Fact Check: రామోజీ కలం ‘కిక్కు’తోంది.. | Sakshi
Sakshi News home page

Fact Check: రామోజీ కలం ‘కిక్కు’తోంది..

Published Sun, Oct 1 2023 4:18 AM

Eenadu Ramoji Rao Fake News On CM Jagan Govt On Liquor Policy - Sakshi

సాక్షి, అమరావతి: కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు రాసి పారేస్తే ప్రజలు నమ్మక ఏం చేస్తారు అన్న భ్రమల్లో ఉన్నారు ఈనాడు రామోజీరావు. అంకెలు అబద్ధాలు చెప్పవు.. నిజాలే చెబుతాయి కదా.. అందుకే ఈనాడు రామోజీరావు ఎప్పుడూ అంకెలు చెప్పరు, అబద్ధాలే చెబుతారు. అందులోనూ తన ఆత్మబంధువు చంద్రబాబు సీఎం కుర్చీలో లేకపోతే ఆయన కలం వెర్రితలలు వేస్తుంది. అబద్ధాలు, అభూత కల్పనలను రంగరించి మరీ విషం కక్కుతుంది. ప్రజల్ని మభ్యపెట్టడం, మోసగించడమే ఆ కలం నిత్యకృత్యం.

ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన మరోసారి విద్వేషాన్ని చిమ్మారు. ఓట్లడిగే ‘అర్హత’ కోల్పో­యిన జగన్‌.. అంటూ ఈనాడు ఊగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానంపై ఓ అబ­ద్ధాల కథనాన్ని అచ్చేసింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు పాతరేసి ఎప్పటిలాగే దుష్ప్రచా­రానికి తెగబడింది. అందులో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానా­నికి వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రామోజీ పడరాని పాట్లు పడ్డారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారిన నిజాన్ని.. టీడీపీ నేతలు మద్యం సిండికేట్‌గా మారి పేదలను దోచుకున్న దోపిడీని చూసి పచ్చ పారవశ్యంతో పులకించిపోయిన రామోజీ ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని విమర్శించేందుకు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు.

కానీ, టీడీపీ ప్రభుత్వంలో మూడు బార్లు ఆరు దుకాణాలుగా మద్యం ఏరులై పారిందని.. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దశలవారీగా మద్య నియంత్రణ సుసాధ్యమవుతోందని రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయ ప్రాభవం ఇక ముగిసిందని.. తన ఆర్థిక అక్రమ సామ్రాజ్యం కుప్పకూలిందని 90 ఇయర్స్‌ రామోజీ ఇకనైనా గుర్తిస్తే మేలు. నిత్యం అబద్ధాలను వల్లెవేసే ఈనాడు విషపు రాతల బండారాన్ని బట్టబయలు చేస్తున్న పచ్చినిజం ‘ఏది నిజం’ ఇదిగో..

అప్పట్లో మూడు పర్మిట్‌ రూమ్‌లు.. ఆరు బెల్ట్‌ దుకాణాలు..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోటీడీపీ నేతల మద్యం సిండికేట్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పర్మిట్‌ రూమ్‌లు.. ఆరు బెల్ట్‌ దుకాణాలుగా మద్యం ఏరులై పారిందన్నది నిఖార్సైన నిజం. రామోజీకి గుర్తులేదేమోగానీ రాష్ట్ర ప్రజలు మాత్రం మరిచిపోలేదు. అప్పట్లో టీడీపీ నేతల గుప్పెట్లో ఉండే మద్యం మాఫియా యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేసింది. వేళాపాళా లేకుండా 24 గంటలూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవి. ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం వరకు అధిక ధరలకు అమ్ముతున్నా సరే నాడు ఎక్సైజ్‌ శాఖ చేష్టలుడిగి చోద్యం చూడాల్సి వచ్చేది.

మద్యం మాఫియా ఆట కట్టించిన సీఎం జగన్‌..
మద్యం మాఫియా అరాచకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో తుడిచి­పెట్టేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకా­ణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టో­బర్‌ 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. దాంతో రాష్ట్రంలో మద్యం మాఫియా కోరలు పీకి తుదముట్టించారు. అందుకోసం..

మద్యం దుకాణాల వేళలు కుదింపు
ప్రైవేటు వ్యక్తులైతే ఎంతగా మద్యం విక్రయాలు పెంచితే తమకు అంతటి లాభం వస్తుందని అనుకుంటారు. కానీ, ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని సీఎం జగన్‌ రద్దుచేశారు. ప్రస్తుతం మద్యం దుకా­ణాలు ప్రభుత్వానివే కాబట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించాల్సిన అవసరమేలేదు. అంతేకాదు.. మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు.

టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకా­ణాలు ఉ.10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24గంటలూ విక్రయిస్తూ ఉండేవి. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల సమయాన్ని కుదించి ఉ.10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలను అనుమతించారు. కచ్చితంగా అమలుచేస్తున్నారు కూడా.

బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లు రద్దు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43వేల బెల్ట్‌ దుకాణాలు ఉండేవి. కాలనీలు, వీధులు, సందుల్లో ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌ దుకాణాలు విచ్చలవి­డిగా మద్యాన్ని విక్రయించేవి. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం అధికారంలోకి రాగానే ఆ 43వేల బెల్ట్‌ దుకా­ణాలను పూర్తిగా తొలగించింది. టీడీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా 4,380 పర్మిట్‌ రూమ్‌లకు అనుమతించారు. అంటే ఆ పర్మిట్‌ రూమ్‌లు అనధికారికంగా బార్లుగా చలమణి అయ్యేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ 4,380 పర్మిట్‌ రూమ్‌ల అనుమతులను సైతం రద్దుచేసింది. 

మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వపరం చేసింది. అంతేకాదు.. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. అలాగే, టీడీపీ ప్రభుత్వం ఏటా బార్ల సంఖ్యను పెంచేది. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. 

విక్రయాలు తగ్గించేందుకే ధరల షాక్‌
మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనూ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అంతేగానీ, మద్యం విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. ఆ మాటకు కట్టుబడుతూ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచారు.

అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఏఆర్‌ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్‌ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తుండటం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు మద్యం వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు.

ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో ‘నవోదయం’..
దశాబ్దాలుగా నాటుసారా తయారీయే జీవనో­పాధిగా చేసుకున్న కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అందుకోసం ‘నవోదయం’ పేరుతో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి ఆ కుటుంబాల సామాజిక గౌరవాన్ని పెంచింది. 2022 ఏప్రిల్‌ నాటికి రాష్ట్రంలో 1,891 గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికే 1,552 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూ.11.46 కోట్ల మేర సహాయం చేసింది. 


99 శాతం మేనిఫెస్టో అమలు
దశలవారీ మద్య నియంత్రణ అనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమీ బుకాయించడంలేదు. తాము చేసిందే చెబుతున్నారు. అదే సమయంలో తమ పరిమితిని కూడా అంగీకరిస్తున్నారు. అందుకే ఆయన తమ మేనిఫెస్టోను 99 శాతం అమలుచేశామనే చెబుతున్నారు. మద్యం, ఉద్యోగుల విషయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి చాలావరకు చేశారు. కానీ, సాంకేతిక అంశాలు, ఇతరత్రా కారణాలతో ఆ రెండు అంశాల్లో అరశాతం చొప్పున మిగిలిపోయిందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిజాయతీగా అంగీకరిస్తోంది.

అందుకే తాము 99శాతం మేనిఫెస్టోను అమలుచేశామనే సీఎం జగన్‌ చెబుతుండటం ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం. అంతేగానీ, ఆయన ప్రజల్ని మోసపుమాటలతో మాయచేయడంలేదు. 99 శాతం మేనిఫెస్టో అమలుచేశామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌ను రామోజీరావు పచ్చకావరంతో తప్పుబడుతున్నారు. కానీ, చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను ఏమాత్రం అమలుచేయలేదు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు.

టీడీపీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి సైతం దానిని తొలగించారు. అయినాసరే అప్పట్లో రామోజీరావు నోరు పెగల్లేదు.. పెన్ను కదల్లేదు. మేనిఫెస్టోను ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పట్లో అధికారంలో ఉన్నది తన పార్ట్‌నర్‌ చంద్రబాబు కాబట్టి. తన అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా ఉన్న చంద్రబాబు కాబట్టి. ప్రజలకు ఎంత నష్టం జరిగినా, రాష్ట్ర ప్రగతి దెబ్బతిన్నా సరే ఏమాత్రం పట్టించుకోలేదు.

కానీ, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 99 శాతం మేనిఫెస్టోను అమలుచేసి.. ఆ విషయాన్ని నిజాయతీగా ప్రకటిస్తున్నా సరే రామోజీ  తప్పుబడుతుండటం ఈనాడు ‘పచ్చ’కామెర్ల తత్వాన్ని బయటపెడుతోంది. ఆ పచ్చపైత్యం చంద్రబాబుకు కమ్మగా ఉంటుందేమోగానీ టీడీపీ కుట్రలను, ఈనాడు దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొడుతున్నారు. ఇది నాలుగున్నరేళ్లుగా రుజువవుతూనే ఉంది. అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెన్నంటే ఉన్నామని తేల్చిచెబుతున్నారు.  

చంద్రబాబు, రామోజీ మద్యం బంధం 
వ్యాపార ప్రయోజనాల కోసం కుట్రపూరిత రాజకీయాలతో ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు, రామోజీరావు సిద్ధహస్తులు. వారి రాజకీయ బంధం మద్యంతో ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యం. 1989–94లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడం.. అప్పట్లో తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు.

ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. మద్య నిషేధాన్ని ఎత్తివేసి మద్యానికి తలుపులు బార్లా తెరిచారు. అయినాసరే.. రామోజీరావు కిమ్మనకుండా మద్దతు తెలిపారు. ఎందుకంటే అప్పుడే రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్‌హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు నిజంగా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాల గురించి శ్రీరంగ నీతులు చెబుతుండటం విడ్డూరంగా లేదూ?

అక్రమ మద్యంపై ఎస్‌ఈబీ ఉక్కుపాదం
అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటుచేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్‌ఈబీ మూడు విధాలుగా అక్రమ మద్యం, నాటుసారాను అరికడుతోంది. అదెలాగంటే..

► అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు నిర్వహిస్తోంది.
► గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాను అడ్డుకుంటోంది.
► ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. 
► అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో కలిసి దాడులు నిర్వహిస్తోంది.  

Advertisement
Advertisement