CM YS Jagan Review Meeting With Muslim Minority Leaders Updates - Sakshi
Sakshi News home page

మీ మనసు నొప్పించేలా ఈ ప్రభుత్వం వ్యవహరించదు: సీఎం జగన్‌

Published Wed, Jul 19 2023 7:04 AM

CM YS Jagan Review Meet With Muslim Minority Leaders Updates - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం పెద్దలు, మత గురువులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై సీఎంకు తమ అభిప్రాయాలను మత పెద్దలు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదు. మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు.

‘‘ఉమ్మడి పౌరస్మృతి అంశం మీద డ్రాఫ్ట్‌ అనేది ఇప్పటివరకూ రాలేదు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. కాని మీడియాలో, పలుచోట్ల చర్చ విపరీతంగా నడుస్తోంది. వాటిని చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తంచేస్తున్నారు. కొన్ని అంశాలను మీ అందరి దృష్టికి తీసుకు వస్తున్నాను. ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో నేను ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటేగనుక ఏం చేసేవారన్నదానిపై మీరు ఆలోచనలు చేసి నాకు సలహాలు ఇవ్వండి’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘ఇక్కడ ఇంకో విషయాన్నికూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రొపగండా నడుస్తోంది. ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలి. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రైనా, ఏతల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారు. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మన అంతా స్పష్టం చేద్దాం’’ అని సీఎం పేర్కొన్నారు.
చదవండి: పవన్ కల్యాణ్‌ ఢిల్లీ టూర్‌.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి..

‘‘భారతదేశం చాలా విభిన్నమైనది. ఈ దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి  వారి పర్సనల్‌ లాబోర్డులు ఉన్నాయి’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్‌ లా బోర్డుల ద్వారానే చేయాలి. ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. Misinterpretationకు తావు ఇవ్వకుండా ఉంటుంది కాబట్టి. ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్‌ లాబోర్డ్స్‌తో మమేకమై, వారి పర్సనల్‌ లా బోర్డ్స్‌ ద్వారా జరగాలి’’ సీఎం జగన్‌ తెలిపారు.

Advertisement
Advertisement