శ్రీరస్తు.. శుభమస్తు! | Sakshi
Sakshi News home page

శ్రీరస్తు.. శుభమస్తు!

Published Sun, Feb 11 2024 5:44 AM

Good times from 13th of this month - Sakshi

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): శుభ ముహూ­ర్తాల మాఘమాసం వచ్చేసింది. పెళ్లి కళను వెంటబెట్టుకొచ్చింది. ‘శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్న­మస్తు’ అనుకుంటూ శుభముహూర్తాలు నిశ్చయించుకున్న కుటుంబాలన్నీ వధూవరులను పెళ్లి పీటలెక్కించి చిద్విలాసాల నడుమ వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

మాఘ మాసం నుంచి ఛైత్ర­మాసం వరకు మూడు నెలల పాటు శుభకా­ర్యాలకు మంచి ఘడియలు ఉన్నాయని పండితులు పేర్కొంటున్నారు. మాఘమాసం ప్రారంభం కావటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు జరిపించేందుకు భారీగా ముహూర్తాలు నిశ్చయిస్తున్నట్టు పురోహితులు పేర్కొంటున్నారు. శుభకార్యాలకు ఉత్తరాయణం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. ఆ క్రమంలో మాఘ­మాసంలో ఈ నెల 13 నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి.

రాష్ట్రంలో లక్షకుపైగా వివాహాలు
రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో సుమారు లక్ష వరకూ వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. ప్రధా­నంగా తిరుపతి, విజయవాడ, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో వారి వారి నమ్మకాలు, మొక్కులతో వేలాది జంటలు వివాహంతో ఒక్కటి కానున్నాయి. ఆ పుణ్యక్షేత్రాలతో పాటుగా రాష్ట్రంలోని కల్యాణ మండపాలు ఆయా ముహూర్తాల్లో అధిక శాతం ఇప్పటికే బుక్కయ్యాయి. కల్యాణ మండపాలతో పాటుగా హోటల్స్‌­లోనూ వివాహాలను జరుపుకోవ­టానికి ఆసక్తి చూపుతున్నారు. 

ఏప్రిల్‌ 28 నుంచి మూఢం
ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి మూఢం ప్రారంభమవుతుంది. మూఢం శుభకార్యాలకు మంచిది కాదని, అందువల్ల ఏ ముహూర్తాలూ ఉండవని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా మే, జూన్, జూలై మాసాల్లో మూఢంతో పాటు ఆషాఢ మాసం సైతం ప్రారంభం కానుంది. భాద్రపద మాసంలోనూ ముహూర్తాలు ఉండవు.

తిరిగి ఆగస్టులో శ్రావణం వచ్చే వరకూ ముహూర్తాలు లేవు. ఏప్రిల్‌ తరువాత వివాహాలు జరుపుకోవాలనుకునే వారు శ్రావణ మాసం వరకూ ఆగాల్సిందేనని పండితులు చెబుతున్నారు.

మూడు మాసాల్లో కల్యాణ ఘడియలు
మాఘ మాసం (ఫిబ్రవరి)లో 13, 14, 17, 18, 24, 28, 29, మార్చి 2, 3 తేదీలు, ఫాల్గుణ మాసం (మార్చి)లో 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30, ఏప్రిల్‌ 3, 4 తేదీలు, ఛైత్ర మాసం (ఏప్రిల్‌)లో 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆయా శుభ ఘడియల్లో వివాహాలు జరిపించేందుకు చాలా మంది తల్లిదండ్రులు ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. 

మార్కెట్‌కు పెళ్లి కళ
వివాహాలపై ఆధారపడ్డ వర్గాలకు డిమాండ్‌ పెరిగింది. ప్రధానంగా పురోహితులు, కేటరింగ్, డెకరేషన్, మంగళ వాయిద్యాలు, ఆర్కెస్ట్రా, వస్త్ర దుకాణాలు, బంగారు నగల దుకాణాలు, కల్యాణ మండపాలు వంటి 20 రంగాలు వివాహాలపై ఆధారపడి కొనసాగుతున్నాయి. వీటిని సమన్వయం చేస్తూ ఈవెంట్‌ మేనేజర్లు వివాహాలను గ్రాండ్‌గా జరిపేందుకు రాష్ట్రంలో ఉన్నారు. ఈ మూడుఎ మాసాలు ఆయా రంగాల వారంతా బిజీ కానున్నారు.

మాఘం నుంచి ౖఛైత్రం వరకు..
మాఘమాసం నుంచి ఛైత్ర మాసం వరకూ మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువ మంది ఈ ముహూర్తాల్లో వివాహాలు జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఛైత్రం చివరిలో మూఢం ప్రారంభమవుతుంది. శ్రావణం వచ్చే వరకు ముహూర్తాలు లేవు.
– పొన్నంగిపల్లి శ్రీరామచంద్రమూర్తి, పండితుడు, విజయవాడ 

Advertisement
Advertisement