ఏపీలో రోడ్ల నిర్మాణం ‘డబుల్‌ స్పీడ్‌’ | Sakshi
Sakshi News home page

ఏపీలో రోడ్ల నిర్మాణం ‘డబుల్‌ స్పీడ్‌’

Published Fri, Jul 14 2023 4:35 AM

Construction of roads in AP double speed - Sakshi

సాక్షి, తిరుపతి/తిరుపతి తుడా/తిరుమల: అభివృద్ధి పనులకు నిధులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నారని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభివర్ణించారు. గురువారం ఆయన తిరుపతిలో పర్యటించారు. సుమారు రూ. 2,900 కోట్లతో కృష్ణపట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారుల నిర్మాణానికి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన సభలో డిజిటల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఏపీలో 2014 నాటికి 4,193 కి.మీ జాతీయ రహదారులు ఉంటే.. 2023 నాటికి అది 8,744 కి.మీకు చేరిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో నిరుద్యోగానికి చెక్‌ పెట్టవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పోర్ట్‌ విశాఖపట్నం ఉందని, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మరో 3 పోర్ట్‌ల ఏర్పాటుకు ఆసక్తి కనబరచటం మంచిపరిణామం అని చెప్పారు. పోర్ట్‌లు దేశాభివృద్ధికి తోడ్పడ­తాయని చెప్పారు.

ఈ ఏడాదిలో 91 ప్రాజెక్టుల పరిధిలో 3,240 కి.మీలను రూ. 50 వేల కోట్లతో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మరో రూ. 75 వేల కోట్లతో 190 ప్రాజెక్టులు పలు దశల్లో ఉన్నాయని, త్వరలో అవీ కానున్నాయని వివరించారు. ఇక 25 ప్రాజెక్టులు 800 కి.మీ. మేర రూ. 20 వేల కోట్లతో, 45 ప్రాజెక్టులు 1,800 కి.మీ. మేర రూ.50 వేల కోట్లతో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. రూ.19 వేల కోట్లతో 430 కి.మీ. మేర పోర్టుల అనుసంధాన పనులు జరుగుతున్నాయని వివరించారు.  

పెట్టుబడిదారుల చూపు ఏపీ వైపు 
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ. 2 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు మొగ్గు చూపడానికి రవాణా సౌకర్యం కారణమని గడ్కరీ తెలిపారు. కడప–రేణిగుంట, తిరుపతి–మదనపల్లి, రేణిగుంట–నాయుడుపేట రహదారులు 2025 నాటికి పూర్తి చేయనున్నట్లు వివరించారు. కృష్ణపట్నం పోర్టుకు వేగవంతమైన కనెక్టివిటీ వస్తోందని వివరించారు.

తిరుపతి నగరంలో ఇంటర్‌ మోడల్‌ సెంట్రల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి గతేడాది ఆగస్టులో ఎంవోయూ జరిగిందని ఈ జూలైలో టెండర్‌ పూర్తి కానుందని తెలిపారు. ఏపీలో 7 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణాలు చేపట్టామన్నారు. దక్షిణ భారతంలోని రాజధాని నగరాలను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి ఈ రహదారులు దోహదం చేస్తాయన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాలా  సౌకర్యాలు ఉన్నాయన్నారు.  

సీఎం జగన్‌ ప్రతిపాదనలతో..
తిరుపతి జిల్లాలో రూ. 17 వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం సంతోషమని స్థానిక పార్లమెంట్‌ సభ్యుడు మద్దెల గురుమూర్తి అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన పనులకు నేడు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారని, తిరుపతి బస్‌ టెర్మినల్, మరికొన్ని రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా మార్పు కోరిన వెంటనే కేంద్ర మంత్రి అంగీకరించడం సంతోషమని తెలిపారు. కేంద్రమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్‌అండ్‌బీ కార్యదర్శి ప్రద్యు­మ్న ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో.. 
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే ముందు తెల్లవారుజామున నితిన్‌ గడ్కరీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి తీర్థప్రసాదా­లు, చిత్రపటాన్ని గడ్కరీకి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు.

పేదలకు ఉచితంగా గుండె చికిత్సలు అభినందనీయం
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆస్పత్రిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నాయని, ఇక్కడ నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం అభినందనీయమని నితిన్‌ గడ్కరీ ప్రశంసించారు. తిరుపతిలోని ఆ ఆస్పత్రిని కేంద్రమంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆస్పత్రిలో ఇప్పటివరకు దాదాపు 1,600 గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు ఉచితంగా చేశారని, ఇది భగవంతుని సేవ అని అభివర్ణించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్న టీటీడీ యాజమాన్యాన్ని, డాక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆసుపత్రి డెరైక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ భరత్‌  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement