లోన్‌ యాప్‌లకు కళ్లెం..వేధింపుల కట్టడికి గూగుల్‌ చర్యలు | Sakshi
Sakshi News home page

లోన్‌ యాప్‌లకు కళ్లెం.. వేధింపుల కట్టడికి గూగుల్‌ చర్యలు.. మే 31 నుంచి కొత్త విధానం అమలు

Published Sat, Apr 8 2023 4:59 AM

Google measures to stop loan app harassment - Sakshi

సాక్షి, అమరావతి : లోన్‌ యాప్‌ సంస్థల వేధింపులకు ఎట్టకేలకు కళ్లెం పడనుంది. భారీ వడ్డీలతో బెంబేలెత్తిస్తూ, రుణ గ్రహీతల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధించే లోన్‌ యాప్‌ సంస్థల కట్టడికి గూగుల్‌ సిద్ధమవుతోంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్‌ యాప్‌ సంస్థలకు అందుబాటులో లేకుండా మార్గదర్శకాలు రూపొందించింది. కొత్త విధానం మే 31 నుంచి అమలులోకి రానుంది. 

ఫొటోలు, వీడియోల మార్ఫింగులతో వేధింపులు 
చైనా కేంద్రంగా పనిచేస్తున్న లోన్‌ యాప్‌ సంస్థలు అత్యధిక వడ్డీలు, పారదర్శకతలేని విధానాలతో రుణ గ్రహీతలను వేధిస్తున్నాయి. ఎంతగా వాయిదాలు చెల్లిస్తున్నా వడ్డీ, అసలు కలిపి అప్పు కొండలా పెరుగుతుందే తప్ప తగ్గదు. వాయిదాల చెల్లింపులో జాప్యం చేస్తే రుణ గ్రహీతల మొబైల్‌ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని దుర్వినియోగం చేస్తున్నాయి.

రుణం తీసుకున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి బంధువులు, మిత్రులకు వాట్సాప్‌ చేస్తూ వేధిస్తున్నాయి. ఈ అవమాన భారంతో దేశంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే వ్యక్తుల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం అంతా ఆ యాప్‌ నిర్వాహకులకు అందుబాటులోకి తేవాలి. ఈమేరకు యాక్సెస్‌కు అనుమతిస్తేనే లోన్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది.

రుణం కావాలన్న ఆతృతలో వ్యక్తులు యాక్సెస్‌కు అనుమతిస్తున్నారు. దీన్నే ఆ సంస్థలు దుర్వినియోగం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయి. దాంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం, ఆర్థిక శాఖలు లోన్‌యాప్‌ సంస్థలపై చర్యలకు ఉపక్రమించాయి. మనీలాండరింగ్‌కు, ఆర్థి క మోసాలకు పాల్పడుతున్న పలు లోన్‌ యాప్‌ కంపెనీలపై కేసులు పెట్టాయి. 2022లో 2 వేల కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. 

వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్‌ ఇవ్వొద్దని గూగుల్‌కు ఆదేశం 
వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్‌ యాప్‌ సంస్థలకు అందుబాటులో లేకుండా చేయడమే దీనికి పరిష్కారమని కేంద్ర హోం శాఖ భావించింది. వ్యక్తిగత సమాచారం కోరే లోన్‌ యాప్‌లకు ప్లే స్టోర్‌లో అవకాశం ఇవ్వద్దని గూగుల్‌కు కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ యాప్‌ సంస్థలతో పాటు గూగుల్‌పైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తేలి్చచెప్పింది. దాంతో గూగుల్‌ దిగి వచ్చింది. వ్యక్తిగత సమాచారం లోన్‌యాప్‌లకు అందుబాటులో లేకుండా చేసేందుకు చర్యలు చేపడుతోంది. 

లోన్‌ యాప్‌ కంపెనీలకు గూగుల్‌ మార్గదర్శకాలు
భారత్‌లో వ్యాపారం చేసే లోన్‌ యాప్‌ సంస్థలకు గూగుల్‌ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే వారి వ్యక్తిగత సమాచారాన్ని కోరకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు యాప్‌ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని చెప్పింది.

భారత్‌లో నాన్‌ బ్యాంకింగ్‌ వ్యవహారాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను పాటించాలని, ఈమేరకు డిక్లరేషన్‌ ఇచ్చే యాప్‌ సంస్థలనే గూగుల్‌ ఇండియా ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కొత్త విధానం ప్రకారం లోన్‌ యాప్‌లను మాడిఫై చేసి ఈ ఏడాది మే 31లోగా అప్‌లోడ్‌ చేయాలని చెప్పింది. వాటినే ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో దేశంలో లోన్‌ యాప్‌ల వేధింపులకు కళ్లెం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.  

Advertisement
Advertisement