Fact Check: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంది జగనే | FactCheck: Ramoji Rao False News On Agri Gold Scam Case, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంది జగనే

Published Thu, Dec 28 2023 5:23 AM

Eenadu fake news on agrigold - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల బాధలు చంద్ర­బాబుకు పట్టవు. సీఎం వైఎస్‌ జగన్‌ బాధితులకు మేలు చేస్తే రామోజీరావు మనసు ఒప్పుకోలేదు. ఏదో ఒక బురద కథతో బాధితులను పక్కదోవ పట్టించాలన్న దుగ్ధ ఆయనది. అందుకే ఈనా­డులో ఓ అసత్య కథనం అచ్చే­శారు. అసలు అగ్రిగోల్డ్‌ కుంభకో­ణం వెలుగుచూ­సింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే. అయి­నా లక్షలాది అగ్రిగోల్డ్‌ బాధి­తు­లను చంద్రబాబు గాలికి వదిలే­శారు.

పైగా, ఆ కుంభకోణం సాకుగా చూపి అగ్రిగోల్డ్‌కు చెందిన అమరావతి­లోని అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఆ సంస్థ నుంచి చేజిక్కించుకోవాలని చంద్రబాబు, లోకేశ్‌ పన్నాగాలు పన్నారు. కొన్ని ఆస్తులను మరికొందరు నేతలు అక్రమంగా గుంజుకు­న్నారు. అంతే తప్ప బాధితుల కోసం వీసమెత్తు కూడా పనిచేయలేదు. ఈ విషయాలన్నీ రామోజీకి ఎరుకే. కానీ, చంద్రబాబు కోసమే పనిచేసే ఆయనకు ఇవేమీ పట్టవు. సీఎం వైఎస్‌ జగన్‌ మేలు చేసిన ఏదో రకంగా బురద వేసి, బాధితులను పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తున్నారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తులపైనే టీడీపీ కన్ను
టీడీపీ ప్రభుత్వంలో వెలుగుచూసిన అగ్రిగోల్డ్‌ కుంభకోణాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆస్తుల సంపాదనకు అక్షయ పాత్రగా మలచుకోవాలని పన్నా­గం పన్నారు. తమను ఆదుకోవాలని అగ్రిగోల్డ్‌ బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా కనికరించలేదు. కేసులను బూచిగా చూపి అగ్రిగోల్డ్‌ ఆస్తులను చవగ్గా  కొట్టేయడానికి ఆ సంస్థ యాజమా­న్యంతో తెరచాటు మంతనాలు సాగించారు. ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిలో ఉన్న వందల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు తనయుడు లోకేశ్‌ పంతం పట్టారు. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్‌ విభాగం ఉన్నతాధికారి ద్వారా మంత్రాంగం చేశారు, 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి.

ఆ భూములు, భవనాలు, సామాగ్రిని అడ్డదారిలో రూ.200 కోట్లకే హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందుకోసం అగ్రిగోల్డ్‌ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది. అగ్రిగోల్డ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ డొప్పా రామ్‌మోహన్‌రావు 2016 ఏప్రిల్‌ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం. అగ్రిగోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కంపెనీ అయిన రామ్‌ ఆవాస్‌ రిసార్ట్స్, హోటల్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ దినకర్‌ నుంచి 14 ఎకరాలు కొనడం గమనార్హం.

అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు. రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీ పట్టించుకోలేదు. బాధితుల గోడునూ పట్టించుకోలేదు. తక్షణం రూ.300 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్‌ బాధితులకు ఎంతో కొంత ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా విదల్చలేదు. బాధితులు మూడున్నరేళ్లపాటు పోరాటం చేసినప్పటికీ టీడీపీ ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. అయినా ఈనాడు రామోజీరావు ఏనాడూ ప్రశ్నించలేదు. ఒక్క ముక్కా రాయలేదు. బాధితులపై సానుభూతీ చూపలేదు.

బాధితులను ఆదుకున్న సీఎం వైఎస్‌ జగన్‌
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు రెండు దశల్లో రూ.929.75 కోట్లు చెల్లించారు. 10.37లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నారు. రాష్ట్రంలో 11,57,497 మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.3,944.70కోట్లు డిపాజిట్‌ చేశారు. వారిలో రూ.10వేలు లోపు డిపాజిట్‌ చేసినవారికి మొదటి విడతలో, రూ.20వేలు లోపు డిపాజిట్‌ చేసినవారికి రెండో విడతలో ప్రభుత్వం వారి డిపాజిట్‌ మొత్తాలను చెల్లించింది.

మిగిలిన వారికి కూడా డిపాజిట్‌ మొత్తం చెల్లించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, న్యాయపరమైన, సాంకేతికపరమైన అంశాలు అడ్డంకిగా మారాయి. ఈ సమస్యల పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. సీఐడీ అటాచ్‌ చేసిన ఆ సంస్థ భూములను వేలం ద్వారా విక్రయించి, బాధితులకు చెల్లించడానికి వేగంగా చర్యలు చేపట్టింది. అందుకోసం ఏలూరు ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది.

సీఐడీ అటాచ్‌ చేసిన అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఈడీ కూడా తరువాత అటాచ్‌ చేయడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయి. సీఐడీ అటాచ్‌ చేసిన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఆస్తులు వేలం వేసి మిగిలిన బాధితులకు డిపాజిట్‌ మొత్తం చెల్లించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

వీటిపై ఏనాడూ ప్రశ్నించని రామోజీ
♦ నాడు అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి కొమ్ముకాసిన చంద్రబాబు

♦ దేశంలో అలా చేసిన మొదటి పాలకుడు సీఎం జగన్‌

♦ రెండు విడతల్లో 10.37 లక్షల మందికి రూ.929.75 కోట్లు చెల్లింపు

♦ హాయ్‌ల్యాండ్‌తో సహా ఆ సంస్థ ఆస్తులు కొట్టేసేందుకుకుతంత్రం

♦ బాధితులు రోడ్డెక్కినా కనికరించనిటీడీపీ ప్రభుత్వం

♦ ప్రత్తిపాటి పుల్లారావు భార్య పేరుతో 14 ఎకరాలు కొనుగోలు

♦ న్యాయ ప్రక్రియ పూర్తికాగానే మిగిలినవారికీ చెల్లింపునకు సన్నాహాలు

ప్రైవేటు సంస్థ బాధితులకు అండగా నిలిచింది దేశంలో జగనే
ఓ ప్రైవేటు సంస్థ డిపాజిటర్లను మోసం చేస్తే బాధితులను ఆదుకున్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే చేసి చూపించారు. దేశంలోని మిగతా ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థ 8 రాష్ట్రాల్లో 19,18,865 మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380.29 కోట్లు వసూలు చేసి, వారందరినీ నిలువునా ముంచింది. ఏ ఒక్క రాష్ట్రం కూడా అగ్రిగోల్డ్‌ బాధితుల గోడును పట్టించుకోలేదు.

రాష్ట్రంలో 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలు అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను చేజిక్కించుకునేందుకు యత్నించారు తప్ప, బాధితులకు అండగా నిలవాలని మాత్రం భావించ లేదు. కానీ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీకి కట్టుబడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలిచారు. అయినా ఈనాడు రామోజీరావుకు కంటగింపుగానే ఉంది.

జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచి ప్రచారంలోకి వస్తే.. చంద్రబాబు చేసిన చెడు ప్రజలకు మరింతగా గుర్తుకు వస్తుందన్నదే ఆయన ఆందోళన. అందుకే అగ్రిగోల్డ్‌ బాధితులపై అన్యాయమంటూ రామోజీ మొసలి కన్నీరు కార్చారు.

Advertisement
Advertisement