తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ప్రకాశం జిల్లా శనగలు | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ప్రకాశం జిల్లా శనగలు

Published Wed, Mar 23 2022 12:02 PM

Consumption of Prakasam Peanuts for making Tirumala Srivari Laddu - Sakshi

జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగ రైతులకు ఒక అద్భుత అవకాశం తలుపు తట్టింది. సాక్షాత్తూ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ తయారీ కోసం జిల్లాలో పండించిన జేజీ–11 రకం శనగలు కొనుగోలు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. అలాగే సేద్యానికి అవసరమైన సాయాన్ని కూడా టీటీడీ అందించనుంది. శ్రీవారి సేవ చేసేందుకు అవకాశం కలగడం మహద్భాగ్యంగా  రైతులు భావిస్తున్నారు. 

సాక్షి, ఒంగోలు: ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా ఇంటిల్లిపాది కష్టపడి పంటలను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. ఈ విధానంలో సాగుచేసిన శనగలు గొనుగోలు చేసేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. జిల్లాలో దాదాపు 1026 టన్నుల జేజీ–11 శనగలు కొనేందుకు అంగీకరించింది. దీంతో జిల్లాలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం(జెడ్‌బీఎన్‌ఎఫ్‌)కు చెందిన అధికారులతో టీటీడీ అధికారులు సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం ఏడు వేల మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులున్నారు. అందులో టీటీడీ నిబంధనల మేరకు సాగు చేసిన శనగ రైతులను ఎంపిక చేసుకున్నారు.

బోడవాడలో  శనగల నాణ్యతను పరిశీలిస్తున్న జెడ్‌బీఎన్‌ఎఫ్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ వి.సుభాషిణి 

చదవండి: (టీడీపీతో బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు) 

ఇది మొదటి సంవత్సరం కావడంతో దీనిపై రైతులకు పెద్దగా అవగాహన లేదు. మొదటి విడతగా జిల్లాలోని 377 మంది రైతులు టీటీడీకి శనగలు (ఎర్ర శనగలు) ఇచ్చేందుకు అంగీకరించారు. వీరి దగ్గర నుంచి 1026 టన్నుల శనగలు కొనేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపారు. శనగ పంట సాగు చేయటానికి రైతులు అవలంబించిన పద్ధతులు, పక్క పొలాల్లో పిచికారీ చేసే రసాయన ఎరువులు, పురుగు మందులు ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలోకి రాకుండా తీసుకున్న జాగ్రత్తలు వీటన్నింటినీ పరిశీలించిన తరువాతనే కొనుగోలుకు ముందుకొచ్చారు. అందుకుగాను సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌(సీఎస్‌ఏ), ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థలను టీటీడీ రంగంలోకి దించింది. శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించిన తరువాతనే కొనుగోలు చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. 

చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో రైతులకు ఇచ్చిన ఆవులు, ఎద్దులు

మద్దతు ధరకంటే పది శాతం అదనపు ధర.. 
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే పది శాతం అధికంగా ఇచ్చి కొనుగోలు చేయటానికి టీటీడీ అంగీకరించింది. ప్రస్తుతం ఎంఎస్‌పీ ప్రకారం క్వింటా శనగలు రూ.5,230 మద్దతు ధర ఉంది. దీనికి పది శాతం అదనంగా ఇచ్చి కొనుగోలు చేయటానికి నిర్ణయించింది. అంటే క్వింటా శనగలు రూ.5,753 రైతుకు దక్కనుంది. జిల్లాలో మొత్తం 49 ఆర్‌బీకేల పరిధిలో 19 మండలాల్లో పండించిన శనగలు కొనుగోలు చేయటానికి సిద్ధం చేశారు. జిల్లాలోని యర్రగొండపాలెం, మార్టూరు, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, చినగంజాం, జే.పంగులూరు, కొరిశపాడు, అద్దంకి, నాగులుప్పలపాడు, మద్దిపాడు, ఒంగోలు, వలేటివారిపాలెం, చీమకుర్తి, ఎస్‌ఎన్‌పాడు, కనిగిరి, తర్లుపాడు, కొత్తపట్నం, ముండ్లమూరు మండలాల్లోని గ్రామాల్లో పండిన శనగలు కొనుగోలు చేయనున్నారు.  

ఉచితంగా ఆవులు, ఎడ్లు.. 
ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు సాగు చేస్తున్న రైతులకు టీటీడీ ఉచితంగా ఆవులు, సేద్యానికి జత ఎద్దులు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయానికి ఆవులు, ఎద్దుల మూత్రం, పేడ ఎంతో అవసరం. ఘన జీవామృతం, ద్రవ జీవామృతంతో పాటు పలురకాల కషాయాల ద్వారా పంటల్లో చీడ పీడలు, వ్యాధులను నివారించవచ్చు. అందుకోసం టీటీడీ జిల్లాలోని రైతులకు ఉచితంగా రవాణా ఖర్చులు భరించి మరీ రైతులకు అందజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 247 ఆవులు కావాలని రైతులు కోరారు. అయితే ఇప్పటి వరకు 124 ఆవులను ఇచ్చారు. 26 జతలు ఎడ్లు కూడా ఇచ్చారు. ఒక్కో రైతుకు ఒక ఆవు కానీ లేదా, జత ఎడ్లుకానీ ఉచితంగా అందిస్తున్నారు. 

శనగ రైతులకు మంచి అవకాశం 
టీటీడీ ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన జేజీ–11 రకం శనగలు కొనుగోలు చేయటం రైతులకు మంచి అవకాశం. జిల్లాలో ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆసక్తిని పెంచుకుంటున్నారు. దీంతో టీటీడీ లాంటి ప్రముఖ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన దేవస్థానం లడ్డూ తయారీకి కొనుగోలు చేయటం రైతులు ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. మొదటి సంవత్సరం కాబట్టి కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఇంకా ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ధర కూడా పది శాతం అదనంగా ఇస్తున్నారు. గోవులు, ఎడ్లు ఉచితంగా ఇవ్వటంతో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.        
- వి.సుభాషిణి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, జెడ్‌బీఎన్‌ఎఫ్‌ 

Advertisement

తప్పక చదవండి

Advertisement