మా ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలా? చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైర్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. నువ్వు రియల్‌ ఎస్టేట్‌ చేస్తే చప్పట్లు కొట్టాలా?: అమరావతి​ విషయంలో మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు

Published Mon, Sep 12 2022 12:57 PM

Dharmana Prasada Rao Comments On AP 3 Capitals - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. ఒక్క అమరావతినే రాజధాని చేయాలనడం వెనుక దురుద్దేశం ఉంది.  29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు అంటూ మంత్రి ధర్మాన ప్రసాదారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, మంత్రి ధర్మాన శ్రీకాకుళంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 65 ఏళ్లలో మనమంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాము. ఆనాడే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే ఇలాంటి ప్రమాదం వచ్చేదికాదు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుంటే విభజన జరిగేది కాదు. ఒక్క అమరావతినే అభివృద్ధి చేస్తే మళ్లీ అలాంటి పరిస్థితి రాదా?. ఒక్క చోటనే అభివృద్ధి అనేది సరికాదు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అదే విషయం చెప్పింది. 

అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రతిపక్షం ఎందుకు అంగీకరించట్లేదు. అమరావతిలో​ క్యాపిటల్‌ వద్దని ప్రభుత్వం చెప్పడం లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ విధానం. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. ఒక్క అమరావతినే రాజధాని చేయాలనడం వెనుక దురుద్దేశం ఉంది. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కాన్సెప్ట్‌ను ప్రపంచమే అంగీకరించట్లేదు. 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు. సృష్టించబడిన సంపద అందరికీ చేరాలి. హైదరాబాద్‌లో జరిగిన అన్యాయం మళ్లీ పునరావృతం కావొద్దు. 4-5 లక్షల కోట్లతో అమరావతిలో రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమా?. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా?. ఒక్కచోటే అన్నీ పెట్టి మా పీక కోస్తామంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఊరుకుంటారా?. మా ప్రజలు ఎప్పటీకీ కూలీలుగానే ఉండాలా?. సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉండాలన్నడాన్ని మేము అంగీకరించం. మీరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటే మేము చప్పట్లు కొట్టాలా అని ప్రశ్నించారు. 

ఇదీ చదవండి: గడపగడపకూ.. ఆహ్వానిస్తూ, ఆర్జీలిస్తున్న జనం

Advertisement
Advertisement