fact check: పంటల‘కేసీ’ కళ్లెట్టుకు సూడు.. | Sakshi
Sakshi News home page

fact check: పంటల‘కేసీ’ కళ్లెట్టుకు సూడు..

Published Tue, Feb 6 2024 5:58 AM

Eenadu Ramoji Rao Fake News on Srisailam project water - Sakshi

కేసీ కెనాల్‌ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల శాఖ ఇంజినీర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇది చూసిన పచ్చ పత్రిక ఈనాడు తట్టుకోలేక నీటి తడులపై తప్పుడు కథనాన్ని ప్రచురించింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా కేసీ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించడం, కర్షకులు ఆనందంగా ఉండడాన్ని ఓర్వలేని రామోజీ తన అక్కసు వెళ్లగక్కారు. శ్రీశైలం నీళ్లు అమ్ముకుంటున్నారంటూ కి‘రాత’కానికి దిగారు. 

కర్నూలు సిటీ/ఆళ్లగడ్డ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు కేసీ కెనాల్‌ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని  2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. సాగు నీటి సలహా మండలి సమావేశంలోనూ తీర్మానం చేశారు. ఆ మేరకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు.

దీంతో రైతులూ ఆరుతడి పంటలను సాగు చేశారు. ఆ తరువాత సెప్టెంబరు, నవంబరు నెల చివరి వారాల్లో కొంత మేర వర్షాలు పడ్డాయి. దీంతో నవంబరు నెల 25న మరోసారి సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి కేసీ కెనాల్‌కు డిసెంబరు 15 వరకు నీటిని ఇవ్వాలని తీర్మానించారు. రైతులు కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి శ్రీశైలంలో లెవెల్‌ పర్మిట్‌ చేసేంత వరకు నీటిని ఇవ్వాలని కోరారు.

దీంతో నంద్యాల కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు వారాబందీ ప్రకారం నీరు విడుదల చేస్తున్నారు. నీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు రాత్రీపగలు కెనాల్‌పై గస్తీ కాసి ప్రతి ఎకరాకూ నీరు అందించారు. మంచి దిగుబడులు రావడంతో రైతులు సంబరపడ్డారు. జలవనరుల శాఖ ఇంజినీర్లను సన్మానిస్తున్నారు.

అన్నీ తప్పుడు రాతలే
రామోజీ పచ్చ పత్రిక బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కై రబీలోని మిరప పంటకు నీటిని అమ్ముకుంటున్నారని కథనం వండివార్చింది. ఇదంతా అవాస్తవం. కేసీ కెనాల్‌ పరిధిలో మిరప సాగుచేసిన రైతుల్లో బడా రైతులు లేరు. ఒకరికి మాత్రమే పది ఎకరాలు ఉంది. మిగిలిన వారందరూ ఎకరా, ఎకరన్నర ఉన్న సన్నకారు రైతులే. కానీ అనధికారికంగా 20 వేల ఎకరాల్లో సాగు చేశారంటూ తప్పుడు గణాంకాలు ప్రచురించింది.

ఇకపోతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 5 టీఎంసీలు కేసీ కెనాల్‌కు తీసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతోనే ముచ్చుమర్రి నుంచి నీటిని తీసుకుంటుంటే ఈనాడు తప్పుడు రాతలు రాసింది. ‘‘నీటి కేటాయింపులు లేవు. రైతులకు నీరు ఎలా ఇస్తారు? రైతులకు అన్యాయం జరుగుతుందనేలా విషపు కథనాన్ని కక్కింది.  రైతుల నుంచి వసూళ్ళు చేసిన సొమ్ము రాష్ట్ర స్థాయి అధికారికి చేరిందంటూ అవాస్తవాలతో పైత్యం ఒలకబోసింది. దీనిపై ఇంజినీరింగ్‌ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అది ముమ్మాటికీ తప్పుడు కథనమే
ఉయ్యాలవాడ: శ్రీశైలం నుంచి ఎస్సార్బీసీ కేసీ కెనాల్‌కు వచ్చే సాగు నీటికి రైతులు డబ్బులు ఇచ్చారని ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు బుడ్డా చంద్రమోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డ్‌ డైరెక్టర్‌ గజ్జెల క్రిష్ణారెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్‌ ఆరికట్ల శివరామక్రిష్ణారెడ్డి రైతులతో కలిసి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర సాగునీటి జలవనరుల సలహాదారులు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేయించారని పేర్కొన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై రైతులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు.

ఈనాడుది తప్పుడు కథనం
కేసీ కెనాల్‌ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో 97 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆగస్టు, డిసెంబర్‌ నెలల్లో నిర్వహించిన ఐఏబీ సమావేశాల్లో డిసెంబర్‌ 15 వరకు నీటిని అందించాలని తీర్మానం జరిగింది. రైతుల విన్నపం మేరకు శ్రీశైలంలో లెవెల్‌ పర్మిట్‌ చేసేంత వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం.  ముచ్చుమర్రి ద్వారా వారాబందీ ప్రకారం రాత్రి, పగలు గస్తీకాసి నీరు అందిస్తుంటే ఇంజినీర్లు డబ్బులు వసూలు చేశారంటూ తప్పుడు కథనం రాయడం బాధాకరం.     – వి.తిరుమలేశ్వర రెడ్డి, కేసీ ఈఈ 

సాగునీరు కొనుక్కొనే దుస్థితి లేదు
సాగునీటి కోసం అధికారులకు లంచాలిచ్చి కొనుక్కొనే దుస్థితి రైతుకు దాపురించలేదు. వర్షాభావంలోనూ మా పంటలకు నీరు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వచ్చి పంటలు పండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా కుంటలను నింపుకునేందుకు కేసీ కెనాల్‌కి నీరు వదిలారు.     – రామాంజనేయరెడ్డి, రైతు, గుండుపాపల

చివరి పంటలకు సాగునీరు ఇచ్చారు
ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే జలాశయాల్లో నీరు అంతంత మాత్రమే. అయినా మా పంటలు ఎండకూడదనే ఉద్దేశంతోనే వారాబందీగా నీరు అందించారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందింది.    – వాసుడు, రైతు, చాకరాజువేముల

Advertisement
Advertisement