Sakshi News home page

సేంద్రియ గ్రామాలు

Published Wed, Apr 6 2022 3:01 AM

CM YS Jagan Comments on organic farming - Sakshi

సాక్షి, అమరావతి: సేంద్రియ సాగును రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. సహజ సాగు విధానాలను కేవలం ప్రయోగశాలలు, కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికీ అవగాహన పెంపొందించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంపై గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ప్లానెట్‌ (జీఏఎస్‌పీ) సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో చర్చించారు. వ్యవసాయదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల గురించి తెలియచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

ధరల్లో వ్యత్యాసం కనిపించాలి..
సహజ సాగు ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించి ప్రోత్సహించేలా సర్టిఫికేషన్‌ చేపట్టాలి. సాధారణ సాగు పద్ధతుల ఉత్పత్తులకు, సహజ సాగు ఉత్పత్తుల ధరల మధ్య తేడా స్పష్టంగా కనిపించాలి. రసాయనాలు, కృత్రిమ ఎరువులను వినియోగించి పండించే ఆహార ఉత్పత్తులు కేన్సర్‌ లాంటి వ్యాధులకు దారి తీస్తున్నాయి.

ప్రత్యేకంగా యూనివర్సిటీ
సహజసాగు విధానాలు కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో అమలు కావాలి. మన దగ్గరున్న ఆర్బీకేలు లాంటి వ్యవస్థలను వినియోగించుకోవడం ద్వారా సహజ సాగు విధానం ద్వారా ఆశించిన మార్పులను సాధించగలుగుతాం. మీ సహకారంతో వ్యవస్ధలో మంచి మార్పులు తేవచ్చు. సహజ సాగులో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్ధాయిలో నిలబెట్టేలా ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. దీనిపై అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. సహజసాగులో గ్రాడ్యుయేషన్‌ ప్రవేశపెట్టాలని సూచించాం. తద్వారా మెరుగైన శిక్షణ పొందిన విద్యార్ధులు బయటకు వస్తారు. 

గ్రామాల్లో సరికొత్త వ్యవస్థ..
దేశ చరిత్రలోనే తొలిసారిగా వ్యవసాయ రంగంలో సరికొత్త వ్యవస్ధను తీసుకొచ్చాం. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉండగా 10,777 రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లోనే ఏర్పాటు చేశాం. అగ్రికల్చర్, హార్టికల్చర్‌ అసిస్టెంట్లు ఆర్బీకేల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో కియోస్క్‌ను కూడా ఏర్పాటు చేశాం. గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తూ రైతును చేయి పట్టుకుని నడిపించే బాధ్యత తీసుకున్నాం. సకాలంలో అందించడంతోపాటు నకిలీలు, కల్తీలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఆర్బీకేలు కేంద్రంగా విక్రయాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వమే విత్తనాలు, ఎరువుల నాణ్యతను నిర్ధారించిన తర్వాత రైతులకు అందిస్తున్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను దగ్గరుండి చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి పంటనూ, ప్రతి ఎకరాను  ఇ–క్రాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి జియో ట్యాగింగ్‌ చేస్తున్నాం. రైతుతో పాటు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేస్తున్నాం. తద్వారా రైతులకు ప్రభుత్వం తరఫున అన్ని రాయితీలు అందేలా చర్యలు తీసుకున్నాం. పంట నష్టపోతే ఈ వివరాల సాయంతో పరిహారాన్ని వేగంగా చెల్లిస్తున్నాం. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా అర్హత కలిగిన ప్రతి రైతుకూ ఇ–క్రాప్‌ ద్వారా పారదర్శకంగా సాయం అందచేస్తున్నాం.

సహజ సాగు కేంద్రాలుగా ఆర్బీకేలు
ఆర్బీకేలు భవిష్యత్తులో సహజ సాగుకు కేంద్రాలుగా మారనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 2 వేల మందికి ఒక ఆర్బీకే అందుబాటులో ఉంది. సహజసాగు విధానాలను ప్రోత్సహించేలా వీటిని సాంకేతికంగా పటిష్టం చేస్తాం. సహజ సాగు కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఉపకరణాలను అందుబాటులో ఉంచడం ద్వారా రైతన్నలకు అవగాహన పెరుగుతుంది. 

వ్యర్థాలపై స్పష్టమైన విధానం..
ఎకో టూరిజం ద్వారా పెద్ద సంఖ్యలో స్ధానిక యవతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. దీనిపై అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలి. ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చి సముద్ర తీరాలను శుభ్రం చేయడం అభినందనీయం. రాష్ట్రంలో ఇప్పటికే ఇలాంటి వ్యర్ధాల సేకరణపై స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నాం. నాన్‌ బయో డీ గ్రేడబుల్‌ వ్యర్థాల రీ సైక్లింగ్, పునర్వినియోగానికి సంబంధించి జీఏఎస్‌పీ లాంటి సంస్థల సహకారాన్ని తీసుకుంటాం. ఈ సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, పుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఏపీ మార్క్‌ఫెడ్‌ ఎండీ పీఎస్‌ ప్రద్యుమ్న, జీఏఎస్‌పీ ఛైర్మన్‌ ఎరిక్‌ సోలమ్, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్‌ సత్య త్రిపాఠి, పార్లీ ఫర్‌ ది ఓషన్స్‌ ఫౌండర్‌ సైరల్‌ గట్చ్, ఎకో టూరిజం ఇన్వెస్టర్‌ అదితి బల్బిర్, ఎస్‌ 4 కేపిటల్‌ పీఎల్‌సీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌  పోరన్‌ మలాని  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement