సర్వేకు అదనంగా డ్రోన్లు | Sakshi
Sakshi News home page

సర్వేకు అదనంగా డ్రోన్లు

Published Thu, Aug 19 2021 3:04 AM

Drones in addition to survey Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలకు కొత్తగా ఆస్తి సర్టిఫికెట్ల జారీకి సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా సర్వే కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు డ్రోన్లు అందుబాటులో ఉండగా, తాజాగా జిల్లాకొకటి చొప్పున మొత్తం 13 డ్రోన్లను కేంద్రం సమిత్వ పథకంలో భాగంగా సమకూర్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీ అలోక్‌ ప్రేమ్‌ నగరతో పాటు సర్వే ఆఫ్‌ ఇండియా మాజీ చీఫ్, ప్రస్తుత కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అడ్వయిజర్‌ కల్నల్‌ గిరీష్‌ బుధవారం రాష్ట్రంలో పర్యటించారు. కృష్ణా జిల్లాలో పలు గ్రామాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్‌ 2 నాటికి దాదాపు 2,500 గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేసి మ్యాప్‌లను రాష్ట్రానికి అందజేసేందుకు చర్యలు చేపడతామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు. గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే సమయంలో చెట్లు వంటివి అడ్డం వచ్చినప్పుడు, ఇంటి సరిహద్దుల మధ్య విస్తీర్ణాన్ని నిర్ధారించడంలో ఏర్పడుతున్న ఇబ్బందులను పలు జిల్లాల కలెక్టర్లు సర్వే ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఆ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను సర్వే ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు వివరించారు. సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, సర్వే ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్‌ మాలిక్, వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష కార్యక్రమం ఓఎస్‌డీ ఏకే నాయక్, వర్చువల్‌ విధానంలో పలు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement