For Diamond Hunters In Anantapur - Sakshi
Sakshi News home page

వజ్రాల వేట.. కొందరికే ‘అదృష్టం’.. ఇక్కడే ఎందుకంటే?

Published Tue, Jun 13 2023 11:25 AM

For diamond hunters in Anantapur - Sakshi

తొలకరి పలకరించగానే వారిలో ఆశలు చిగురిస్తాయి. సద్ది సిద్ధం చేసుకుని పొలాల బాట పడతారు. నేలలో అణువణువూ శోధిస్తారు. ప్రతి రాయి కదుపుతారు. మెరిసే రాళ్లను సేకరిస్తారు. వాటిని తీసుకెళ్లి ఏజెంట్లకు చూపుతారు. అది వజ్రమైతే వారి పంట పండినట్లే! లేదంటే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. ఇలా ఏటా వజ్రాల వేట నిరాటంకంగా సాగుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వేటలో కొందరు లక్షాధికారులు కాగా... మరికొందరు అన్వేషకులుగానే మిగిలిపోయారు. 

అనంతపురం డెస్క్‌: వజ్రాల పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చే ఊరు వజ్రకరూరు. ఇక్కడ దొరుకుతున్న వజ్రాల కారణంగానే కవులూరు గ్రామం కాస్తా కాలక్రమేణా కరూరుగా.. వజ్రకరూరుగా రూపాంతరం చెందింది. ఇక్కడ వజ్రాలు ఉన్నట్లు బ్రిటీష్‌ హయాంలోనే గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేసి అన్వేషణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వపరంగా వజ్రాన్వేషణ అంత లాభదాయకంగా లేదు కానీ.. సామాన్యుల అన్వేషణ మాత్రం ఏటా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా జూన్‌ మొదటి వారంలో తొలకరి వర్షాలు మొదలు కాగానే వజ్రకరూరు ప్రాంతం కొత్త వ్యక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. వజ్రకరూరు చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఎర్రనేలలు జనంతో రద్దీగా కనిపిస్తాయి.

 ఒక్కో పొలంలో 30–40 మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు. బలమైన వర్షాలు పడినప్పుడు ఈ  సంఖ్య వందకు పైగానే ఉంటుంది. వాననీటి ప్రవాహం వల్ల భూమిలోని వజ్రాలు పైకి తేలి.. దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చే అవకాశం ఉండడంతో ఎక్కువమంది ఆ దిశగా అన్వేషణ సాగిస్తుంటారు. స్థానికులే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలలు,  కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వాహనాల్లో ఇక్కడికి వచ్చి వజ్రాన్వేషణలో నిమగ్నమవుతున్నారు. ఇతర ప్రాంతవాసుల రాక 15 ఏళ్లుగా ఎక్కువైంది. కొందరు రోజుల తరబడి స్థానికంగానే ఉంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

వజ్రకరూరు ప్రాంతంలో లభించే వజ్రాలు అత్యంత విలువైనవిగా చెబుతుంటారు. రూ.లక్ష మొదలుకుని రూ.50 లక్షలకు పైగా విలువైన వజ్రాలు ఇక్కడ లభిస్తున్నట్లు సమాచారం. వజ్రకరూరు, రాగులపాడు, కమలపాడు, బోడిసానిపల్లి, పొట్టిపాడు గ్రామాల పరిధిలోని ఎర్ర నేలల్లో అన్వేíÙంచే వారికి ఏటా 15 నుంచి 20 వజ్రాలు దొరుకుతున్నట్లు అంచనా. వీటిని గుత్తి, కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేస్తున్నారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి ధర నిర్ణయిస్తున్నారు. విక్రయదారులకు డబ్బుతో పాటు బంగారం ముట్టజెబుతున్నారు. విక్రయదారులకు ధర నచ్చని పక్షంలో టెండర్‌ పద్ధతిలో వజ్రాలను వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం గమనార్హం.  వజ్రాన్వేషణ జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తమ మనుషుల (ఏజెంట్లు)ను పెట్టి వజ్రాలు దొరికిన వారి సమాచారం వ్యాపారులు సేకరించుకుంటున్నారు. 

వజ్రకరూరుతో పాటు ఈ ప్రాంతానికి 50 కి.మీ.లోపే దూరం ఉన్న కర్నూలు జిల్లా జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి ప్రాంతాల్లోనూ వజ్రాలు లభిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభించే కింబర్‌లైట్‌ పైపులు భూఉపరితలానికి అతి దగ్గరలో ఉన్నాయని గనులు, భూగర్భశాఖ అధికారులు చెబుతున్నారు.  దానికితోడు ఈ ప్రాంతంలోని భూమి గడిచిన ఐదువేల సంవత్సరాల్లో దాదాపు అర కిలోమీటరు మేర కోతకు గురైందని, అందుకే ఇక్కడ తరచూ వజ్రాలు దొరుకుతున్నాయని అంటున్నారు. వజ్రకరూరు ప్రాంతంలో వజ్రాన్వేషణకు 1934 సంవత్సరంలోనే బ్రిటీష్‌ వారు ‘ది న్యూ వజ్రకరూరు డైమండ్‌ మైనింగ్‌ కంపెనీ లిమిటెడ్‌’ స్థాపించారు.

 వజ్రాలు లభించే పొలాలను సేకరించారు. ఈ కంపెనీని స్వాతంత్య్రం వచ్చాక 1970లో నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) పరిధిలోకి తెచ్చారు. 1974 నుంచి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ఆధ్వర్యంలో వజ్రాన్వేషణ చేపడుతున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే వజ్రకరూరులోని వజ్రాల ప్రక్రమణ కేంద్రం (డైమండ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌) నడుస్తోంది. ఒకప్పుడు ఇక్కడ కార్యకలాపాలు చురుగ్గా జరిగేవి. వివిధ కారణాలతో ప్రస్తుతం మందగించాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ ప్రాంతంలోని వజ్ర నిక్షేపాలపై దృష్టి సారించినప్పటికీ మైనింగ్‌కు మాత్రం ముందుకు రాలేదు.   

Advertisement
Advertisement