పవర్‌ ఎవర్‌ 'గ్రీన్‌' | Sakshi
Sakshi News home page

పవర్‌ ఎవర్‌ 'గ్రీన్‌'

Published Sun, Sep 4 2022 4:42 AM

Construction of hotel with solar panels in Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ షాక్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి స్మార్ట్‌గా ఆలోచించారు. సోలార్‌.. సో బెటర్‌ అని భావించారు. గ్రీన్‌ పవర్‌.. ఎవర్‌ గ్రీన్‌... అని విశ్వసించి తన ఐదు అంతస్తుల భవనం గోడలకు సౌర ఫలకాలను అమర్చారు. భవనాన్ని సోలార్‌ ప్యానల్‌ ఎలివేషన్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు.

అందరూ భవనాలపై రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టంను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, ఆయన దానికి భిన్నంగా గోడలకు నిలువుగా ప్యానల్స్‌ను అమర్చారు. ఫుల్‌ ఎకో గ్రీన్‌ హోటల్‌గా రికార్డు సృష్టించారు. స్మార్ట్‌ సిటీ విశాఖపట్నంలోని గురుద్వార జంక్షన్‌ వద్ద ‘స్మార్ట్‌ ఇన్‌ ది గెస్ట్‌ హౌస్‌’ పేరుతో అన్నె నారాయణరావు (బాబ్జి) అనే వ్యాపారి నిర్మించిన ఈ భవనం విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఆకర్షణీయంగా.. ఆదర్శవంతంగా... 
ఐదు అంతస్తుల భవనానికి సోలార్‌ ప్యానళ్లను నిలువుగా అమర్చడంతో అద్భుత డిజైన్‌లా కనిపిస్తుంది. ఈ భవనం ఆకర్షణీయంగా, అందరికీ ఆదర్శంగా కూడా ఉంది. భవనం ఎలివేషన్‌ కోసం నలుపు రంగు అద్దాలకు బదులుగా దాదాపు 200 సోలార్‌ ప్యానళ్లను నిలువుగా ఏర్పాటు చేశారు. ఈ ప్యానల్స్‌ రోజుకు దాదాపు 100 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయి. నెట్‌ మీటరింగ్‌ ద్వారా భవనానికి అవసరమైన 40శాతం విద్యుత్‌ వినియోగించుకుంటారు.

మిగిలిన విద్యుత్‌ను యూనిట్‌ను రూ.6 చొప్పున ఏపీఈపీడీసీఎల్‌ ద్వారా గ్రిడ్‌కు విక్రయిస్తారు. రాత్రి వేళ భవన అవసరాలకు గ్రిడ్‌ నుంచి కరెంటు తీసుకుంటారు. ఈ భవనానికి సౌర విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రూ.45 లక్షలు ఖర్చయినట్లు యజమాని బాబ్జి ‘సాక్షి’కి తెలిపారు. తాము వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఎనిమిదేళ్లలో పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. భవనం పైన మరో 70 సోలార్‌ పలకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.  

రాష్ట్రంలో తొలిసారిగా... 
దేశం మొత్తం విద్యుత్‌ వినియోగంలో మూడో వంతు కన్నా ఎక్కువగా భవనాల్లోనే ఉంటుంది. ముంబైలోని ఓ డేటా సెంటర్‌లో దాదాపు ఒక మెగావాట్‌ సామర్థ్యం గల దేశంలోనే అతిపెద్ద బిల్డింగ్‌ ఇంటిగ్రేటెడ్‌ వర్టికల్‌ సోలార్‌ సిస్టంను 2019లో ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో విశాఖపట్నంలోనే తొలిసారిగా ఈ తరహాలో ‘స్మార్ట్‌ ఇన్‌ ది గెస్ట్‌ హౌస్‌’ పేరుతో ఒక హోటల్‌ నిర్మించారు.

ఇక్కడ 15 రోజుల కిందట విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 250 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని యజమాని బాబ్జి తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు సంప్రదాయ గాజు అద్దాల స్థానంలో సౌర పలకలు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తితోపాటు సూర్య కిరణాలను నిరోధించి థర్మల్‌ ఇన్సులేషన్‌ తరహాలో పనిచేస్తాయి. దీనివల్ల ఏసీల వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు. గాజు వినియోగం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించవచ్చని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. 

రాష్ట్రంలో మాదే తొలి గ్రీన్‌ బిల్డింగ్‌
‘పర్యావరణాన్ని కాపాడటంతోపాటు విద్యుత్‌ బిల్లుల భారం నుంచి బయటపడటం కోసం ఎంతో శ్రమించి భవనం మొత్తం సోలార్‌ పలకలతో నిర్మించాం. భవనం రూఫ్‌టాప్‌ మీద కూడా సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో రాష్ట్రంలోనే మాది తొలి గ్రీన్‌ బిల్డింగ్‌ అని భావిస్తున్నాం. ఈ మేరకు సర్టిఫికెట్‌ పొందడం కోసం విశాఖ నగరపాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేశాం.’   
 –బాబ్జి, భవన యజమాని, విశాఖపట్నం  

Advertisement
Advertisement