దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం

14 Nov, 2020 02:55 IST|Sakshi

పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 

ప్రాజెక్టు ఫలాలను 13 జిల్లాల ప్రజలకు అందించే దిశగా పనులు 

52 మీటర్ల ఎత్తుకు స్పిల్‌ వే పనులు పూర్తి.. పూర్తయ్యే దశకు స్పిల్‌ వే బ్రిడ్జి  

నెలాఖరు నుంచే 48 గేట్లు బిగించే పనులకు శ్రీకారం 

వరదలు ప్రారంభమయ్యేలోగా 17,760 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం 

2021 డిసెంబర్‌కు ప్రాజెక్టు పూర్తి.. 2022 జూలైకల్లా ఆయకట్టుకు నీటి సరఫరా 

రాష్ట్ర ప్రజల ఆరున్నర దశాబ్దాల కలకు కార్యరూపం ఇచ్చిన మహానేత వైఎస్సార్‌

పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

13 జిల్లాల ప్రజలకు ప్రాజెక్టు ఫలాలను అందించే దిశగా పనులు

52 మీటర్ల ఎత్తుకు స్పిల్‌ వే పియర్స్‌ పనులు పూర్తి

పూర్తయ్యే దశకు చేరుకున్న స్పిల్‌ వే బ్రిడ్జి పనులు

నెలాఖరు నుంచే 48 గేట్లు బిగించే పనులకు శ్రీకారం

17,760 నిర్వాసిత కుటుంబాలకు గోదావరికి వరదలు ప్రారంభమయ్యేలోగా పునరావాసం

2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి.. 

2022 జూలైకల్లా ఆయకట్టుకు నీటి సరఫరా

రాష్ట్ర ప్రజల ఆరున్నర దశాబ్దాల కలకు కార్యరూపం ఇచ్చిన దివంగత మహానేత వైఎస్సార్‌

(రామగోపాలరెడ్డి ఆలమూరు) పోలవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: గోదావరి నదిపై రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఆరున్నర దశాబ్దాలపాటు కాగితాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టుకు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో కార్యరూపం ఇస్తే.. ప్రస్తుతం ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాలకు పోలవరం ప్రాజెక్టు ఫలాలను అందించడానికి నడుం బిగించారు. 960 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రాన్ని పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వెలుగులు పంచేందుకు సిద్ధమయ్యారు. 

ప్రాజెక్టు పూర్తికి పక్కా ప్రణాళిక 
2019 జూన్‌ 20న ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌ 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, 2022 జూలై కల్లా ఆయకట్టుకు నీళ్లందించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హెడ్‌ వర్క్స్‌ పనులను కొత్తగా మేఘా సంస్థకు అప్పగించారు. స్పిల్‌ వే పూర్తి చేసి, గోదావరి వరదను మళ్లించాక.. కాఫర్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేయాలని, ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేసి.. వాటికి సమాంతరంగా అనుసంధానాలు, కాలువలు, పిల్ల కాలువలు, విద్యుత్‌ కేంద్రం పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందించాలని నిర్ణయించారు. 

నెలాఖరులో గేట్ల బిగింపు 
రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా హెడ్‌ వర్క్స్‌ పనులు దక్కించుకున్న మేఘా సంస్థ గతేడాది నవంబర్‌లో పనులు చేపట్టింది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ చుట్టూ చేరిన వరద నీటిని తోడేందుకు రెండు నెలలు సమయం పట్టింది. ఈలోగా కరోనాతో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. లాక్‌ డౌన్‌ సడలించేలోగా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. ఇప్పటివరకు స్పిల్‌ వే పనుల్లో 1.902 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసింది. 48 గేట్లను సిద్ధం చేసింది. వాటిని బిగించడానికి 96 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లు, సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇందులో ఇప్పటికే 46 హైడ్రాలిక్‌ హాయిస్ట్‌లు, సిలిండర్లను దిగుమతి చేసుకుంది. మిగిలిన 50 జనవరిలో రానున్నాయి. నెలాఖరు నుంచి గేట్ల బిగింపు పనులు ప్రారంభించి.. ఏప్రిల్‌ నాటికి 48 గేట్లను బిగించే పనులు పూర్తి చేయనున్నారు. 

► నెలాఖరు నుంచి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లలో ఎడమ వైపు ఖాళీ ప్రదేశాలను భర్తీ చేసి, వాటిని 42 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసి.. గోదావరి డెల్టాకు నీటిని స్పిల్‌ వే మీదుగా మళ్లించి, కాఫర్‌ డ్యామ్‌ల కుడి వైపు ఖాళీలను భర్తీ చేసే పనులను ఏప్రిల్‌ కల్లా పూర్తి చేయనున్నారు. జూన్‌లో వచ్చే వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లిస్తారు. 
► హెడ్‌ వర్క్స్‌ పనులకు సమాంతరంగా జలవిద్యుత్‌ కేంద్రం పనులు చేపడుతున్నారు. స్పిల్‌ చానల్‌ పనుల్లో 1.095 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు, 7.451 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి. స్పిల్‌ ఛానల్‌లో చేరిన వరద నీటిని తోడివేసి, ఏప్రిల్‌లోగా స్పిల్‌ చానల్‌ను  పూర్తి చేసేలా పనులను వేగవంతం చేశారు  
► జలాశయాన్ని, కుడి కాలువను అనుసంధానం చేసే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఎడమ కాలువను అనుసంధానం చేసే పనులు పూర్తి కావొస్తున్నాయి. ఎడమ కాలువలో మిగిలిన పనులు, 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డి్రస్టిబ్యూటరీల పనులు జూన్, 2022 నాటికి పూర్తి చేసి, ఆయకట్టుకు నీటిని అందించేలా పనులను వేగవంతం చేశారు. 

వైఎస్‌ హయాంలోనే కాలువల పనులు పూర్తి 
1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడూ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును చేపట్టాలనే ఆలోచన చేయలేదు. 2004, మే 14న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలనే లక్ష్యంతో జలయజ్ఞం చేపట్టారు. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. కుడి, ఎడమ కాలువల్లో అధిక శాతం పనులు పూర్తి చేశారు. ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే క్రమంలో మహానేత వైఎస్‌ అమరుడయ్యారు. 

చంద్రబాబు దోపిడీ పర్వం 
రాష్ట్ర విభజన నేపథ్యంలో పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం, వంద శాతం ఖర్చుతో తామే పూర్తి చేస్తామని చెప్పినా.. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి అప్పగించాలంటూ ఒత్తిడి చేశారు. పోలవరం బాధ్యతను కేంద్రం రాష్ట్రానికి అప్పగించే వరకు, అంటే 2014 జూన్‌ 8 నుంచి 2016,సెపె్టంబర్‌ 8 వరకు ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. తర్వాత కమీషన్ల కోసం స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులు ఒకేసారి చేపట్టారు. అయితే స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌లు పునాది స్థాయిని దాటలేదు. ఎగువ దిగువ, కాఫర్‌ డ్యామ్‌ పనులను మధ్యలో వదిలేశారు. దాంతో గతేడాది, ఈ ఏడాది గోదావరి వరదలు ముంపు గ్రామాల్లోకి చేరాయి. కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోదీయే విమర్శించారంటే టీడీపీ ప్రభుత్వం ఎంత దోపిడీకి పాల్పడిందో అర్ధమవుతుంది. 

అవినీతిని ప్రక్షాళన చేయించిన సీఎం జగన్‌ 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.7,984.93 కోట్ల విలువైన పనులను చంద్రబాబు నామినేషన్‌ పద్ధతిలో కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇందులో ఒక్క హెడ్‌ వర్క్స్‌లోనే రూ.3,489.93 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై అప్పగించారు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక.. నిపుణుల కమిటీతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు పాల్పడిన అవినీతిని ప్రక్షాళన చేయించారు. ఆ కమిటీ సూచనతో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి రూ.838.51 కోట్లను ఆదా చేశారు. 

మహానేత ప్రారంభిస్తే ఆయన తనయుడు పూర్తి చేస్తున్నారు 
2004 వరకు పోలవరం ఊసెత్తడానికే ముఖ్యమంత్రులు భయపడ్డారు. 2004లో దివంగత మహానేత వైఎస్సార్‌ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తర్వాత చంద్రబాబు.. పనులు చేయకుండానే ప్రాజెక్టు పూర్తయినట్లు పూటకో నాటకం, రోజుకు డ్రామా నడిపించారు. ప్రజాధనం అడ్డగోలుగా దోచుకుని ప్రజలకు పోలవరం ఇప్పటివరకు అందుబాటులోకి రాకుండా చేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక పనులను వేగవంతం చేశారు. మహానేత ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2021 డిసెంబర్‌కు పూర్తి చేసి, ఆయన తనయుడు జగన్‌ చేతుల మీదుగా జాతికి అంకితమిస్తాం. 
–పి.అనిల్‌కుమార్‌ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి 

2022 జూలైకి ఆయకట్టుకు నీళ్లు 
2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి..2022 జూలై నాటికి ఆయకట్టుకు నీళ్లందించేలా సీఎం వైఎస్‌ జగన్‌ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను నిక్కచ్చిగా అమలు చేస్తున్నాం. ఏప్రిల్‌ నాటికి స్పిల్‌ వే పూర్తి చేస్తాం. ఆలోగా కాఫర్‌ డ్యామ్‌లు పూర్తవుతాయి. కాలువలు పూర్తి చేసి 2022 జూలై నాటికి 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తాం. కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టును స్థిరీకరిస్తాం. మొత్తం 38.41 లక్షల ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టు ప్రపంచంలో ఒక్క పోలవరమే.     
– ఆదిత్యనాథ్‌ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ 

నాడు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉభయగోదావరి జిల్లాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆయా గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలి. అప్పుడే జలాశయంలో గరిష్ట స్థాయిలో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు.  మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 నాటికే పునరావాస కాలనీల్లో 3,110 గృహాలను నిర్మించారు. అప్పట్లోనే 2 వేల కుటుంబాలను ఆ కాలనీలకు తరలించారు. 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు టీడీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఇంటిని నిర్మించలేదు. వైఎస్‌ హయాంలో నిర్మించిన 1,110 ఇళ్లల్లోకి ఆ సంఖ్య మేరకు కుటుంబాలను మాత్రమే తరలించి.. 73 శాతం ప్రాజెక్టు పూర్తయినట్లు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ, ఓ వర్గం మీడియా సహకారంతో ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేసింది. 

నేడు
ముంపు గ్రామాల్లోని మిగతా 1,02,491 కుటుంబాలకు రూ.24,249.14 కోట్లతో పునరావాసం కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు అంతే స్థాయిలో గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిలో అధిక శాతం ఇళ్లు పూర్తయ్యాయి. గోదావరికి వరదలు ప్రారంభమయ్యేలోగా అంటే జూన్‌ నాటికి ఆ కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేసింది. మిగిలిన 84,731 కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించనుంది.  

నాడు
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే ఫొటో ఇది.. 2014 జూన్‌ 8 మొదలుకుని 2019 మే 29 వరకు టీడీపీ ప్రభుత్వం సగటున 22 మీటర్ల స్థాయికి స్పిల్‌ వే పనులను మాత్రమే చేయగలిగింది. స్పిల్‌ వేకు 25.72 మీటర్ల స్థాయిలో గేట్లను బిగిస్తారు. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో స్పిల్‌ వే పునాది పనులు మాత్రమే జరిగాయి. కానీ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయిందన్నట్టుగా అబద్ధాలు వల్లె వేశారు. ఇప్పటికీ అవే అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. 

నేడు 
ఇది కూడా స్పిల్‌ వే ఫొటోనే.. గోదావరి వరదల ఉధృతి, కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ప్రతిబంధకాల మధ్య కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్వల్ప కాలంలోనే స్పిల్‌ వేను 52 మీటర్ల స్థాయికి పూర్తి చేసింది. అత్యంత క్లిష్టమైన 50 పియర్స్‌ (భారీ కాంక్రీట్‌ స్తంభాల) ఏర్పాటు ప్రక్రియను 30 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. వరద ఉధృతిలోనూ పియర్స్‌పై స్పిల్‌ వే బ్రిడ్జి పనులు చేపట్టింది. ఇప్పుడు ఆ బ్రిడ్జి కూడా పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నుంచి 48 గేట్లను బిగించే పనులను చేపట్టి, వచ్చే ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసే దిశగా వేగంగా ముందుకు వెళుతోంది. ఆ క్రమంలోనే రేయింబవళ్లు (24్ఠ7) పనులు చేస్తోంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా