కూల్చింది ప్రహరీలే.. ఇళ్లు కాదు | Sakshi
Sakshi News home page

కూల్చింది ప్రహరీలే.. ఇళ్లు కాదు

Published Sun, Nov 6 2022 4:01 AM

Demolished Prahari not house in Ippatam Village - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఈ ఏడాది మార్చిలో జనసేన సభకు స్థలం ఇచ్చినందునే కక్షసాధింపుతో తమ పార్టీ వారి ఇళ్లను పడగొడుతున్నారంటూ పవన్‌ తప్పుడు ఆరోపణలు చేశారు. మొత్తం 53 ఇళ్లకు సంబంధించి ఆక్రమణలు తొలగింపు చేపడితే అందులో ఒక్కరే జనసేన సభ కోసం స్థలం ఇచ్చారు.

అతను కూడా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఆ స్థలం మినహా మిగిలిన స్థలాల్లో ఉన్న ఆక్రమణలను మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తొలగించారు. ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. కేవలం ఆక్రమిత స్థలంలో ఉన్న ప్రహరీలు, చిన్నచిన్న దుకాణాలను మాత్రమే తొలగించారు. 

ఇక ఇప్పటం రోడ్డు ప్రస్తుతం 50–60 అడుగుల వరకూ మాత్రమే ఉంది. రికార్డుల ప్రకారం ఆ డొంక రోడ్డు 73 నుంచి 80 అడుగుల వరకూ ఉండాలి. మిగిలిన భూమిని స్థానికులు ఆక్రమించి ప్రహరీలు నిర్మించగా, కొంతమంది షాపులు కట్టి అద్దెలకు ఇచ్చారు. ఈ రోడ్డును రికార్డుల ప్రకారం 73 నుంచి 80 అడుగుల వరకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికోసం ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఆక్రమణలు తొలగించాలంటూ నోటీసులిచ్చారు. ఎవరూ స్పందించలేదు. మొత్తం 53 అతిక్రమణలు ఉన్నట్లు గుర్తించగా ఒకరు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. మిగిలిన 52 అతిక్రమణలను అధికారులు బుధ, గురువారాల్లో తొలగించారు. ఈ రోడ్డు ఆర్‌ అండ్‌ బీది కాగా, డ్రెయిన్ల నిర్మాణం, నిర్వహణ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చూస్తోంది.

ఆక్రమణలను తొలగించే అధికారం స్థానిక సంస్థలకు ఉంటుంది. అయితే, ఇప్పటం గ్రామంలో 120 అడుగుల వరకూ రోడ్డును విస్తరిస్తున్నారని, ఒక గ్రామంలో అంత రోడ్డు ఎందుకంటూ పవన్‌కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. దీనికి ఎల్లో మీడియా కూడా వంతపాడుతోంది. 

చట్టప్రకారం నోటీసులు జారీచేసి యాభై శాతం ఆక్రమణలు తొలగించే పనుల చేపట్టారు. ఆక్రమణలు మొత్తం 53 వుండగా పంచాయతీ కార్యాలయం పోను మిగిలిన ఆక్రమణలలో కాపులు 28, రెడ్లు 13, బీసీలు 12 మంది ఉండగా.. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులవి మాత్రమే కూల్చుతున్నట్లు పవన్‌కళ్యాణ్‌తో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం దుర్మార్గమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నోటీసులు ఇచ్చాకే పనులు చేపట్టారు
రోడ్డు విస్తరణలో నా ప్రహరీ పోయింది. అధికారులు నాకు నోటీసు ఇవ్వగా దానిని తీసుకుని  సహకరించాను. ఇరవై ఏళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే మార్కింగ్‌ చేశారు. తర్వాత పట్టించుకోలేదు. జనసేన ఇప్పుడు వచ్చింది.. జనసేన నాయకుల గురించి చేశారనేది అపోహే. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను మాత్రమే తొలగించారు. ఇళ్లు తొలగించలేదు. కేవలం రాజకీయాల కోసమే గ్రామంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.         
 – లచ్చి వెంకటేశ్వరరావు, ఇప్పటం

జనసేన ఆరోపణలు కరెక్టు కాదు 
జనసేన గురించి చేశారనేది పూర్తిగా అవాస్తవం. రోడ్లు వెడల్పుగా లేకపోవడంతో స్కూలు బస్సులు రావడం ఇబ్బందిగా వుంది. ఇప్పటివరకు గ్రామంలో అందరం అన్నదమ్ముల్లా ఉన్నాం. రాజకీయాల కోసం గ్రామాభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు గ్రామంలో అశాంతిని సృష్టించొద్దు.     
    – వీరంకి బాజి, ఇప్పటం

ఎవర్ని పరామర్శిస్తారు
పవన్‌కళ్యాణ్‌ ఇప్పటం వచ్చి ఎవరిని పరామర్శిస్తారు. ఆక్రమణలు తొలగించారు కాని ఏ ఒక్క ఇల్లు కూల్చలేదు. పవన్‌ సభకు భూములిచ్చిన ఏ ఒక్కరి స్థలం పోలేదు. ఒక్కరే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కే రూ ఆరు కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రకటించిన విధంగా గ్రామానికి రూ.50 లక్షలు ఇవ్వాలి.     
– మోదుగుల బ్రహ్మారెడ్డి, ఇప్పటం  

Advertisement
Advertisement