తుది దశకు ఈ–క్రాప్‌ నమోదు | Sakshi
Sakshi News home page

తుది దశకు ఈ–క్రాప్‌ నమోదు

Published Mon, Oct 17 2022 5:40 AM

E-Crop registration final stage Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రైతులు తమ వేలిముద్రలు (ఈకేవైసీ) నమోదుకు సోమవారం వరకు గడువు ఇచ్చారు. సామాజిక తనిఖీ కోసం ఈ–క్రాప్‌ జాబితాలను మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, పంట సాగు తదితర వివరాల నమోదులో ఎక్కడైనా పొరపాట్లు చోటుచేసుకున్నట్టు గుర్తిస్తే వాటిని సరి చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇస్తారు.

నవంబర్‌ 1వ తేదీ నుంచి తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటి ఆధారంగానే పంటల కొనుగోళ్లకు శ్రీకారం చుడతారు. పంటల బీమా, నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు కూడా తుది జాబితా ప్రకారమే అందిస్తారు.

పకడ్బందీగా నమోదు
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు వేళ ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈసారి ఈ–క్రాప్‌ నమోదులో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సౌజన్యంతో తయారు చేసిన యాప్‌ ద్వారా జాయింట్‌ అజమాయిషీ కింద ఆగస్టు 8న ఈ–క్రాప్‌ నమోదుకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ గ్రామాల వారీగా వెబ్‌ల్యాండ్‌ డేటాతో పాటు పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ) డేటా ఆధారంగా ఈ–క్రాప్‌ నమోదు చేశారు.

ఖరీఫ్‌లో 48 లక్షల మంది రైతులు పంటలు సాగు చేస్తుండగా.. ఇప్పటివరకు 41 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను సరిచూసుకుని వేలిముద్రలు (ఈకేవైసీ) నమోదు చేసుకున్నారు.  వరితో సహా నోటిఫైడ్‌ పంట వివరాలు 100 శాతం పూర్తి కాగా, ఈకేవైసీ నమోదు 95 శాతానికి పైగా నమోదైనట్టు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement