కోవిడ్‌ పట్ల నిరంతరం అప్రమత్తం | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ పట్ల నిరంతరం అప్రమత్తం

Published Wed, Sep 9 2020 4:09 AM

CM YS Jagan High Level Review Meeting On Covid-19 Prevention - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. వాక్సిన్‌ వచ్చే వరకు కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు, అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల (జీజీహెచ్‌)లో కోవిడ్‌–19 పరీక్షలు తప్పనిసరిగా జరగాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ వస్తే ఏం చేయాలి? ఎవరికి ఫోన్‌ చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అన్న విషయాలు తెలియని వారెవ్వరూ రాష్ట్రంలో ఉండకూడదన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కోవిడ్‌–19 నివారణ చర్యలపై వీడియో కాన్పరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు.  సీఎం ఏమన్నారంటే..

104 కాల్‌ సెంటర్‌.. మాక్‌ కాల్స్‌
► కోవిడ్‌ పరీక్షలు, ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ఆస్పత్రుల్లో అడ్మిషన్లు తదితర అన్ని అవసరాలకు 104 కాల్‌ సెంటర్‌ను ఉపయోగించుకోవాలి. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆ కాల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్‌కు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే స్పందించాలి. కలెక్టర్లు, జేసీలు ప్రతి రోజూ 104 కాల్‌ సెంటర్లకు, జిల్లా కోవిడ్‌ సెంటర్లకు మాక్‌ కాల్స్‌ చేసి, వ్యవస్థలో ఎక్కడైనా ఉదాసీనత ఉందేమో పరీక్షించాలి.
► కోవిడ్‌ ఆస్పత్రులలో 6 నెలల కోసం తాత్కాలిక ప్రాతిపదికన దాదాపు 17 వేల మంది వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది నియామకం. మరో 11 వేల మంది శిక్షణ నర్సులను నియమించాలని ఆదేశాలు ఇచ్చాం. 
► దాదాపు 28 వేల మంది సిబ్బంది నియామకం వెంటనే పూర్తయ్యేలా చూడాలి. డ్యూటీలో చేరిన వారు సక్రమంగా విధులకు హాజరయ్యేలా కూడా చూడాలి.

కిట్‌లు.. పర్యవేక్షణ, బెడ్లు
► హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్‌లు, సేవలు ఎలా అందుతున్నాయన్న దానిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇవాళ రాష్ట్రంలో 26,250 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయి. 350 బెడ్ల నుంచి మొదలు పెట్టి ఈ స్థాయికి చేరుకున్నాం. రాష్ట్రంలో మొత్తం 31,589 బెడ్లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాబట్టి, ఇంకా 5,339 బెడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి. 
► అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీకి అనుమతి ఇచ్చాం. ప్లాస్మా దాతల వివరాలు సేకరించి, అన్ని ఆస్పత్రులకు డేటా అందుబాటులో ఉండాలి.  
► కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు.

కోవిడ్‌ పరీక్షలు – ఆస్పత్రులు, ప్రమాణాలు
► ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్‌ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటల్లోగా, ర్యాపిడ్‌ పరీక్షలో 30 నిమిషాల లోపు ఫలితం అందించే విధంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఎక్కడా పరీక్షలకు నిరాకరించొద్దు.
► పాజిటివ్‌ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లు ఉన్న వారిని కచ్చితంగా హోం క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. కోవిడ్‌ సోకిన వారు ఆస్పత్రికి వస్తే అరగంటలో బెడ్‌ కేటాయిస్తున్నామా? లేదా? చూడాలి. 
► రాష్ట్రంలో దాదాపు 224 కోవిడ్‌ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వాటన్నింటిలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. ఆ ఆస్పత్రులలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, తగిన సంఖ్యలో వైద్యులు, నర్సులు ఉన్నారా? లేరా?.. అన్న నాలుగు ప్రమాణాలు ఎలా ఉన్నాయన్న దానిపై కలెక్టర్లు, జేసీలకు ఎప్పటికప్పుడు నివేదికలు రావాలి. హెల్ప్‌ డెస్క్‌లు ఎలా పని చేస్తున్నాయన్నది కూడా చూడాలి.

Advertisement
Advertisement