కోకో.. ధర కేక | Cocoa Is Priced Beyond The Wildest Dreams Of Farmers, Details Inside - Sakshi
Sakshi News home page

కోకో.. ధర కేక

Published Fri, Apr 5 2024 5:36 AM

Cocoa is priced beyond the wildest dreams of farmers - Sakshi

కేజీ గింజలు రూ.800 

రెండు నెలల క్రితం రూ.200 మాత్రమే 

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 5,800 ఎకరాల్లో సాగు 

పశ్చిమ ఆసియా దేశాల్లో 70 శాతం పడిపోయిన దిగుబడి 

కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతర పంటగా అదనపు ఆదాయం

సాక్షి అమలాపురం: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా దిగుబడి తగ్గినప్పటికీ.. కోనసీమ కోకో రైతులు కలలో కూడా ఊహించని విధంగా ధర పలుకుతుండడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కేజీ ఎండబెట్టిన కోకో గింజల ధర రూ.200 నుంచి ఏకంగా రూ.800 వరకు ఎగబాకింది. గతేడాది నుంచి చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో దిగుబడి గణనీయంగా పడిపోవడంతో.. కోకో గింజల డిమాండ్‌ను బట్టి ధర పెరగడానికి కారణమైందని రైతులు చెబుతున్నారు. 

దశాబ్దాలుగా సాగు.. 
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో దశాబ్దాల కాలంగా కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నారు. కాకినాడ , తూర్పుగోదావరి, ఏలూరు, పశి్చమగోదావరి జిల్లాల్లో సుమారు 5,800 ఎకరాల్లో కోకో సాగవుతున్నట్లు అంచనా. కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో కోకో అంతరసాగు వల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తున్నది.  

దిగుబడి తగ్గినా.. 
తూర్పుగోదావరి జిల్లాలో ఎకరాకు దిగుబడి 1.50 క్వింటాళ్ల నుంచి రెండు క్వింటాళ్ల వరకు వస్తుండగా,  ఏలూరు జిల్లా పరిధిలో నాలుగు క్వింటాల్‌  నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మనదేశంతోపాటు కోకో అధికంగా ఐవరీ కోస్ట్, ఘనా, ఇండోనేషియా, నైజీరియా వంటి దేశాలలో పండిస్తారు. ఆ దేశాల్లో 70 శాతం దిగుబడి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులకు తోడు ఆగస్టు వరకు వేసవిని తలపించే ఎండల వల్ల కోకో పూత రాలిపోయింది.

ఆ ప్రభావం ఇప్పుడు దిగుబడిపై కనిపిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సగటు దిగుబడి ఒక క్వింటాల్‌కు తగ్గింది. కాగా, గతేడాది కోకో ఎండబెట్టిన గింజల ధర క్వింటాల్‌కు రూ.180 నుంచి రూ.240 మధ్యలో ఉండేది. ఈ ఏడాది జనవరి నుంచి స్వల్పంగా ధర పెరుగుతూ ప్రస్తుతం రూ.800కు చేరింది. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితిని పరిశీలిస్తే ధర మరింత పెరిగే అవకాశముందని రైతులు అంచనా వేస్తున్నారు.   

Advertisement
Advertisement