తుఫాన్‌ అలర్ట్‌: దూసుకొస్తున్న ‘తౌక్టే’ | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ అలర్ట్‌: దూసుకొస్తున్న ‘తౌక్టే’

Published Fri, May 14 2021 3:56 AM

Cyclone Alert Tauktae Looming - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆఫ్రికా ఖండం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఆగ్నేయæ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే సూచనలున్నాయి. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాన్‌కు మయన్మార్‌ సూచించిన ‘తౌక్టే’ పేరుని పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది 18వ తేదీ నాటికి గుజరాత్‌కు చేరుకుంటుందని, అయితే ఎక్కడ తీరం దాటుతుందనే అంచనా చిక్కడం లేదని చెబుతున్నారు.
 

తౌక్టే ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండబోదని తెలిపారు. అయితే బంగాళాఖాతం నుంచి తేమ గాలుల్ని అల్పపీడనం తీసుకునేందుకు ప్రయత్నిస్తుండటం వల్ల రెండు మూడు రోజుల పాటు రాయలసీమలో జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపారు. ఈ తుఫాన్‌ నైరుతి రుతుపవనాల రాకపై ఏమాత్రం ప్రభావం చూపించబోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రుతు పవనాలు సాధారణంగా జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ తుఫాను వల్ల సకాలంలో గానీ, అంతకంటే రెండు మూడు రోజుల ముందే నైరుతి రాష్ట్రాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి వ్యాపించి ఉంది.

దీని ప్రభావంతో తేమ గాలులు ఉత్తరాంధ్ర జిల్లాలవైపు విస్తరిస్తున్నాయి. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లా కుందుర్పిలో 4 సెం.మీ, కల్యాణదుర్గం, రాయదుర్గం, సెత్తూరులో 3, సింహాద్రిపురం, కంబదూరు, లేపాక్షిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

     

Advertisement
Advertisement