ఐపీఎం విభజన పూర్తి  | Sakshi
Sakshi News home page

ఐపీఎం విభజన పూర్తి 

Published Wed, Jun 8 2022 5:08 AM

Division of Preventive Medicine of Institute is completed - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన సమస్యల్లో ఒకటిగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) విభాగం విభజన పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఇటీవల ఏపీ, తెలంగాణలకు పోస్టులను విభజిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర ఐపీఎం విభాగంలో 89 కేటగిరీల్లో మొత్తం 607 పోస్టులున్నాయి. వీటిని 58ః42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు విభజించారు.

ఏపీకి 350, తెలంగాణాకు 257 పోస్టులు కేటాయించారు. ఏపీకి కేటాయించిన 350 పోస్టుల్లో 140 ఖాళీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య పోస్టుల విభజన చేయకపోవడంతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇబ్బందులు ఉండేవి. తాజాగా.. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఖాళీలను భర్తీచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది.

ఇక రాష్ట్ర విభజన అనంతరం 2017 అక్టోబర్‌ నుంచి ఐపీఎం రాష్ట్ర కార్యాలయం కార్యకలాపాలు ఏపీలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో పలువురు ఉద్యోగులు తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చారు. పోస్టుల విభజన పూర్తవ్వడంతో స్థానికత ఆధారంగా సొంత రాష్ట్రాలకు ఉద్యోగులను కేటాయించారు. ఈ క్రమంలో ఏపీ నుంచి 17 మంది తెలంగాణకు వెళ్తుండగా.. ఆరుగురు తెలంగాణ నుంచి ఏపీకి రానున్నారు.  

త్వరలో రాష్ట్ర ల్యాబ్‌ అందుబాటులోకి.. 
ఈ నేపథ్యంలో.. త్వరలో స్టేట్‌ ఫుడ్‌ ల్యాబొరేటరీ కార్యకలాపాలు రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలకు కలిపి హైదరాబాద్‌లో స్టేట్‌ ఫుడ్‌ ల్యాబొరేటరీ ఉంది. దీంతో ఆహార భద్రత తనిఖీల్లో భాగంగా సీజ్‌ చేసిన నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపుతున్నారు.

అక్కడి నుంచి నివేదికలు రావడానికి రెండు వారాల నుంచి నెలరోజుల సమయం పడుతోంది. ఫలితంగా కల్తీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యమవుతోంది. దీంతో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విశాఖపట్నంలో స్టేట్‌ ఫుడ్‌ ల్యాబొరేటరీ ఏర్పాటును వేగవంతం చేసింది. ల్యాబొరేటరీ భవనానికి మరమ్మతులు పూర్తయ్యాయి.

ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానుంది. నమూనాలు పరీక్షించడానికి అవసరమైన అధునాతన పరికరాలను సమకూర్చనున్నారు. వీలైనంత త్వరగా ల్యాబ్‌ కార్యకలాపాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ జె. నివాస్‌ తెలిపారు.  

Advertisement
Advertisement