అభిమానుల ‘ఆత్మీయ’ వరద | Sakshi
Sakshi News home page

అభిమానుల ‘ఆత్మీయ’ వరద

Published Sat, Nov 25 2023 4:13 AM

Fan rally with 500 bikes in Nandyala district - Sakshi

సాక్షి, నంద్యాల: సామాజిక సాధికార యాత్రకు ప్రజలు పోటెత్తారు. ఆత్మకూరు పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కనుచూపు మేర ఎటుచూ­సినా, ఇసుకేస్తే రాలనంతలా జనం తరలివచ్చారు. సుమారు 500 బైక్‌లతో నిర్వహించిన బైక్‌ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన శుక్రవా­రం నిర్వహించిన సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గజ మాలలు, డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్లతో తమ అభి­మాన నాయకులకు అపూర్వ స్వాగతం పలికారు.

కరోనాలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
కరోనా కాటేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప్రశంసించారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే.. నమ్మిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం కాబట్టే.. తామంతా కాలర్‌ ఎగరేసి ఓట్లడుగుతున్నట్టు తెలిపారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వారిని ఓట్లడుగుతారని ఎద్దేవా చేశారు.

బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి అమలు చేశారు: మంత్రి కారుమూరి
బీసీ డిక్లరేషన్‌ సభలో చెప్పిన ప్రతి మాటనూ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌ అమలు చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం యాదవులకు పదవులు ఇవ్వలేదని, కేవలం సీఎం జగన్‌ మాత్రమే యాదవులకు సముచిత గౌరవం ఇచ్చారని చెప్పారు. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. తన కులం వారికి కాకుండా బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏనాడూ రాజ్యసభ టికెట్‌ ఇచ్చిన పాపాన పోలేదన్నారు.

ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు పంపి బీసీల గళాన్ని దేశవ్యాప్తంగా వినిపించేలా సీఎం జగన్‌ కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాను అమెరికా వెళ్లినప్పుడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తనతో మాట్లాడిన మాటలను కారుమూరి గుర్తు చేసుకున్నారు. ‘మా నాన్న ఓ రిక్షా కార్మికుడు.. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో నేను చదువుకుని అమెరికాకు రాగలిగా.. మా కుటుంబమంతా వైఎస్సార్‌ కుటుంబానికి రుణపడి ఉంటుంది’.. అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడని చెప్పారు. 

దళితుల పట్ల నిబద్దతను చాటుకున్న సీఎం జగన్‌ : మంత్రి ఆదిమూలపు 
పూర్వకాలంలో దళితులు చదువుకుంటే నాలుక కోసే­వారని, చెవుల్లో సీసం పోసేవారని.. కానీ, సీఎం జగన్‌ తన కేబినెట్‌లో ఓ దళితుడిని విద్యాశాఖ మంత్రిగా చేసి దళితుల పట్ల తనకున్న నిబద్ధతను నిరూ­పించుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అ­న్నారు. 2019లో 151 కి.మీ వేగంతో ఫ్యాన్‌ను తిప్పారని, 2024 ఎన్నికల్లో 175 కి.మీ వేగంతో ఫ్యాన్‌ను తిప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, ఇసాక్‌ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్‌­ఖాన్, తొ­గురు ఆర్థర్, కర్నూలు మేయర్‌ రామయ్య పాల్గొన్నారు.  

Advertisement
Advertisement