Andhra Pradesh: సంపూర్ణ ‘మద్దతు’ | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: సంపూర్ణ ‘మద్దతు’

Published Tue, Apr 25 2023 3:38 AM

CM YS Jagan high level review of agriculture department - Sakshi

రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎక్కడైనా మద్దతు ధర లభించని పక్షంలో వెంటనే మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఎమ్మెస్పీ దక్కేలా చర్యలు తీసుకోవాలి. పంటల ధరల పర్యవేక్షణకు తెచ్చిన ‘సీఎం యాప్‌’ విషయంలో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలి. యాప్‌ ద్వారా రోజువారీ పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించుకున్న విధంగా (ఎస్‌వోపీ) పనిచేసేలా పర్యవేక్షిస్తూ, లోపాలుంటే చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాలి. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతన్నలను అక్కడకు వెళ్లండి.. ఇక్కడకు వెళ్లండంటూ తిప్పొద్దు. ఏ ఒక్క రైతన్న కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రబీ ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేక­రించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రసీదు అందచేయడంతోపాటు అందులో కొన్ని సూచనలు తప్పనిసరిగా పొందుపర­చాల­న్నారు. నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉండాలి? అందుకోసం ఎలాంటి చర్యలు తీసు­కోవాలి? అనే వివరాలతో సూచనలు ఉండాలన్నారు.



ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తీసుకొచ్చిన 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ రసీదులో తప్పనిసరిగా ఉండాలని, దళా­రులు, మిల్లర్ల ప్రమేయానికి తావులేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కొనుగోళ్ల సందర్భంగా ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ..

విదేశాల్లో డిమాండ్‌ ఉన్న వంగడాల సాగు..
విదేశాల్లో డిమాండ్‌ ఉన్న వరి వంగడాలను సాగు చేయడంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలి. ఆ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ఎగుమతులు పెరిగి రైతులకు మంచి ధర వస్తుంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే మే నెలలో వైఎస్సార్‌ రైతు భరోసా తొలి విడత పెట్టుబడి సాయాన్ని జమ చేసేలా ఏర్పాట్లు చేయాలి. మే 10వతేదీ కల్లా అర్హులైన జాబితాలను సిద్దం చేయాలి

ప్రతీ ఆర్బీకే పరిధిలో గోడౌన్‌
కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు వీలుగా దశలవారీగా ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక గోడౌన్‌ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌ సీజన్‌ కోసం అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఏటా పంపిణీ చేసే ఇన్‌పుట్స్‌ పెంచుకుంటూ వెళ్లాలి. పంపిణీ ప్రక్రియ మరింత సమర్థంగా ఉండాలి. ఆర్బీకేల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి. మే 20వతేదీలోగా మిగిలిన ఆర్బీకేల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి సాగు ఉపకరణాల పంపిణీ చేపట్టాలి. జూలై కల్లా 500 ఆర్బీకేల పరిధిలో కిసాన్‌ డ్రోన్లు అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధం కావాలి.

ఈ – కేవైసీ 97.5 శాతం
రబీలో సాగైన 48.02 లక్షల ఎకరాల్లో పంటలను ఈ–క్రాప్‌ బుకింగ్‌ పూర్తి చేసినట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. రైతులందరికీ డిజిటల్‌గానే కాకుండా భౌతికంగా కూడా రశీదులిచ్చి పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖలకు డేటాను పంపినట్లు వివరించారు. ఈ–కేవైసీ 97.5 శాతం పూర్తైందన్నారు. రబీలో సాగైన పంట ఉత్పత్తుల కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టామని, తొలిసారిగా రైతులకు అందిస్తున్న గన్నీ బ్యాగులు, రవాణా ఖర్చుల చెల్లింపులు దాదాపుగా పూర్తి చేశామని చెప్పారు.

ఖరీఫ్‌ సీజన్‌లో రూ.7,233 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా ఇప్పటికే రూ.7,200 కోట్లు రైతులకు చెల్లించినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాల వల్ల మరో రూ.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలియచేయడంతో వాటిని పరిష్కరించి రైతులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ. తిరుపాల్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, చిరంజీవి చౌదరి, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్, ఉద్యాన, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల కమిషనర్లు ఎస్‌ఎస్‌ శ్రీధర్, రాహుల్‌పాండే, హెచ్‌.అరుణ్‌కుమార్, విత్తనాభివృద్ధి, పౌరసరఫరాల సంస్థల ఎండీలు డాక్టర్‌ గెడ్డం శేఖర్‌ బాబు, జి.వీరపాండ్యన్‌ తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్ల వినియోగంపై ఎన్జీరంగా వర్సిటీ శిక్షణ
► జూలై నాటికి 500, డిసెంబర్‌ నాటికి 1,500 ఆర్బీకేల పరిధిలో కిసాన్‌ డ్రోన్లు సమకూర్చేలా కార్యాచరణ సిద్ధం. 
► డ్రోన్ల వినియోగంపై తిరుపతి, కడప, మార్టేరు, విజయనగరంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు. 
► ఇప్పటికే 6,500 ఆర్బీకేల పరిధిలో యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు. మరో 3,953 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు (సీహెచ్‌సీ), 194 క్లస్టర్‌ స్ధాయి సీహెచ్‌సీలకు మే 20లోగా వైఎస్సార్‌ యంత్రసేవా పథకం ద్వారా సాగు ఉపకరణాలు అందించేలా సన్నద్ధం.
► ఆర్బీకేల స్ధాయి సీహెచ్‌సీలకు రూ.8.2 లక్షలు, క్లస్టర్‌ స్ధాయి సీహెచ్‌సీలకు రూ.25 లక్షల విలువైన యంత్రాలు అందుబాటులోకి. 
► గతేడాది సుమారు 7 లక్షల టన్నులకు పైగా ఎరువుల సరఫరా. ఈ ఏడాది మరింత పెంచేలా చర్యలు.
► ఆర్బీకేల్లో 4,656 పశు సంవర్ధక, 1,644 ఉద్యాన, 467 వ్యవసాయ, 64 మత్స్య, 23 పట్టు సహాయకుల పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు. 
► ప్రతి ఆర్బీకే పరిధిలో గోదాము నిర్మించే లక్ష్యంతో మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి. ఇప్పటికే 1,005 చోట్ల గోడౌన్ల నిర్మాణం చేపట్టగా 206 చోట్ల పూర్తి. తుది మెరుగులు దిద్దుకుంటున్న మరో 93 గోడౌన్లు. వివిధ దశల్లో గోదాములను జూలై కల్లా పూర్తి చేసేలా చర్యలు.  

Advertisement
Advertisement