ఈ–క్రాప్‌తో అన్నదాతలకు భరోసా | Sakshi
Sakshi News home page

ఈ–క్రాప్‌తో అన్నదాతలకు భరోసా

Published Fri, Feb 9 2024 4:48 AM

E Crop registration based on geo fencing - Sakshi

సాక్షి, అమరావతి: రబీ సీజన్‌లో ఈ–క్రాప్‌ నమోదు వేగంగా సాగుతోంది. రైతులు వారి పొలాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను వ్యవసాయ శాఖ నమోదు చేస్తోంది. ఈ–క్రాప్‌ ప్రామాణికంగానే రైతులకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోంది. దీంతో పంటలు వేసిన ఒక్క రైతును కూడా వదలకుండా.. రాష్ట్రంలోని ప్రతి ఎకరాలో ప్రతి పంటనూ నమోదు చేయడమే వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.95 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 38.25 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ డేటాతోపాటు జియో ఫెన్సింగ్‌ ఆధారంగా డిసెంబర్‌లో ఈ–క్రాప్‌ నమోదుకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది.

ఇప్పటివరకు 37,02,031 ఎకరాల్లో పంటలను ఈ–క్రాప్‌లో నమోదు చేశారు. ఇందులో 34,21,189 ఎకరాల్లో వీఏఏలు, 31,86,682 ఎకరాల్లో వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా పూర్తి చేశారు. ఇప్పటివరకు 20,06,326 ఎకరాలకు సంబంధించి రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) నమోదు పూర్తయింది. 

జియో ఫెన్సింగ్‌ ద్వారా హద్దుల గుర్తింపు 
నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాప్‌లో ఆధార్, వన్‌బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్‌పీసీఐ), ఆధార్‌తో లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఫోన్‌ నంబర్, సీసీఆర్సీ కార్డుల వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత జియో ఫెన్సింగ్‌ ద్వారా సరిహద్దులు నిర్థారించి, రైతు ఫొటోను ఆర్బీకే సిబ్బంది అప్‌లోడ్‌ చేస్తున్నారు. గిరి భూమి వెబ్‌సైట్‌లో నమోదైన వివరాలు ఆధారంగా అటవీ భూముల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేస్తున్నారు.

మరోవైపు పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతోపాటు సీసీఆర్సీ కా­ర్డు­ల్లే­ని రైతుల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. పొలం ఖాళీగా ఉంటే నో క్రాప్‌ జోన్‌ అని, రొయ్యలు, చేపల చెరువులుంటే ఆక్వా కల్చర్‌ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్‌ అగ్రిల్యాండ్‌ యూజ్‌ అని నమోదు చేసి లాక్‌ చేస్తున్నారు. డూప్లికేషన్‌కు తావులేకుండా ఈ–ఫిష్‌ డేటాతో ఇంటిగ్రేట్‌ చేశారు.

జిరాయితీ, పట్టాదార్, అసైన్డ్, ఆర్‌ఓఎఫ్‌ఆర్, ఎండోమెంట్, వక్ఫ్, ఈనాం, లంక, సీజేఎఫ్‌ఎస్, మిగు­లు, ఆక్రమిత తదితర కేటగిరీల కింద గుర్తించిన ప్రభుత్వ భూముల్లో సాగవుతున్న ఆహార, నూనె గింజలు, పశుగ్రాసం, పంటలు, పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పూలు, మల్బరీ పంటలను నమోదు చేశారు. ఈకేవైసీ నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి రైతుకు రసీదు అందించే ఏర్పాటు చేశారు.

పారదర్శకంగా నమోదు 
ఈ–క్రాప్‌ను పారదర్శకంగా నమోదు చేయడంతోపాటు ఈకేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించాం. సోషల్‌ ఆడిట్‌ కోసం 21 నుంచి 28వ తేదీ వరకు ప్రాథమిక ఈ క్రాప్‌ జాబితాలను ప్రదర్శిస్తాం. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. మార్చి 6న తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తాం.

ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగానే సంక్షేమ ఫలాలు అందుతాయి. అందువల్ల ప్రతి రైతు వారు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి.  – గెడ్డం శేఖర్‌బాబు,ఇన్‌చార్జి కమిషనర్, వ్యవసాయ శాఖ 

Advertisement

తప్పక చదవండి

Advertisement