అభివృద్ధి పథంలో ఏపీ విద్యావ్యవస్థ  | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథంలో ఏపీ విద్యావ్యవస్థ 

Published Tue, Feb 6 2024 2:25 AM

Development of education system in Andhra Pradesh - Sakshi

విశాఖ (విద్య): ఆంధ్రప్రదేశ్‌ విద్యా వ్యవస్థ అభివృద్ధి పథంలో పయనిస్తోందని మేధావులు స్పష్టం చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నాన్‌–పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో ‘ప్రగతి బాటలో ఏపీ విద్యావ్యవస్థ’ అంశంపై సోమవారం చర్చాగోష్టి నిర్వహించారు. అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం) పూర్వ వీసీ హెచ్‌.లజపతిరాయ్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రాజమండ్రి) మాజీ వీసీ ఎం.జగన్నాథరావు, ఏయూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ కె.శ్రీరామమూర్తి, ఏయూ విద్యా విభాగాధిపతి టి.షారోన్‌రాజు, ఏయూ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం విశ్రాంత ఆచార్యులు పి.విశ్వనాథం, సీహెచ్‌.సూర్యనారాయణ, బీవీకే కళాశాల రిటైర్డ్‌ లెక్చరర్‌ సి.వెంకటరావు చర్చాగోష్టిలో మాట్లాడారు.

నాణ్యమైన విద్యనందించే విధంగా పాఠశాల స్థాయినుంచి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. జర్మనీ, జపాన్‌ వంటి దేశాలు యువతను ఉన్నత, సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్ది మెరుగైన ప్రగతిని సాధించాయని, ఇదే తరహాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఆయన ధృక్పథం, పనితీరు మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతోందన్నారు.

నాలుగేళ్ల కాలంలో విద్యారంగానికి నిధుల కేటాయింపులు 33 శాతానికి పైగా పెంచారన్నారు. రానున్న కాలంలో ఏపీ యువత ప్రపంచంలోనే నంబర్‌–1గా నిలుస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేస్తున్న సంస్కరణల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాల పిల్లలు పాఠశాల బాట పడుతున్నారని చెప్పారు. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు, బైజూస్‌ కంటెంట్‌తో డిజిటల్‌ పాఠాల బోధన ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు.   

అవాస్తవాలతో దుష్ప్రచారం 
ఈ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది అవాస్తవాలతో దుష్ప్రచారం చేయాలని చూడటం సరికాదని విద్యారంగ నిపుణులు హితవు పలికారు. పేద పిల్లలకు చదువుల్ని దూరం చేసేందుకు కొన్నిశక్తులు కుట్రపూరితంగా పనిచేస్తున్నాయని, దీనిని మేధావి వర్గాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వంలో విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, భవిష్యత్‌ తరాలకు జరగనున్న మేలుపై వాస్తవ గణాంకాలతో వివరించేందుకు ఏ వేదికపైన అయినా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. నూతన విధానాలతో బోధన, విద్యకు నైపుణ్యం జోడిస్తూ ప్రతి విద్యార్థి మెరుగైన ఉద్యోగాలు సాధించేవిధంగా విద్యావ్యవస్థను ప్రగతివైపు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభు­త్వ విధానాలకు నాన్‌–పొలిటికల్‌ జేఏసీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. 

Advertisement
Advertisement