Fact Check: పెత్తందార్ల ఉన్మాదం | FactCheck: Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan Govt, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: పెత్తందార్ల ఉన్మాదం

Published Fri, Jan 5 2024 3:30 AM

Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan Govt - Sakshi

ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ నాడు సీఎం హోదాలో ఆ వర్గాల ప్రజల పుట్టుకనే అవహేళన చేసిన చంద్రబాబుది పెత్తందారు పోకడ. వీటిని ‘ఈనాడు’లో ప్రచురించకుండా కప్పి పుచ్చిన రామోజీ మరో పెద్ద పెత్తందారు.

మీరు దళితులు..! మీకెందుకురా రాజకీయాలు, పదవులు..? అని ఎస్సీలను తూలనాడుతూ నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించకపోవడం పెత్తందారీ పోకడే. చంద్రబాబును భుజానికెత్తుకుని మోస్తున్న రామోజీది పెత్తందారీ పైత్యమే. 

ఎస్సీలు శుభ్రంగా ఉండరు.. చదువూ రాదు..! అంటూ ఆ వర్గాలను గేలి చేసిన నాటి మంత్రి దేవగుడి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలను బాబు ఖండించకపోవడం పెత్తందారీ పైశాచికం. 

గతేడాది మే 24న పూతలపట్టు నియోజకవర్గం పేట అగ్రహారంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు పర్యటిస్తే వీధులు మలినం అయ్యాయని టీడీపీ నేతలు పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేశారు. ఆ అమానుషాన్ని నిలదీయ కుండా కళ్లు మూసుకున్న రామోజీ పెత్తందారీ మనస్తత్వానికి ఇంకే నిదర్శనం కావాలి?   

సాక్షి, అమరావతి: సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానమని దేశానికి చాటిచెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన పట్ల ఆయా వర్గాల్లో రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేరువ చేయడం, ప్రజల ఆకాంక్షలు, సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితుల మేరకు సమన్వయకర్తల స్థానాల్లో మార్పు చేర్పులు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ క్రమంలో సామాజిక న్యాయం దిశగా మరో రెండడుగులు ముందుకేశారు. 2019 ఎన్నికల్లో అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీ చేసిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాలకు బీసీలను, రెండు స్థానాలకు మైనార్టీ వర్గాల నేతలను సమన్వయకర్తలుగా నియమించారు.

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని చెప్పిన సీఎం జగన్‌ తాజాగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకూ సీటు ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేల సీట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మార్చారంటూ ‘ఈనాడు’ రామోజీ కాకమ్మ కథలు అచ్చేశారు. ఎస్సీ ఎమ్మెల్యేల సీట్లు మార్చితే మళ్లీ సీటు ఇచ్చింది ఆ వర్గాలకే కదా రామోజీ? జనం మెచ్చిన జగన్‌ సామాజిక న్యాయ పాలనపై అసూయతో రగిలిపోతున్న రామోజీ ‘ఇది కదా పెత్తందారీ పోకడ’ అంటూ పచ్చి అబద్ధాలతో కథనాన్ని అచ్చేశారు.  

రాజకీయ, ఆర్థిక, విద్యా సాధికారత.. 
2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ వరకూ సింహభాగం పదవులు ఇవ్వడం ద్వారా రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల్లో అధిక వాటా ఇవ్వడం ద్వారా ఆర్థిక సాధికారత చేకూర్చారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి ఇంగ్లీషు మీడియం బోధన, అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన తదితర పథకాల ద్వారా విద్యా సాధికారత సాధించారు. వైఎస్సార్‌ ఆసరా, చేయూత లాంటి పథకాల ఆర్థిక చేయూతనిచ్చారు.

పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు వేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది. ఇలా 56 నెలలుగా విప్లవాత్మక నిర్ణయాలతో సంస్కరణలు అమలు చేస్తుండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికారత సాధించాయి. అగ్రవర్ణ పేదలకూ అదే రీతిలో మేలు జరిగింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటమే అందుకు తార్కాణం.

వచ్చే ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలు సీఎం జగన్‌కు అండగా నిలవడం ఖాయమని, ఇది 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌ సీపీ ఘనవిజయానికి దోహదం చేస్తుందని ‘టైమ్స్‌ నౌ’ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. గత ఎన్నికలకు మించి టీడీపీకి ఘోర పరాభవం తప్పదని తేలడంతో ఉనికి చాటుకునేందుకు చంద్రబాబుతో కలిసి రామోజీ టన్నుల కొద్దీ అబద్ధాలను తన కరపత్రికలో కుమ్మరిస్తున్నారు.  

గెలుపే లక్ష్యంగా.. 
ప్రజల ఆకాంక్షలు, సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ నియోజక వర్గాల సమన్వయకర్తల స్థానాల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం(ఎస్సీ) 
నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ 

స్థానికుడైన తాటిపర్తి చంద్రశేఖర్‌ను సమన్వయకర్తగా నియమించారు. ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురే‹Ùను స్థానిక పరిస్థితుల దృష్ట్యా  కొండెపి (ఎస్సీ)  సమన్వయకర్తగా నియమించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో చేనేత (బీసీ) వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీసీ ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు. మంగళగిరి నుంచి చేనేత వర్గానికి చెందిన అభ్యర్థికి అవకాశమివ్వాలన్న ప్రజల అభీష్టాన్ని గౌరవిస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా సీఎం జగన్‌ నియమించారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనూ ఇదే రీతిలో ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్థానంలో చేనేత వర్గానికి చెందిన మాచాని వెంకటేశ్‌ను సమన్వయకర్తగా నియమించారు. శ్రీసత్యసాయి జిల్లా కది­రిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. అక్కడ మైనార్టీ వర్గా­నికి అవకాశం ఇవ్వాలన్నది ప్రజల ఆకాంక్ష. దాన్ని గౌర­విస్తూ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్థానంలో బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌ను సమన్వయకర్తగా నియమించారు. రెండు విడతల్లో 35 నియోజకవర్గాల్లో ఇదే రీతిలో సమన్వయకర్తల స్థానాల్లో మార్పుచేర్పులు చేయడం రామోజీకి తప్పుగా కన్పిస్తుండటం విచిత్రం.   

జిల్లాలు దాటించిన బాబు
గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి మార్చి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి చంద్రబాబు బరిలోకి దించారు. కొవ్వూరు ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్‌ జవహర్‌ను అక్కడి నుంచి మార్చి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీకి దించితే రామోజీకి నచ్చింది. అందుకే దానిపై ఈనాడులో ఎలాంటి కథనం ప్రచురించలేదు.    

సామాజిక న్యాయం ఇలా..  
► చంద్రబాబు పాలనలో మంత్రివర్గంలో బీసీలకు ఎనిమిది పదవులు ఇవ్వగా సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకు 11 పదవులు కేటాయించారు. చంద్రబాబు ఎస్సీలకు రెండు మంత్రి పదవులు ఇస్తే సీఎం జగన్‌ ఐదు మంత్రి పదవులు ఇచ్చారు.  

► టీడీపీ హయాంలో చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోడెల శివప్రసాద్‌ను శాసనససభ స్పీకర్‌గా చేస్తే.. సీఎం జగన్‌ బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు సభాపతిగా అవకాశం కల్పించారు. 

► రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌ రాజును శాసనమండలి ఛైర్మన్‌గా సీఎం జగన్‌ చేశారు. 

► 2014–19 మధ్య చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీకి దక్కిన 8 రాజ్యసభ స్థానాల్లో బీసీ వర్గానికి నాలుగు పదవులు (50 శాతం) సీఎం జగన్‌ ఇచ్చారు.  

► టీడీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 18 ఎమ్మెల్సీ పదవులు (37%) ఇవ్వగా సీఎం జగన్‌ ఆయా వర్గాలకు 29 ఎమ్మెల్సీ పదవులు(69 శాతం) ఇచ్చారు.  

► సీఎం జగన్‌ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో నలుగురు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. 

► టీడీపీ హయాంలో 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. సీఎం జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జెడ్పీ చైర్మన్‌ పదవులు (69 శాతం) ఇచ్చారు.  

► రాష్ట్రంలో 14 మున్సిపల్‌ కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 14 మేయర్‌ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలిపితే 14 కార్పొరేషన్‌ మేయర్‌ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే ఇచ్చారు.  

► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే 84 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇందులో 44 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను బీసీలకు (53 శాతం) సీఎం జగన్‌ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కలిపి 58 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులు (69%) ఇచ్చారు.  

► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులలో 53 పదవులు (39 శాతం) బీసీలకే ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 137 పదవుల్లో 79 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు.  

► 137 ప్రభుత్వ కార్పొరేషన్‌ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవులుంటే అందులో 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 484 పదవుల్లో 280 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు.   

► బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వాటికి ఆయా వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్‌ పదవులూ ఇచ్చారు.  

► ఆలయ బోర్డులు, ఆలయ ఛైర్మన్‌ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. 

► సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.45 లక్షల కోట్లను ఇప్పటిదాకా సీఎం జగన్‌ జమ చేయగా> ఇందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదలకే చేరాయి.  

► వీటిని పరిశీలిస్తే సామాజిక ద్రోహానికి చంద్రబాబు ప్రతీకగా నిలిస్తే.. సామాజిక న్యాయా­నికి సీఎం జగన్‌ నిదర్శనంగా నిలుస్తున్నారన్నది స్పష్టమవుతోంది.    

Advertisement
Advertisement