వేరుశనగ విత్తన పంపిణీకి శ్రీకారం | Sakshi
Sakshi News home page

వేరుశనగ విత్తన పంపిణీకి శ్రీకారం

Published Tue, May 18 2021 4:38 AM

Commencement of Peanut Seed Distribution - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తన పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, ఏపీ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.శేఖర్‌బాబు పర్యవేక్షణలో సోమవారం ఆయా జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో 40 శాతం సబ్సిడీకి విత్తనాన్ని పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తొలిరోజు 868 మంది రైతులకు 611 క్వింటాళ్ల విత్తనాన్ని అందించారు. రాష్ట్రంలో వేరుశనగ ఖరీఫ్‌లో 7.03 లక్షల హెక్టార్లు, రబీలో 82,605 హెక్టార్లలో సాగవుతోంది. వేరుశనగ విత్తనం కోసం గతంలో ప్రైవేటు కంపెనీలపై ఆధారపడేవారు. దీంతో సాగువేళ నాణ్యతాపరమైన సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు.

ఈ దుస్థితికి చెక్‌ పెడుతూ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద చరిత్రలో తొలిసారిగా సొంతంగా రైతులే వేరుశనగ విత్తనోత్పత్తి చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహమందించింది. గత రబీ సీజన్‌లో 39 వేల ఎకరాల్లో రైతులను ప్రోత్సహించడం ద్వారా 4,48,185 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేశారు. వీటిలో అనంతపురం జిల్లాకు 2,90,035, చిత్తూరు జిల్లాకు 76,000, కర్నూలు జిల్లాకు 47,000, వైఎస్సార్‌ జిల్లాకు 34,000, శ్రీకాకుళం జిల్లాకు 300, విజయనగరం జిల్లాకు 650, విశాఖ జిల్లాకు 200 క్వింటాళ్ల చొప్పున కేటాయించారు. ఇప్పటివరకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలకు చెందిన 1,65,659 మంది రైతులు 1,07,704 క్వింటాళ్ల విత్తనం కోసం ఆర్‌బీకేల్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సోమవారం అనంతపురం జిల్లాల్లో 503 మంది రైతులకు 446.4 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 281 మంది రైతులకు 89.7 క్వింటాళ్లు, కర్నూలు జిల్లాలో 84 మంది రైతులకు 75 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు.

సొంతూరులో విత్తనం దొరకడం ఆనందంగా ఉంది..
నాకున్న ఆరెకరాల్లో ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేస్తా. గతంలో విత్తనాల కోసం మద్దికెర, పత్తికొండ వెళ్లాల్సి వచ్చేది. నాణ్యమైన విత్తనం దొరక్క చాలా ఇబ్బందులు పడేవాళ్లం. తొలిసారి మా గ్రామంలోనే నాణ్యమైన విత్తనం లభించింది.
    – ఎం.వెంకట్రామప్ప, ఎం.అగ్రహారం, మద్దికెర మండలం, కర్నూలు జిల్లా 

Advertisement
Advertisement