నేడు ‘ఏలూరు కార్పొరేషన్‌’ ఫలితాలు

25 Jul, 2021 01:57 IST|Sakshi
కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఈసీ నీలం సాహ్ని

ఉదయం 8 గంటలకు 47 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం

మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితాలు

సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో పటిష్ట ఏర్పాట్లు 

144 సెక్షన్‌తోపాటు మూడంచెల భద్రత 

కౌంటింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎస్‌ఈసీ సాహ్ని

ఏలూరు టౌన్‌: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. ఏలూరు శివారులోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు డివిజన్లు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మరో 47 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా.. వీటికి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.

కరోనా నిబంధనల నేపథ్యంలో 47 టేబుళ్లపై ఏకకాలంలో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 47 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, మరో 254 మంది సిబ్బందితోపాటు, అదనంగా 200 మంది ఏలూరు కార్పొరేషన్‌ సిబ్బంది ఎన్నికల కౌంటింగ్‌ విధుల్లో పాల్గొంటారని నగర కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు జరిగే సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని శనివారం సందర్శించారు. కౌంటింగ్‌ హాళ్లను, టేబుళ్ల అమరికను పరిశీలించారు. అనంతరం అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆమెకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్‌ విధించామని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. మొత్తం 175 మంది పోలీసులను నియమించామన్నారు.  

మరిన్ని వార్తలు