Sakshi News home page

‘ఈనాడు’ అసత్య యజ్ఞంలో ‘వాస్తవాలే’ సమిధలు

Published Tue, May 16 2023 4:34 AM

EEnadu false propaganda on yagnam - Sakshi

సాక్షి, అమరావతి: వాస్తవాలన్నింటినీ సమిధలుగా మార్చి ‘ఈనాడు’ అసత్యాల యజ్ఞం చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో రాష్ట్రంలో సాగుతున్న అతి పెద్ద హిందూ ధార్మిక కార్యక్రమంపైనే ఓ అసత్య కథనాన్ని అల్లింది. సనాతన హిందూ సంప్రదాయం, ధర్మ ఔన్నత్యాన్ని  భవిష్యత్‌ తరాలకి చాటి చెప్పేలా, పురాణాలలో చెప్పిన మహత్తర యజ్ఞాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేయిస్తుంటే ‘ఈనాడు’ ఏమాత్రం ఓర్వలేకపోయింది.

పలువురు పీఠాధిపతుల సమ­క్షంలో అనేక మంది వేద పండితులు, వందలాది రుత్విక్కుల  ఆధ్వర్యంలో విజయవాడలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ‘అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం’ పైనా విషం చిమ్మింది. దానికి పెట్టే ఖర్చును ‘‘దేవదాయ సొత్తే.. సమిధ’’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. హిందూ ధర్మ వ్యాప్తికి, దైవ కార్యక్రమాలకు దేవదాయ శాఖ డబ్బు కాకుండా మరే డబ్బును ఖర్చు చేస్తారన్న కనీస జ్ఞానాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది ఆ పత్రిక.

కేవలం దైవ, హిందూ ధర్మ ప్రచారాలకు మాత్రమే ఉపయోగించాల్సిన కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) నిధులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేసినా కిమ్మనని ఈనాడు.. ఇప్పుడు ధర్మ ప్రచారానికి ఉపయోగించడమూ నేరమే అంటోంది. నాడు చంద్రబాబు సర్కారు ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాల్సిన దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం భవనానికి రూ.10 కోట్ల సీజీఎఫ్‌ నిధులు ఖర్చు చేసింది.

ఇదంతా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయిన ‘ఈనాడు’.. ఇప్పుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు దైవ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడాన్ని తప్పుపడుతోంది. ఈనాడు కథనంలో అవాస్తవాలను దేవదాయ శాఖ కమిషనర్‌ బట్టబయలు చేశారు. వాస్తవాలను వివరించారు. 


ఆ వాస్తవాలిలా ఉన్నాయి.. 
ఈనాడు ఆరోపణ:మహా యజ్ఞానికి ఉపయోగించే నెయ్యిని దేవదాయ శాఖ కిలో రూ. 1400లు పెట్టి కొంటోంది. మార్కెట్‌లో దాని ధర రూ. 600 – 650 మాత్రమే.
దేవదాయ శాఖ కమిషనర్‌ చెబుతున్న వాస్తవం:  కిలో  రూ. 1,400 అన్నది పచ్చి అబద్ధం. యజ్ఞ నిర్వహణకు ఉపయోగించే పవిత్ర దేశీ ఆవు నెయ్యిని కొంటున్నది రూ. 1,071కే.  శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవముల సందర్భంగా హైదరాబాద్‌లో చిన జీయర్‌ స్వామి ఆశ్రమం నిర్వహించిన యజ్ఞానికి ఆ సంస్థ కొన్న ధరకన్నా దేవదాయ శాఖ కొన్న ఆవు నెయ్యి ధర చాలా తక్కువ. ఈ రెండు యజ్ఞాలకూ దేశీ ఆవు నెయ్యి సరఫరా చేసింది ఒకే సంస్థ. చిన జీయర్‌ స్వామి వారి ఆశ్రమం 15 లీటర్ల ఆవు నెయ్యి టిన్ను రూ. 24107.14కి కొనగా,  దేవదాయ శాఖ బేరమాడి 15 లీటర్ల టిన్నును రూ. 16,071కే కొన్నది.

ఆరోపణ: దుర్గగుడి కొనే నెయ్యి ధరకన్నా యజ్ఞానికి ఎక్కువ ధర.
వాస్తవం: వివిధ ఆలయాలు కొనే నెయ్యి అత్యధికం ప్రసాదాల తయారీకి మాత్రమే వినియోగిస్తారు. యజ్ఞ కార్యక్రమాలకు ఉపయోగించే నెయ్యి పూర్తి భిన్నమైనది. యజ్ఞ యాగాదులకు వినియోగించవలసిన నెయ్యి  పూర్తిగా స్వదేశీ ఆవు పాలను మరిగించి పెరుగు చేసి, ఆ పెరుగు నుండి తీసిన వెన్నను మరిగించి తయారు చేసిన నెయ్యి మాత్రమే అయి ఉండాలి. 

ఆరోపణ: యజ్ఞ సామాగ్రిని ఇష్టానుసారం ధరలకు కొన్నారు. దీక్షా వస్త్రాలకే రూ. 20 లక్షలు ఖర్చు చేశారు.
వాస్తవం:  యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే వేద పండితులకు, రుత్విక్కులు, పరిచారికలు, భజంత్రీలకు కలిపి మొత్తం 688 మందికి ఒక్కొక్కరి  మూడు దీక్షా వస్త్రాల చొప్పున మొత్తం 2064 అందజేయాలని నిర్ణయం జరిగింది.  మహా యజ్ఞంలో సుమారు 15 మంది పీఠాధిపతులను ఆహ్వానించినందున హైందవ సంప్రదాయాన్ని అనుసరించి వారికి ఉపయోగించే వస్త్రాలు ఏకతానుతో చేసినవి అయి ఉండాలి. దీక్షా వస్త్రాల కొనుగోలుకు రూ. 11.35 లక్షలు ఖర్చు చేశాం. ‘ఈనాడు’లో పేర్కొన్నట్టు రూ.20 లక్షలు కాదు. 

ఆరోపణ:  మహా యజ్ఞం నిర్వహణకు పెద్ద ఆలయాల  నుంచి నిధులు సమీకరించారు.
వాస్తవం: ఆలయాల ప్రథమ కర్తవ్యం సనాతన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించటం, యజ్ఞ యాగాదులు నిర్వహించటం. 

ఈనాడు ఆరోపణ: ప్రతి పనినీ అధికారులు దుర్గగుడికే అప్పగిస్తున్నారు
కమిషనర్‌ చెబుతున్న వాస్తవం: మహా యజ్ఞం నిర్వహణకు వచ్చిన వివిధ శాఖల సిబ్బందికి, స్వచ్ఛంద సేవా సంస్థల వలంటీర్లకు మాత్రమే దుర్గమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి భోజనాలు ఏర్పాటు చేశాం.

Advertisement
Advertisement