పుంజు భలే రంజుగా! సంప్రదాయం నుంచి సంపాదనగా ‘కోడి పందేలు’ | Sakshi
Sakshi News home page

పుంజు భలే రంజుగా! సంప్రదాయం నుంచి సంపాదనగా మారిన కోడి పందేలు

Published Sun, Jan 8 2023 10:10 AM

Cock Fighting Sankranti Festival Celebrations In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: బరిలో తలపడే పుంజులు అత్యంత పౌరుషంతో పోరాడుతాయి. ఓడిపోయిన పుంజు తోక ముడిచి బరినుంచి పారిపోతే.. గెలిచిన పుంజు తన యజమాని ఉప్పొంగిపోయేంత గర్వాన్ని ఇచ్చేది. పుంజుల పోరాటం చూపరులకు సైతం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. తొలినాళ్లలో సరదా కోసం మొదలైన పందాలు ట్రెండ్‌ మార్చుకుంటున్నాయి. ఇప్పుడు కోడి పందాలంటే విశాలమైన మైదానం.. భారీ టెంట్లు.. ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా ప్రత్యేకంగా గ్యాలరీలు.. ఫ్లాష్‌లైట్ల కాంతులు.. భారీ సంఖ్యలో జన సందోహం నడుమ జాతరను తలపించేలా మారిపోయింది.

ప్రత్యేక శిక్షణ పొందిన పుంజులను పహిల్వాన్‌ మాదిరిగా వాటి కాళ్లకు పదునైన కత్తులు కట్టి బరిలో దించుతున్నారు. రక్తమోడుతున్నా వీరోచితంగా పోరాడి ఒక కోడి గెలిస్తే.. మరో కోడి ప్రాణాలు విడుస్తుంది. ఆ తరువాత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంది. సంక్రాంతి మూడు రోజుల్లోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.వందలాది కోట్లు కోడి పందాల మాటున చేతులు మారుతున్నాయి. తాజాగా ఒకచోట కోడి పందాలు వేసి.. వాటిని సోషల్‌ మీడియాలో లైవ్‌లో చూపించి బెట్టింగ్‌లు వేసుకునే స్థాయికి చేరింది. అలా మొదలై.. పూర్వం దేశంలోని అనేక ప్రాంతాల్లో కోడి పందాలు వినోదం కోసం మొదలై వీరోచిత పోరాటాలకు దారితీశాయని చరిత్ర చెబుతోంది.

తొలినాళ్లలో అడవి కోళ్లు లేదా పెరటి కోళ్లు పోరాడుకునేలా ప్రేరేపించి వినోదం పొందేవారు. పల్నాడు యుద్ధం (1178–1182) కోడి పందాల్లో తలెత్తిన వివాదం వల్లే సంభవించినట్టు చరిత్ర చెబుతోంది. బొబ్బిలి యుద్ధంలోనూ కోడి పందాలు జరిగాయి. రానురాను కోడి పందాలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో జూదం తరహాలో మార్పు చెందాయి. సుమారు రెండున్నర దశాబ్దాలుగా సంక్రాంతి అంటే కోడి పందాలు అనేలా మారిపోయాయి. సంక్రాంతి మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందాల కోసం ఐదు నెలల ముందు నుంచే ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోడి పుంజులను తీర్చిదిద్దుతారు. వాటి పెంపకానికి రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్‌లో ఆడిట్‌ అధికారులు

Advertisement
Advertisement