YS Jagan Jobs ఏపీ: భారీ నియామకాలు.. 14,200 పోస్టుల భర్తీ

25 Sep, 2021 03:27 IST|Sakshi

వైద్య ఆరోగ్య శాఖలో  భారీగా నియామకాలకు సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది, కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష

ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్య కళాశాల, బోధనాస్పత్రుల వరకు ఖాళీలు భర్తీ చేయండి

అక్టోబర్‌ నుంచి ప్రక్రియ ప్రారంభం.. నవంబర్‌ 15 నాటికి ముగింపు

కోట్లాది రూపాయల ఖర్చుతో ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం

తీరా అక్కడ సిబ్బంది లేకపోవడంతో రోగులకు సేవలు అందని పరిస్థితి

ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు

ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో వ్యాక్సినేషన్‌కు ప్రత్యేక డ్రైవ్

కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి అధికారులు చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అక్టోబరు 1 నుంచి పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్‌ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని  ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది నియామకం, కోవిడ్‌–19 నివారణ, వ్యాక్సినేషన్‌పై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బంది, జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుత అవసరాలు తదితర వివరాలపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. 

డాక్టర్‌ సెలవులో వెళ్తే మరో డాక్టర్‌ విధులు నిర్వహించాలి
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి. ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా వ్యవస్థ ఉండాలి.  ఈ మేరకు తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలి. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితి కానీ, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కానీ ఉండకూడదు. కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు నిర్వహించాలి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ఇదే సమయంలో సరిపడా సిబ్బంది లేని కారణంగా రోగులకు మంచి సేవలు అందని పరిస్థితి ఇకపై ఉంటానికి వీల్లేదు. 

మూడు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి 
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి. ఇందుకోసం ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలి.   
రాత్రి పూట కర్ఫ్యూ యధావిధిగా అమలు చేయాలి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అంక్షలు కొనసాగుతాయి. కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియే కోవిడ్‌ సమస్యకు పరిష్కారం. అందువల్ల దీన్ని వేగవంతం చేయాలి.  
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

కోవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ఇలా.. 
ఏపీలో యాక్టివ్‌ కేసులు : 13,749  
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు : 2,787 
కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 562 
రికవరీ రేటు శాతం : 98.60  
పాజిటివిటీ రేటు శాతం : 2.12  
3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు : 10 
 3 నుంచి 5 శాతం పాజిటివిటీ ఉన్న జిల్లా : 2 
5% కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న జిల్లా : 1 
రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 10,921 
నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్స్‌ శాతం : 91.33  
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్స్‌ శాతం : 72.64  

థర్డ్‌ వేవ్‌ పై సన్నద్ధత 
అందుబాటులో ఉన్న డీ టైప్‌ సిలెండర్లు : 27,311 
అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు : 20,964 
ఇంకా అందుబాటులోకి రావాల్సినవి : 2,493 
ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తయిన ఆస్పత్రులు : 128 
ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు : 143  
అక్టోబర్‌ 10 నాటికి మొత్తం అందుబాటులోకి.. 

వ్యాక్సినేషన్‌ 
ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య : 2,61,56,928 
సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు : 1,34,96,579 
రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న వారు : 1,26,60,349 
వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు : 3,88,17,277 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు