంతంలో గజం స్థలం కనీసం రూ.15 వేలు ఉంది.

ఈ లెక్కన పేద మహిళలకు ఇచ్చిన స్థలం విలువే రూ.7.50 లక్షలు ఉంటుంది. మరో రూ.2.70 లక్షలు వెచ్చించి ఇళ్లను నిర్మిస్తున్నాం. మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటి మీద మరో రూ.లక్ష పైచిలుకు ఖర్చు చేస్తున్నాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి ఈ ఆస్తి విలువ కనీసం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతుంది.   

అన్ని సదుపాయాలతో.. 
మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లేఅవుట్లను అభివృద్ధి చేసి 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు ఇళ్లను నిర్మించే బాధ్యత తీసుకుంటున్నాం. ప్రతి లేఅవుట్‌ వద్దకు అక్కచెల్లెమ్మలను తీసుకుని వెళ్లి ఇళ్ల పత్రాలిచ్చి ఆ ఇంటి స్థలంలో ఫొటోలు తీసి జియో ట్యాగింగ్‌ చేశాం. సీఆర్డీఏ పరిధిలో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్ల అభివృద్ధిలో భాగంగా ల్యాండ్‌ లెవలింగ్, ప్లాట్ల సరిహద్దు రాళ్లు కూడా పాతాం. దీనికోసం ఇప్పటికే రూ.56 కోట్లు ఖర్చు చేశాం.

ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. లేఅవుట్‌లలో నీటి సరఫరా కోసం రూ.32 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రూ. 326 కోట్లు, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి మరో రూ.8 కోట్లతో పనులకు శ్రీకారం చుడుతున్నాం. పేదల ఇళ్లు నిర్మించే కాలనీల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లు, షాపింగ్‌మాల్స్, పార్కులు వస్తాయి. మిమ్మల్నందరినీ ఆయా సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో మ్యాపింగ్‌ చేశారు. కౌంటర్లలో మీ ఇంటికి సంబంధించిన పత్రాలు మీ చేతుల్లో పెడతారు. ఇందుకోసం 25 కౌంటర్లు ఏర్పాటు చేశాం.   

ఏ ప్రభుత్వమూ చేయనంతగా 
గత నాలుగేళ్లలో ఏ ప్రభుత్వమూ చేయనంత మంచిని మీ బిడ్డ చేసి చూపించాడు. పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, వివక్షకు తావులేకుండా సేవలు, ఆర్బీకేల ద్వారా రైతన్నలకు దన్నుగా నిలిచాం. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌.. ఇలా వైద్య ఆరోగ్య సేవలలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలను తీసుకొస్తున్నాం.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి ఆరోగ్య ఆసరాను అమలు చేస్తున్నాం. వైద్య ఆరోగ్యసేవల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, పెద్ద ఎత్తున పేదల ఇళ్ల నిర్మాణం, సామాజిక వర్గాల సంక్షేమం, ప్రాంతాల సంక్షేమం, డీసెంట్రలైజేషన్, పోర్టులు..  ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంత మంచిని చేశాం.    

భావోద్వేగంతో కంటతడి 
ఇళ్లు నిర్మాణ మంజూరు పత్రాలు అందుకున్న పలువురు మహిళలు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. వాస్తవానికి 2020 డిసెంబర్‌లోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అయితే ప్రతిపక్షాల కుట్రలతో సీఆర్డీఏలో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది.  న్యాయపరమైన చిక్కులు పరిష్కారం అయ్యాక మూడేళ్ల అనంతరం తమకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం అందచేయడంతో ఉద్వేగానికి గురయ్యారు. వెంటనే ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

వరుణుడి ఆశీస్సులు  
సీఆర్డీఏలో సీఎం జగన్‌ చేతుల మీదుగా పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన మహిళా లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కృష్ణాయపాలెం లేఅవుట్‌లో భూమి పూజ అనంతరం వెంకటపాలెంలోని సభా ప్రాంగణానికి సీఎం జగన్‌ చేరుకున్న కొద్ది సేపటికే వర్షం ప్రారంభం అయింది.

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొందరు లబ్దిదారులు సభాప్రాంగణం వెలుపల నిల్చుని సీఎం ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. సుమారు అరగంట పాటు కొనసాగిన సీఎం జగన్‌ ప్రసంగాన్ని మహిళలు ఆసక్తిగా విన్నారు. ‘‘అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం పెత్తందారులపై పేద వర్గాల విజయానికి తార్కాణం. పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన ద్వారా సామాజిక అమరావతికి పునాది రాయి వేశాం...’ అని సీఎం జగన్‌ పేర్కొన్నప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

జై జగన్‌ నినాదాలు హోరెత్తాయి. ‘రాజధానిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కులాల సమతుల్యం దెబ్బతింటుందని వాదించారు. ఇలాంటి పెత్తందారులు, దుర్మార్గమైన మనుషులను, పార్టీలను గతంలో ఎప్పుడైనా మనం చూశామా..?’ అని సీఎం ప్రశ్నించడంతో.. చూడలేదని మహిళలు బిగ్గరగా సమాధానమిచ్చారు.  

Advertisement
Advertisement