‘పట్టు’కుంటే బంగారమే!.. ఏడాదికి రూ.లక్షల ఆదాయం

30 Jan, 2023 14:40 IST|Sakshi
కిండ్రకాలనీలో మల్బరీ సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్న ఆదర్శ మహిళా రైతు సత్యవతి

రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రంపచోడవరం డివిజన్‌లో 200 ఎకరాల్లో సాగవుతుండగా 150 ఎకరాలు మండలంలోనే సాగవుతోంది. ఎకరా విస్తీర్ణంలో మల్బరీ సాగు ద్వారా ఏడాదికి రూ.4.8 లక్షల విలువైన 600 కిలోల పట్టుగూళ్ల దిగుబడి సాధిస్తున్నారు. జిల్లాలో పట్టుపరిశ్రమపై కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా చూపింది. పట్టుగూళ్లు కొనేవారు లేక పట్టుగుడ్లు (లేయింగ్స్‌) లభించక రెండేళ్లలో రంపచోడవరం డివిజన్‌లో 300 నుంచి 200 ఎకరాలకు సాగు తగ్గిపోయింది. అప్పటిలో పట్టుగూళ్ల ధర రూ.300కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

మార్కెట్లో మెరుగైన పరిస్థితులు 
కోవిడ్‌ ప్రభావం తగ్గిన తరువాత మార్కెట్లో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. పట్టుగూళ్ల ధర కిలో రూ.600 నుంచి రూ.700 వరకు పెరిగింది. దీంతో మళ్లీ రైతులు సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదాయం ఆశాజనకంగా ఉన్నందున మండలంలో 20 ఎకరాలు అదనంగా సాగు పెరిగింది వై.రామవరం మండలంలో 4, రంపచోడవరం మండలంలో 7 ఎకరాలు, అడ్డతీగలలో 4 ఎకరాల్లో కొత్తగా పంట వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని పట్టుపరిశ్రమశాఖ అధికారవర్గాలు తెలిపాయి.

రంపచోడవరం డివిజన్‌లో ఉన్న గరప నేలలు మల్బరీ తోటల పెంపకానికి అనువైనవని పట్టుపరిశ్రమ శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యవంతమైన మల్బరీ ఆకులు దిగుబడి వస్తున్నందున నాణ్యమైన పట్టు లభిస్తుందని వారు చెబుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే పట్టుగూళ్లకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందని చెప్పారు. ఇక్కడి పట్టు గూళ్లను హనుమాన్‌ జంక్షన్‌ మార్కెట్లో విక్రయిస్తున్నారు.

ఉత్తమ రైతుకు పురస్కారం 
మండలంలోని కిండ్రకాలనీకి చెందిన పామి చినసత్యవతి పట్టుపరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ విస్తీర్ణం సాగు చేపట్టిన ఈమె రికార్డు స్థాయిలో ఆదాయం పొందారు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టి రూజ4.25 లక్షల ఆదాయం పొందారు. ఈమెను ఇటీవల ఏలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సిల్క్‌ బోర్డు అధికారులు సత్కరించారు.
చదవండి: అల్లుడు బియ్యం అదుర్స్‌!

వాణిజ్య పంటల కన్నా లాభం
రైతులు వాణిజ్య పంటల కన్నా మల్బరీ సాగు చేపట్టడం మంచిది. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల వల్ల అప్పటిలో పట్టుగూళ్ల ధర పతనమైంది. అలాంటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎదురుకాదు. అప్పటిలో కిలో రరూ.600 నుంచి రూ.300కు పోయింది. ఇప్పుడు ధర చాలా బాగుంది. పట్టుపరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వ్యవసాయ సూచనలు అందించి ప్రోత్సహిస్తున్నాం. వచ్చే జూన్‌ నాటికి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.  
–రంగారావు, అసిస్టెంట్‌ సెరికల్చర్‌ అధికారి, రంపచోడవరం
వివరాలకు: రంగారావు, అసిస్టెంట్‌ సెరికల్చర్‌ అధికారి, రంపచోడవరం  9652714914 

మరిన్ని వార్తలు