పరివర్తన బాటతో పదుగురికీ సేవ | Sakshi
Sakshi News home page

పరివర్తన బాటతో పదుగురికీ సేవ

Published Mon, Apr 10 2023 4:57 AM

Establishment of yoga ashram in Pulimeru - Sakshi

పెద్దాపురం: జైలులో అలవర్చుకున్న ఆరోగ్య స్పృహను పదిమందికీ తెలియజేస్తున్నాడు మసిముక్కల రామకృష్ణ. అక్కడ నేర్చుకున్న యోగాను బయటకొచ్చి నేర్పుతూ గురువుగా ఎదిగాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఉదయం పోషకవిలువతో కూడిన అల్పాహారాన్ని అందిస్తున్నాడు.

కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంకు చెందిన రామకృష్ణకు సుమారు 15 ఏళ్ల కిందట రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఓ హత్య కేసులో యావజ్జీవ జైలుశిక్ష పడింది. అతను జైలుకు వెళ్లడంతో భార్య సుబ్బలక్ష్మి తన కుమారుడు, కుమార్తెను వెంటబెట్టుకుని పెద్దాపురం మండలం దివిలిలోని పుట్టింటికి చేరుకుంది. కుట్టు మిషన్‌ సాయంతో పిల్లలను పోషించింది. 2016 జనవరి 26న సత్పప్రవర్తన కేటరిగిలో రామకృష్ణ జైలునుంచి విడుదలయ్యాడు. స్వగ్రామం వెళ్లలేక అత్తావారింటికి కాపురం వచ్చేశాడు.

ఇటు..యోగా అటు వైద్య సేవలు
జైలు నుంచి వచ్చాక రామకృష్ణ తన చుట్టూ ఉన్న వారికి ఏదైనా మంచి చేయాలని స్పంకల్పించాడు. జైలులో నేర్చుకున్న యోగాపై చుట్టుపక్కల ఉన్నవారికి అవగాహన కల్పించడం ప్రారంభించాడు. దీనిపై పులిమేరు పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. పదిహేను రోజులకోసారి దివిలి, తిరుపతి, చదలాడ, పులిమేరు, పిఠాపురం మండలం విరవ గ్రామాల్లో యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నాడు. పులిమేరులో యోగాశ్రమాన్ని నెలకొల్పాడు. 12 ఏళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వృద్దుల వరకూ సుమారు వంద మంది యోగా నేర్చుకుంటున్నారు.

తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో రామకృష్ణ చిన్నపాటి రోగాలకు చికిత్స చేస్తున్నాడు. ఇటీవల పోషక విలువల ఆహారాన్ని తయారుచేసి విక్రయించడం ప్రారంభించాడు. సేంద్రీయ సాగు ఉత్పత్తులతో ఆ­­హా­ర పదార్ధాలను తయారుచేస్తున్నాడు. బ్లాక్‌ రైస్‌ ఇడ్లీ, నానబెట్టిన మొలకలు, కొర్రలు ఉప్మా, ఆయిల్‌లెస్‌ దోసె, చోడి అంబలిని కలిపి అల్పాహారంగా అమ్ముతున్నాడు.  సాధారణ ధరకే విక్రయిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాడు. 

పోషకాల టిఫిన్‌
రోజూ ఉదయం గతంలో ఇక్కడి హోటల్స్‌లో చాలామంది ఆయిల్‌తో చేసిన టిఫిన్లు తినేవారు. జనంలో ఇప్పుడు ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఉదయాన్నే ఇలాంటివి తినడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనని గ్రహిస్తున్నారు. అలాంటి వారంతా పౌషకాహారంపై మొగ్గు చూపిస్తున్నారు. సేంద్రీయ పంటలతో చేసిన వంటకాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ తరహా ఆహారాన్ని ఇష్టపడేవారు తన లాంటి వారి వద్ద కొనుగోలు చేస్తున్నారని రామకృష్ణ చెప్పారు.

ఆరోగ్యం గురించి తెలియజెప్పాలని..
జైలు నుంచి వచ్చాక పెట్రో­ల్‌ బంకు­లో పని­­చేశా­ను. టై­ల­రింగ్‌ వృత్తి చే­శాను. బతుకు గడవడం మాటెలా ఉ­న్నా జైలులో నేర్చుకున్న ఆరోగ్య అంశాలను పదిమందికీ తెలియజేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. జైలు జీవితం తెచ్చిన పరివర్తనను కూడా తెలి­యజెప్పాల్సిన అవసరం ఉందని అని­పించింది.

ఇక్కడ నేర్చుకున్న యోగా గురించి చుట్టూ ఉన్నవారికి చెప్పాలని భావించాను. నెమ్మది నెమ్మదిగా ముందడుగు వేయగలిగాను. చాలామంది ప్రోత్సహించారు. ఏం చేసినా ప్రజల ఆరోగ్యం పెంచేదిగా ఉండాలని భావించి ఇప్పుడు పోషకాహారాన్ని కూడా  విక్రయి­స్తు­న్నాను. వ్యాపార దృక్పథంతో కాదు.  ఆ­రోగ్య స్పృహ కలిగించాలనేదే నా ప్రయత్నం. 
– మసిముక్కల రామకృష్ణ,  పులిమేరు

Advertisement

తప్పక చదవండి

Advertisement