మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి

Published Thu, Nov 18 2021 4:36 AM

Development of all regions with three capitals says Leaders of public associations - Sakshi

కడప కార్పొరేషన్‌: మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యపడుతుందని వివిధ ప్రజాసంఘాల నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందాలంటే పాలన వికేంద్రీకరణ కావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించి పోరాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మూడు రాజధానులకు మద్దతుగా కడపలోని సప్తగిరి కల్యాణ మండపంలో బుధవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. కార్యక్రమానికి బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు జీవీ రాఘవరెడ్డి, ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏపీ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ యానాదయ్య, ఎస్సీ సఫాయి కర్మచారీస్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు గుండ్లపల్లి గరుడాద్రి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, రెడ్డి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల కొండారెడ్డి, బీసీ, బెస్త, బలిజ సంక్షేమ సంఘాల నాయకులు హాజరై ప్రసంగించారు. 

రాయలసీమ ఏపీలో భాగమే.. 
సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఏపీలో రాయలసీమ ఒక భాగమనే విషయాన్ని ఉమ్మడి రాష్ట్రంలోను, రాష్ట్ర విభజన తర్వాత కూడా పాలకులు మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్‌ ఒడంబడికను పక్కన పెట్టారన్నారు. టీడీపీ హయాంలో అసెంబ్లీ తీర్మానం ప్రకారమే అమరావతిని రాజధానిగా ప్రకటించారని, ఇప్పుడు కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం చేశారన్నారు. బిల్లు పాసైన తర్వాత కూడా దానిని అమల్లోకి తెచ్చుకోలేకపోతే భవిష్యత్‌ అంధకారమవుతుందని హెచ్చరించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో న్యాయవాదులు ఎన్ని ఉద్యమాలు చేసినా, సీజేలకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటుపై న్యాయమూర్తుల వ్యాఖ్యలు దురదృష్టకరమని, వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెనుకబడిన ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సీజే వ్యాఖ్యలు చేశారన్నారు.

కొందరు న్యాయమూర్తులకు రాజధానిలో భూములు ఉన్నాయని, ఆ కేసు వారి వద్దకు వచ్చినప్పుడు నాట్‌ బిఫోర్‌ అని చెప్పకుండా, ఇంకో బెంచ్‌కు బదిలీ చేయకుండా తామే విచారణ చేస్తామనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. రాయలసీమ ప్రజలు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించి పోరాడాలన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వారికి భూములిప్పించి తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆస్తులు దోచుకుని ఏర్పాటు చేసిన అమరావతి ఎట్టిపరిస్థితుల్లో ప్రజా రాజధాని అనిపించుకోదని స్పష్టం చేశారు.

అక్కడ అణగారిన వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే వారు తమతో సమానమా అంటూ కోర్టులకు వెళ్లి అడ్డుకున్న వారు, అదే ప్రాంతం రాజధానిగా ఉంటే ఇతరులను అక్కడ కాలు మోపనిస్తారా అని ప్రశ్నించారు. అమరావతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా కోర్టుల ద్వారా అడ్డుకుని, పెయిడ్‌ ఆర్టిస్టులతో పోరాటం చేయిస్తున్నారని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పిన బీజేపీ ఇప్పుడు మాటమార్చి అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు పలకడం దారుణమన్నారు.  మూడు రాజధానుల ఏర్పాటు కోసం కార్యాచరణ సిద్ధం చేసి పోరాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 

Advertisement
Advertisement