అమరావతిలో పేదల ఇళ్ల పండుగ.. బొట్టు పెట్టి ఆహ్వానం | Sakshi
Sakshi News home page

అమరావతిలో పేదల ఇళ్ల పండుగ.. బొట్టు పెట్టి ఆహ్వానం

Published Sat, Jul 22 2023 6:02 AM

CM YS Jagan Bhumi Puja for house construction on 24th July - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి, మంగళగిరి: పేదల ఇళ్ల పండుగకు అమరావతి ముస్తా­బ­వుతోంది. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద సీఆర్‌డీఏ పరిధిలో కృష్ణా, గుంటూ­రు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా పేద­లకు ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా గృహ నిర్మాణాలకు శ్రీకా­రం చుట్టింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24వతేదీన పేదల ఇళ్ల నిర్మాణానికి కృష్ణాయపాలెంలో భూమి పూజ చేయనున్నారు.

ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులను సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. వలంటీర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బొట్టుపెట్టి ఈ కార్యక్రమానికి రావాలని సాదరంగా కోరుతున్నారు. వన మహోత్సవం సందర్భంగా అదే రోజు అమరావతిలో 5 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు రోజుల్లో మోడల్‌ హౌస్‌
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్‌లో లబ్ధిదారురాలు ఈపూరి జీవరత్నం ఇంటిని మోడల్‌ హౌస్‌గా నిర్మించారు.  షీర్‌ వాల్‌ పద్ధతిలో మూడు రోజుల స్వల్ప వ్యవధిలోనే అజయ వెంచర్స్‌ లేబర్‌ ఏజెన్సీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసింది. వీలైనన్ని ఇళ్లను షీర్‌ వాల్‌ పద్ధతిలో నిర్మించి వేగంగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు సులభంగా అర్థం అయ్యేలా మోడల్‌ హౌస్‌ను నిర్మించారు.

అత్యధికంగా ఆప్షన్‌–3 ఇళ్లు
ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది పేదలకు ప్రభుత్వం సీఆర్డీఏలో 1,366.48 ఎకరాల్లో 25 లేఅవుట్లలో ఇంటి స్థలాలను పంపిణీ చేసింది. 47,017 మంది లబ్ధిదారుల (ఎన్టీఆర్‌ జిల్లా 23,821, గుంటూరు జిల్లా 23,196) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు లభించాయి. వీరిలో 45,100 మంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చే ఆప్షన్‌–3ని ఎంపిక చేసుకున్నారు.

24,200 ఇళ్లను షీర్‌వాల్‌ పద్ధతిలో, మిగిలినవి సాధారణ పద్ధతిలో నిర్మించేందుకు 36 లేబర్‌ ఏజెన్సీలను గుర్తించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా రూ.365.91 కోట్లతో విద్యుత్, నీటి సదుపాయంతో పాటు అప్రోచ్‌ రోడ్లను వేస్తున్నారు. ఈ లేఅవుట్లలో రూ. 72.06 కోట్లతో మౌలిక వసతులతో పాటు స్కూళ్లు, హెల్త్‌ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు లాంటి సదుపాయాలను కల్పించనున్నారు.

పేదలకు 30 లక్షలకుపైగా ఇళ్లు
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల కోసం 30 లక్షలకు పైగా గృహ నిర్మాణం లక్ష్యంగా నవరత్నాలు పథకం ద్వారా సీఎం జగన్‌ చర్యలు చేపట్టారు. 30.65 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఇళ్ల స్థలాల కింద పేదలకు అందించిన స్థలాల మార్కెట్‌ విలువ రూ.75 వేల కోట్ల మేరకు ఉంటుంది. కేవలం స్థలాలిచ్చి సరిపుచ్చకుండా రెండు దశల్లో 21.25 లక్షల (టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు, సాధారణ ఇళ్లు 18.63 లక్షలు) ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకూ అనుమతులు ఇచ్చారు.

సీఆర్‌డీఏలో నిర్మించే ఇళ్లు వీటికి అదనం. సాధారణ ఇళ్లలో ఇప్పటికే 4.40 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రూ.లక్షల విలువ చేసే స్థలాలను ఉచితంగా సమకూర్చడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయాన్ని అందచేస్తున్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక, సబ్సిడీపై స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తున్నారు. 

సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 24న తొలుత కృష్ణాయపాలెం చేరుకుని ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించి లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. వెంకటాయపాలెం బహిరంగ సభలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శాంక్షన్‌ లెటర్‌ అందచేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, సీఆర్‌డీఏ కమిషనర్‌  వివేక్‌యాదవ్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సభాస్థలితో పాటు సీఎం ప్రసంగ వేదికను శుక్రవారం పరిశీలించారు. నవులూరు లే ఔట్‌ వద్ద సీఎం 5 వేల మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు. సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్, ఎండీ లక్ష్మీ షా తదితరులు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  

తోబుట్టువులా తోడుగా..
వలంటీర్‌గా పనిచేస్తున్నా. నా భర్త వ్యవసాయ కూలీ. పెళ్‌లై 13 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గత ప్రభుత్వం హయాంలో రెండు సార్లు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఒక్కసారి దరఖాస్తు చేయగానే ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. కృష్ణాయపాలెం లేఅవుట్‌లో నాకిచ్చిన స్థలంలో నా ఇంటినే మోడల్‌ హౌస్‌గా నిర్మించారు.

సీఆర్‌డీఏలో పూర్తయిన మొదటి ఇల్లు నాదే. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. పిల్లల చదువుకు అమ్మ ఒడి కింద సాయం చేశారు. పొదుపు సంఘంలో ఉన్న నాకు నాలుగు విడతల్లో రూ.10 వేల చొప్పున రుణమాఫీ అందించారు. తోబుట్టువులా సీఎం జగన్‌ అండగా ఉన్నారు. ప్రభుత్వం మాకు ఇళ్లు ఇస్తుంటే కొందరు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఆ వార్తలు విన్నప్పుడు ఎక్కడ ఇల్లు రాకుండా పోతుందోనని భయంగా ఉంటుంది.
– ఈపూరి జీవరత్నం, ఇళ్ల లబ్ధిదారురాలు, కృష్ణాయపాలెం, గుంటూరు జిల్లా

Advertisement
Advertisement