శరవేగంగా పింఛన్ల పంపిణీ | Sakshi
Sakshi News home page

శరవేగంగా పింఛన్ల పంపిణీ

Published Sun, Feb 6 2022 3:43 AM

Faster distribution of pensions in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా 60,87,399 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారికి ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీ చేసింది. రూ.1,547.63 కోట్ల మొత్తాన్ని వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెలలో 61.51 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,563.75 కోట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి 99 శాతం మందికి పంపిణీ పూర్తి చేశారు. గరిష్టంగా కర్నూలు జిల్లాలో 99.2 శాతం మందికి పంపిణీ జరిగినట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం లోహరిజోలకు చెందిన వృద్ధురాలు పల్లి మిన్నమ్మ ఒడిశా రాష్ట్రం ఖండవ గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లి తిరిగి రాలేకపోవడంతో వలంటీర్‌ గోర్జన శేషగిరిరావు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి మిన్నమ్మకు పింఛన్‌ అందించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్‌కుమార్‌ కిడ్నీ సమస్యతో తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పింఛనుదారులైన అతని భార్య, తల్లి కూడా అతనికి సాయంగా అక్కడికి వెళ్లారు. ఆ ముగ్గురికీ సచివాలయ ఉద్యోగి లోకేశ్‌ తిరుపతి వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేశాడు.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు బీఎస్‌ కండ్రిగకు చెందిన కుమారి దామోదరం అనే వృద్ధుడు చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వలంటీర్‌ పాకం సాయికృష్ణ అక్కడకు వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేశాడు. అనంతపురం జిల్లా చీకలగురికికి చెందిన వృద్ధురాలు గంగమ్మ  కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా... వలంటీర్‌ మారుతి శనివారం 170 కి.మీ. దూరం ప్రయాణించి గంగమ్మకు పింఛన్‌ అందజేశాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం నిడిగుంట గ్రామానికి చెందిన రామమూర్తి ఆపరేషన్‌ నిమిత్తం కుప్పం పీఈఎస్‌ ఆస్పత్రిలో చేరాడు. వలంటీర్‌ యమున శనివారం అక్కడికే వెళ్లి పింఛన్‌ అందించింది.  

Advertisement
Advertisement