విభజన సమస్యల పరిష్కారంపై గట్టిగా డిమాండ్‌ చేద్దాం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం..గట్టిగా డిమాండ్‌ చేద్దాం: సీఎం జగన్‌

Published Mon, Aug 29 2022 3:36 PM

CM YS Jagan Focus On Issues To Be Discussed in the Southern States Meeting - Sakshi

అమరావతి:  సెప్టెంబర్‌3వ తేదీన తిరువనంతపురంలో జరుగనున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం సమావేశం జరిగింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యుత్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక, ప్రణాళిక, శాససనభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య తదితరులు హాజరయ్యారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. 

రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, దీన్ని జోనల్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావిస్తూ, వీటి పరిష్కారంకోసం సమావేశంలో దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ సూచించారు. పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలన్న సీఎం.. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపించడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలను అమలుచేసేదిగా ఉండాలంటూ గట్టిగా డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయిందని, ఇప్పుడు విభజన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతున్నకొద్దీ... రాష్ట్రానికి తీవ్రంగా నష్టమే జరుగుతోందని ఈ సందర్భంగా సీఎం జగన్‌ తెలిపారు. అందుకే వీటి పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్నికూడా అజెండాలో ఉంచాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి రాష్ట్రం నుంచి ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలో ప్రతినిధుల బృందం హాజరు కానున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement