కేరళలోనూ ఆర్బీకేల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

కేరళలోనూ ఆర్బీకేల ఏర్పాటు

Published Mon, Oct 18 2021 4:52 AM

Establishment of Rythu Bharosa Centres In Kerala State Also - Sakshi

తుక్కులూరు/ముసునూరు(నూజివీడు): కేరళ రాష్ట్రంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరతామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్‌ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల వైపు దేశం మొత్తం చూస్తోందని ఆయన ప్రశంసించారు. కేరళ వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలోని బృందం ఆదివారం కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించింది. అక్కడ అందుతున్న వ్యవసాయ సేవలను పరిశీలించింది. ఎరువులు, విత్తనాల కోసం ఆర్డర్‌ పెట్టే కియోస్క్‌ యంత్రాన్ని పరిశీలించి.. ‘ఇదేంటి అచ్చం ఏటీఎంలా ఉంది’.. అంటూ కేరళ మంత్రి ప్రశ్నించారు.

విత్తనాలను, ఎరువులను బుక్‌ చేసుకునేందుకు దీనిని రైతులకు అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పగా.. మంత్రి ఆశ్చర్యపోయారు. అధికారులు తెలిపిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చూపుతున్న శ్రద్ధకు కేరళ మంత్రి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యంపై దేశం మొత్తం చర్చించుకుంటోందన్నారు. రైతులకు విత్తనాల దగ్గర నుంచి ఎరువులు, పురుగు మందులతో సహా.. పండిన పంటలకు గిట్టుబాటు ధర అందించే వరకూ సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన గొప్పదని కొనియాడారు.

రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, సేంద్రియ ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం తదితర వాటిపై తమ బృందం అధ్యయనం చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రకృతి వ్యవసాయ కార్యనిర్వాహక వైస్‌ చైర్మన్‌ టి.విజయకుమార్‌ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని కొర్లగుంటలో ప్రకృతి సిద్ధ సేద్యంలో సాగవుతున్న పెరటి తోటలు, ఉద్యాన పంటలు, పండ్ల తోటలు, సేంద్రియ ఎరువుల తయారీని కేరళ మంత్రి, అధికారులు పరిశీలించారు. కార్యక్రమాల్లో కేరళ రాష్ట్రానికి చెందిన పూర్వ చీఫ్‌ సెక్రటరీ, స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎం విజయానంద్, డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ టీవీ సుభాష్, అగ్రికల్చర్‌ డివిజన్‌ చీఫ్‌ నగేష్, డెప్యూటీ డైరెక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ తదితరులున్నారు.    

Advertisement
Advertisement