‘నాటు’ ఊబి దాటించాలి

2 Sep, 2022 05:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: నాటుసారా తయారీలో కూరుకుపోయిన కుటుంబాలను దాని నుంచి బయటకు తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆయా కుటుంబాలు స్వయం ఉపాధితో గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడంతో పాటు జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు. ఇతర వ్యవసాయ పంటలను సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, సహాయ సహకారాలు అందించాలని నిర్దేశించారు.

దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయి సాగుపై దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. గంజాయి సాగును విడనాడి ఇతర వ్యవసాయ పంటలు సాగు చేస్తున్న వారికి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చి వారికి రైతు భరోసా కూడా వర్తింప చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో షాక్‌ కొట్టేలా రేట్లు పెంచడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు. బెల్టు షాపులను ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడం ద్వారా మద్యం వినియోగాన్ని బాగా నియంత్రించామని తెలిపారు. ఎక్సైజ్, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, అటవీ, పర్యావరణ శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. లీకేజీలు లేకుండా పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

కాలేజీలు, వర్సిటీల ఎదుట ఎస్‌ఈబీ నంబర్‌ డిస్‌ప్లే 
మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రతి కాలేజీ, యూనివర్సిటీ ఎదుట ఎస్‌ఈబీ నంబర్‌ను ప్రదర్శించాలి. ఎస్‌ఈబీ నంబర్‌తో డిస్‌ప్లే బోర్డులు పెట్టాలి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కడా ఉండకూడదు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సెప్టెంబరు నెలాఖరుకల్లా ఈ బోర్డులు ఏర్పాటు చేయాలి. 

గంజాయి సాగుపై దాడులు
గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను సూచించాలి. ఆహార ధాన్యాలు, ఇతర పంటలను సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, సహకారాన్ని అందించాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయి సాగుపై దాడులు నిర్వహించాలి.

గనుల నిర్వహణపై పరిశీలన
మైనింగ్‌కు సంబంధించి అన్ని రకాల అనుమతులు పొంది లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనులను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలి. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి పరిశీలించాలి. లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్‌లో ఉండేలా చూడాలి. ఒకవేళ ఆపరేషన్‌లో లేకపోతే కారణాలను అన్వేషించి తగిన చర్యలు తీసుకోవాలి. ఏమైనా సమస్యలుంటే సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి. అన్ని అనుమతులూ పొంది నిర్వహణలో లేకపోతే ఆదాయాలు రావు.

ఎర్రచందనం విక్రయంలో పారదర్శకత
ఎర్రచందనం విక్రయానికి అన్ని రకాల అనుమతులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. అక్టోబరు – మార్చి మధ్య 2,640 మెట్రిక్‌ టన్నుల విక్రయానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని, గ్రేడింగ్‌లో థర్డ్‌ పార్టీతో కూడా పరిశీలన చేయించాలని సీఎం జగన్‌ సూచించారు. గంజాయి సాగును గుర్తించిన చోట్ల ఇతర పంటల సాగు చేపట్టేందుకు ప్రభుత్వం తరపున ఇప్పటికే విత్తనాలు అందించామని అధికారులు వివరించారు. 2,500 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. పండించిన పంటలను జీసీసీ ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. 1,600 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

మిగిలిన చోట్ల ఎక్కడైనా గంజాయి సాగు చేస్తే దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె.నారాయణస్వామి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, అడిషనల్‌ డీజీ ఎ.రవిశంకర్, అటవీ పర్యావరణశాఖ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై. శ్రీలక్ష్మి, ఎౖMð్సజ్, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

గణనీయంగా తగ్గిన మద్యం వినియోగం
►    రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని అధికారులు తెలిపారు. 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.31 లక్షల కేసులు కాగా 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గినట్లు పేర్కొన్నారు.
►      2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా 2021–22లో గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గిపోయాయి. 
►      2018 – 19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లు కాగా 2021 – 22లో ఆదాయం రూ.25,023 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 
►     గత ఆర్నెల్లలో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తం 20,127 కేసులు నమోదయ్యాయి. 16,027 మందిని అరెస్టు చేసి 1,407 వాహనాలు సీజ్‌ చేశారు. నాటుసారా తయారీనే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏసీబీ నంబర్‌ 14400తో బోర్డులు
అవినీతి కార్యకలాపాల నిర్మూలనకు ఏసీబీ నంబర్‌ 14400 అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కనిపించాలి. దీనికోసం కచ్చితంగా బోర్డులు అమర్చాలి. గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ, పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ, పీడీఎస్‌ షాపుల వద్ద కూడా ఈ నంబర్‌తో బోర్డులు కనిపించాలి.  అన్ని ప్రభుత్వ విభాగాధిపతులతో మాట్లాడి దీన్ని అమలు చేయాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు కొత్తరూపు ఇవ్వాలి. పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో వీటిని తీర్చిదిద్దాలి.
 

మరిన్ని వార్తలు